School managements
-
ఈ బరువును ఏం చేద్దాం?
స్కూల్లో టీచర్‌గానీ హెడ్మాస్టర్ గానీ ఎవరైనా పిల్లవాడి స్కూల్‌బ్యాగ్ వీపున తగిలించుకుని ఒక పదిహేను నిమిషాలు నిలబడగలరా? అన్నీ టెక్స్›్టలు అన్ని నోట్సులూ రోజూ తేవాలంటే పిల్లల వీపున పెరుగుతున్న బరువు ఎంత? టెక్ట్స్బుక్కుల పేజీలు పెరిగితే చదువు భారం. వీపున ఈ బరువు భారం. తల్లిదండ్రులు, న్యాయస్థానాలు పదే పదే చెప్పినా స్కూలు యాజమాన్యాలు మాత్రం ఈ బరువును పట్టించుకోవడం లేదు. పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఈ బరువును ఏం చేద్దాం? నైట్ డ్యూటీ చేసి వచ్చే ఆ తండ్రి ఉదయాన్నే లేవక తప్పదు. ఇద్దరు కూతుళ్లను స్కూల్ బస్ ఎక్కించాలి. ఒకరు ఆరు, ఒకరు ఎనిమిది. వాళ్లు వెళ్లి ఎక్కగలరు. కాని వాళ్ల స్కూల్ బ్యాగులను మోస్తూ మాత్రం వెళ్లి ఎక్కలేరు. వాళ్ల ఇంటి నుంచి ఒక ఫర్లాంగు దూరంలో ఉన్న రోడ్డు మీద బస్సు ఆగుతుంది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ నుంచి వాళ్లు బ్యాగులను మోసుకుంటూ బస్ దగ్గరకు వెళ్లి ఎక్కేసరికి వాళ్ల పని అయిపోతుంది. నాలుగు రోజులు ఇలా చేస్తే ఐదో రోజు ఒళ్లు నొప్పులు అని స్కూల్ ఎగ్గొడతారు. అందుకే తండ్రి లేచి ఆ స్కూల్ బ్యాగులను స్కూటర్ మీద పెట్టుకుని బస్ వరకు వెళ్లి ఎక్కిస్తాడు. మళ్లీ స్కూల్లో బస్ ఆగిన చోటు నుంచి క్లాస్ రూమ్ వరకూ వారు ఆ బ్యాగ్ మోయాల్సిందే. ఏం అంత బరువా? అనంటే ఆరో క్లాసు అమ్మాయి బ్యాగు బరువు 8 కిలోలు ఉంటుంది. ఎనిమిదో క్లాసు అమ్మాయి బ్యాగు బరువు పది కిలోలు ఉంటుంది. నిజం! వెన్ను వంచే బరువు స్కూలుకు పిల్లలు చదువుకోవడానికే వెళతారు. కాని చదువు పేరుతో బరువు లెత్తే కూలీలుగా వారు వెళ్లకూడదు. జాతి తన వెన్నుముక మీద నిలబడాలని కోరుకునే మనం చిన్న వయసు నుంచి పిల్లల వెన్ను వంచేస్తున్నాం. శాస్త్రీయ సూచన ప్రకారం ఒక విద్యార్థి స్కూల్ బ్యాగ్ బరువు అతని శరీర బరువులో పది శాతం ఉండాలి. అంటే 20 కిలోల అమ్మాయి/ అబ్బాయి కేవలం రెండు కిలోల స్కూల్ బ్యాగ్‌ను మోయాలి. 30 కిలోల బరువుంటే మూడు కిలోలే మోయాలి. ఒక అంచనా ప్రకారం ఇవాళ ప్రైమరీ లెవల్లో అంటే 5 వ తరగతి వరకూ పిల్లలు 6 నుంచి 12 కిలోల బరువున్న స్కూల్ బ్యాగులు మోస్తున్నారు. హైస్కూలు పిల్లలు 12 నుంచి 17 కిలోల బరువు స్కూల్ బ్యాగులు మోస్తున్నారు. ఎన్.సి.ఇ.ఆర్.టి. తాజా స్కూల్ బ్యాగ్ పాలసీ ప్రకారం 5 వ తరగతి లోపు పిల్లలకు రెండున్న కేజీలకు మించి బరువు ఉండరాదు. 