‘పరిషత్’ పోరు షురూ
ఏలూరు, న్యూస్‌లైన్: ఎన్నికల జాతర మొదలైంది. స్వల్ప వ్యవధిలోనే ముచ్చటగా మూడో ఎన్నికలకు నగరా మోగింది. ఇప్పటికే మునిసిపల్, సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ ఖరారుకాగా, తాజాగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల వంతు వచ్చింది. జిల్లాలో 46 జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (జెడ్పీటీసీ), 903 మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (ఎంపీటీసీ) ఎన్నికలకు సోమవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 17న కలెక్టర్ సిద్ధార్థజైన్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఎన్నికలు ఏప్రిల్ 6న జరుగనున్నాయి.
ఓటర్లు ఇలా....
జిల్లా పరిషత్ ఎన్నికలలో 21,48,462 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 10,82,067, మహిళలు 10,66,395 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు 59,688, ఎస్సీ ఓటర్లు 4,42,591 మంది, బీసీ ఓటర్లు 8,87,215, ఓసీ ఓటర్లు 7,40,968 మంది ఉన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోనే నామినేషన్ల స్వీకరణకు సీఈవో డి.వెంకటరెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.
పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు
జెడ్పీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. దాదాపు 3,400 వరకు పోలింగ్ కేంద్రాలను గతంలో ఏర్పాటు చేయగా, మరో 300 కేంద్రాలు పెరిగే అవకాశం ఉందని అంచనా.
జెడ్పీటీసీకి తెలుపు.. ఎంపీటీసీకి గులాబీ రంగు బ్యాలెట్
జెడ్పీ ఎన్నికలను ఈసారి కూడా బ్యాలె ట్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు. బ్యాలెట్ ముద్రణకు ఎంతెంత అవసరమో అన్నదానిపై జెడ్పీ వర్గాలు కసర త్తు ప్రారంభించాయి. జెడ్పీటీసీకి తెలుపు రంగు, ఎంపీటీ సీకి గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను వినియోగించనున్నారు.
పారదర్శకంగా ఎన్నికలు
జిల్లాలో జెడ్పీ ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్, జెడ్పీ ప్రత్యేకాధికారి సిద్ధార్థజైన్ తెలిపారు. అధికారులంతా పారదర్శకంగా పనిచేస్తు న్నామని చెప్పారు.