రచ్చబండ రసాభాస
=సమస్యలు విన్నాకనే మాట్లాడాలని ప్రజల పట్టు
=సమైక్య ద్రోహి చింతా అంటూ నినాదాలు
=ప్రజల సమస్యలు వినకుండానే వెనుదిరిగిన ఎంపీ
=కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ధర్నా
=ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకుల అరెస్టు
తిరుపతి కార్పొరేషన్ , న్యూస్‌లైన్: తిరుపతిలో గురువారం నిర్వహించిన 3వ విడత రచ్చబండ రసాభాసగా మారి అర్ధాంతరంగా ముగిసింది. కార్పొరేషన్ పరిధిలోని 36 రెవెన్యూ వార్డుల్లోని ప్రజలకు నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో గురువారం మధ్యాహ్నం 2గంటలకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహనిర్మాణాలు, ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు విద్యుత్ బకాయిల చెల్లింపులు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అయితే ఇవేమీ పంపిణీ చేయలేదు.
గంటల తరబడి వేచివున్న లబ్ధిదారులు, ప్రజల సమస్యలను వినకుండానే 8 నిమిషాల్లోనే రచ్చబండను అర్ధాంతరంగా ముగించారు. మధ్యాహ్నం 2.40 గంటలకు ఎంపీ చింతా మోహన్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వేదికపై కొచ్చారు. తొలుత కార్పొరేషన్ కమిషనర్ సకలారెడ్డి రచ్చబండ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించారు. అనంతరం ఎంపీ చింతామోహన్ మాట్లాడతారని చెప్పడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయపునేని మురళీ అడ్డుకున్నారు.
ముందు ప్రజల సమస్యలు వినాలని, ఆపై ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం నిత్యం వార్డుల్లో తిరుగుతున్న ఎమ్మెల్యే కరుణాకర రెడ్డిని మాట్లాడించాలని పట్టుబట్టారు. ఇంతలో వేదిక ముందు ఉన్న సభలోంచి మహిళలు లేచి ‘‘సమైక్యాంధ్ర ద్రోహి ఎంపీ డౌన్‌డౌన్’’ అంటూ నినాదాలు చేశారు. 100 రోజులకు పైగా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతుంటే ముఖం చాటేసిన ఎంపీ చింతా ఇప్పుడు ఏమొహం పెట్టుకుని వచ్చారంటూ వేదికపైకి దూసుకొచ్చారు. ‘‘ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకుండా, రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న మిమ్మల్ని రచ్చబండ పెట్టమని మేము అడిగామా’’ అంటూ నిలదీశారు.
ఇంతలో పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీదేవి వేదికపై ఏర్పాటు చేసిన టేబుల్‌పైకి ఎక్కి ఎంపీకి మద్దతుగా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు వారిపై తిరగబడ్డారు. ఒకరిని ఒకరు తోసుకునే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజల మధ్యలోంచి నీళ్లబాటిళ్లు వేదికపైకి దూసుకొచ్చాయి. ప్రజల వ్యతిరేకతను గమనించిన ఎంపీ చింతా తన అనుచరులతో కలసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వ్యవహారమంతా ఎనిమిది నిముషాల్లో జరిగిపోయింది.
అయితే రచ్చబండను కొనసాగించాలంటూ ఎమ్మెల్యే కార్పొరేషన్ కార్యాలయం ముందు 20 నిమిషాల పాటు ధర్నాకు దిగారు. అనంతరం కార్యాలయం వెలుపల నడిరోడ్డుపై ఎండలో పడుకుని నిరసనకు దిగారు. అర్ధగంట పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఈస్ట్ డీఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సీఐ గిరిధర్ ఎమ్మెల్యే కరుణాకరరెడ్డిని అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా ఎంపీపై బాటిల్ విసిరారనే ఆరోపణతో నాయకులు రాజేంద్ర, రమణమ్మను అరెస్టు చేశారు.
రచ్చబండ కాదు .. గుదిబండ
- మీడియాతో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ ప్రభుత్వం రచ్చబండ పేరుతో ప్రజల నెత్తిన గుదిబండ మోపుతోందని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. గురువారం రచ్చబండ రసాభాసగా మారి అర్ధాంతరంగా ముగియడంతో ఆయన మీడియాతో మాట్లాడారు. గుక్కెడు నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం అడుగడుగునా బ్రాంది షాపులను ఏర్పాటు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి అభివృద్ధికి రూ.450 కోట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి ఆఖరికి 450 పైసలు కూడా ఇవ్వలేదన్నారు.
ఇది రచ్చబండ కాదని కిరణ్‌కుమార్‌రెడ్డి మనపై వేయాలని చూస్తున్న గుదిబండ అన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన రచ్చబండ లక్ష్యాన్ని ఈప్రభుత్వం నీరుగారుస్తోందని చెప్పారు. ఇదివరకు నిర్వహించిన 1, 2 రచ్చబండల్లో ఇచ్చిన అర్జీలకే దిక్కులేకుంటే ఇప్పుడు ఏమొహం పెట్టుకుని రచ్చబండ నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎమ్మెల్యేగా తాను వేదికపై ఉన్నప్పటికీ అధికారులు ఎలా వెళ్తారని మండిపడ్డారు. అనంతరం రచ్చబండకు వచ్చి బయట వేచివున్న మహిళలతో మాట్లాడారు. వారి సమస్యలను ఆలకించారు.
హౌసింగ్ డీఈ బాలకృష్ణారెడ్డి, అర్బన్ తహశీల్దార్ నాగార్జునరెడ్డిని అర్జీలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు ఎస్కె బాబు, షఫీఅహ్మద్ ఖాదరీ, రాజేంద్ర, బొమ్మగుంట రవి, కట్టా గోపీయాదవ్, రాయపునేని మురళి, అమరనాథ్‌రెడ్డి, ఇమాం, రాజేంద్రరెడ్డి, కొమ్ము చెంచయ్య యాదవ్, వెంకటేశ్‌రెడ్డి, కుసుమ, పునీత, మునీశ్వరి, రమణమ్మ, లతారెడ్డి, గీత, పుష్పాచౌదరి పాల్గొన్నారు.