నేడు దుబ్బాక బడికి పూర్వ విద్యార్థి కేసీఆర్
► రూ.4.67 కోట్లతో నిర్మించనున్న నూతన పాఠశాల భవనానికి శంకుస్థాపన
దుబ్బాక: మెదక్ జిల్లా దుబ్బాక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. అరకొర వసతుల మధ్య విద్యనభ్యసించిన నాటి విద్యార్థి కేసీఆర్.. నేడు ముఖ్యమంత్రి హోదాలో పాఠశాల నూతన భవన శంకుస్థాపనకు రానున్నారు. తాను అష్టకష్టాలు పడి విద్యను పూర్తిచేశానని, తనకొచ్చిన బాధలు ఇప్పుడు చదువుకునే విద్యార్థులకు రావొద్దన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి పాఠశాల నూతన భవన నిర్మాణానికి రూ.4.67 కోట్లను మంజూరు చేశారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా అధునాతన పద్ధతుల్లో పాఠశాల భవనాన్ని నిర్మించాలని యోచిస్తున్నారు.
ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వ పాఠశాలతోపాటు రూ.4.86 కోట్లతో రామసముద్రం చెరువు సుందరీకరణ, నగర పంచాయతీకి ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాటు చేస్తున్న 33/11 కేవీ సబ్ స్టేషన్లకు సీఎం శంకుస్థాపన చేస్తారు. కాగా, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆదివారం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రాస్‌లతో కలసి మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షించారు. భక్తుల సౌకర్యార్థం పట్టణ కేంద్రంలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ పనులను పరిశీలిస్తారన్నారు. అనంతరం బాలాజీ గార్డెన్లో నియోజక అభివృద్ధి పనులు, మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారని చెప్పారు.