6 నుంచి 10 చదివే పిల్లలకు నాలుగున్నర కేజీలకు మించి బరువు ఉండరాదు. ఈ పాలసీను స్కూళ్లు గౌరవిస్తున్నాయా? ఆరోగ్య సమస్యలు స్కూల్ బ్యాగును మోయడం కూడా తప్పేనా అని కొందరు వితండంగా మాట్లాడవచ్చు గాని అవసరానికి మించిన బరువు వీపు మీద పిల్లలు రోజూ మోయడం వల్ల వారికి వెన్ను సమస్యలు వస్తాయి. పాదంపై పట్టు మారుతుంది. నడక తీరు మారుతుంది. భుజం నొప్పి వంటివి బాధిస్తాయి. రోజూ ఆ బరువు మోసుకెళ్లే విషయం వారికి ఆందోళన గురి చేస్తుంది. కొంతమంది పిల్లలు ఈ మోత మోయలేక ఏదో ఒక వంక పెట్టి స్కూల్ ఎగ్గొడుతున్నారన్న సంగతి నిపుణులు గమనించారు కూడా. ఇంత బరువు ఎందుకు? ప్రభుత్వం కాని/ ప్రయివేటు కాని/ ఛారిటీ స్కూళ్లుగాని పిల్లలు బాగా చదవాలని ఆరు నుంచి ఎనిమిది పిరియడ్లు చెబుతున్నారు. ప్రతి సబ్జెక్ట్ ప్రతిరోజూ ఉండేలా చూస్తున్నారు. ఆ సబ్జెక్ట్‌కు టెక్స్›్టబుక్, నోట్ బుక్, వర్క్‌బుక్... ఇవిగాక స్పెషల్ నోట్‌బుక్కులు... ఇన్ని ఉంటున్నాయి. నీటి వసతి లేకపోయినా తల్లిదండ్రుల జాగ్రత్త వల్ల వాటర్ బాటిల్ ఒక బరువు. లంచ్ లేని చోట లంచ్ బ్యాగ్. ఒక్కోసారి స్పోర్ట్స్ అని బ్యాట్లు కూడా మోసుకెళతారు. ఇన్ని బరువులు 15 ఏళ్ల లోపు పిల్లలు మోయడం గురించి ఎన్నోసార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, కోర్టులు మందలించినా పరిస్థితిలో మార్పులేదు. ఏం చేయాలి? స్కూళ్లల్లో ప్రతి పిల్లవాడూ టెక్స్›్టబుక్ తేవాల్సిన అవసరం లేని విధానం ఉండాలి. కొన్ని టెక్ట్స్›బుక్కులను క్లాసుల్లో ఉంచాలి. అలాగే ప్రతి క్లాస్‌లో తాళాలు ఉన్న బుక్షెల్ఫ్లను ఏర్పాటు చేసి విద్యార్థులు తమకు ఆ రోజుకు అవసరం లేని పుస్తకాలను అందులో పెట్టుకుని వెళ్లేలా చూడాలి. పిరియడ్లను తగ్గించాలి. రోజూ అన్ని సబ్జెక్ట్‌లు చెప్పాల్సిన అవసరం లేని రీతిలో టైంటేబుల్ వేయాలి. టైంటేబుల్లో లేని సబ్జెక్ట్ పుస్తకాలు తేవాల్సిన పని లేదని పిల్లలకు చెప్పాలి. అలాగే ప్రభుత్వాల వైపు నుంచి ఒక క్లాసు విద్యార్థికి అన్ని క్లాసుల టెక్స్›్టబుక్కులు ఎంత బరువు అవుతున్నాయో, ఏ సబ్జెక్ట్‌కు ఎన్ని పేజీల పాఠ్యపుస్తకాలు ఉన్నాయో అంచనా వేయించాలి. ఒక సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా మరొక సబ్జెక్ట్ వారు పాఠ్యపుస్తకాలను తయారు చేసేలా కాకుండా అన్ని సబ్జెక్ట్‌ల వారూ ఆ ఫలానా క్లాసుకు మొత్తం ఎన్ని పేజీల పాఠ్యపుస్తకాలు తయారు చేస్తున్నారో చూసుకోవాలి. అసలు ‘ఎక్కువ సిలబస్సే మంచి చదువు’ భావన పై చర్చ జరగాలి. ఇక తల్లిదండ్రులైతే ఎప్పటికప్పుడు పిల్లల బ్యాగులు చెక్ చేస్తూ వాటిలో అనవసరమైన వస్తువుల బరువు లేకుండా చూసుకోవాలి. టైమ్‌టేబుల్ చెక్ చేసి ఆ పుస్తకాలే ఉంచాలి. బస్ ఎక్కేప్పుడు దిగేప్పుడు ఆ బరువును అందుకునే వీలుంటే తప్పక అందుకోవాలి. పిల్లల భుజాలకు అనువైన సరైన బ్యాగ్‌లు కొనివ్వాలి. -
అమ్మ ఒడి నుంచి అక్షరాల గుడికి
ఇప్పటి వరకు ఆకాశాన ఇంద్రధనస్సులోని ఏడు రంగులూ వారివే.. ఈత సరదాలు, వేసవి ఎండలు అన్నీ వారివే.. వేసవి సెలవుల్లో వారికి ప్రతి ఘడియా మధురమే.. అందుకే సెలవుల అమృత జ్ఞాపకాలన్నింటినీ చిరునవ్వుల్లో దాచుకుని.. నేడు అనురాగపు అమ్మ ఒడి నుంచి చదువులమ్మ గుడిలోకి అడుగుపెడుతున్నారు విద్యార్థులు.. మరో వైపు రాజన్న బాటలో అడుగులు వేస్తున్న ప్రభుత్వం సరస్వతీ నిలయాలకు వసతుల తోరణాలు కట్టి విద్యార్థులను మనసారా ఆహ్వానిస్తోంది. నో బ్యాగ్ డే, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, డిజిటల్ తరగతులు వంటి నిర్ణయాలతో సర్కారు బడిని ఉన్నతంగా తీర్చిదిద్ది.. రేపటి పౌరుల బంగారు భవిష్యత్‌కు బంగారు బాటలు పరిచింది. సాక్షి, గుంటూరు : నూతనంగా ఏర్పాటైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ ప్రభుత్వ బడుల బలోపేతానికి మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో వేలకు వేలు ఫీజులు కట్టలేని నిరుపేద విద్యార్థులకు ఒత్తిడి లేని, నాణ్యమైన విద్య అందించాలని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయించుకుంది. శనివారం నో బ్యాగ్ డే, ఆనంద పాఠ్యాంశాలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, డిజిటిల్ తరగతులు, పుస్తకాలు, సైకిళ్ల పంపిణీ వంటి వాటిని దీటుగా అమలు చేసి ప్రభుత్వ బడులపై నమ్మకం కలిగించేలా అడుగులు ముందుకు వేస్తోంది. ఒత్తిడి నుంచి ఉపశమనం.. ర్యాంకులతో కుస్తీలు పడుతూ విద్యార్థులు మానసికంగా ఒత్తిడికిలోనై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఒత్తిడి నుంచి పిల్లలకు ఉపశమనం కలిగించటంతోపాటు వారిపై శారీరిక భారాన్ని కాస్త తగ్గించటంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతి శనివారం బ్యాగ్ లేకుండా స్కూల్‌కు వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అనేక రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తోంది. సులువుగా అర్థమయ్యేలా బోధించేందుకు డిజిటల్ తరగతి గదులు, వర్చువల్ తరగతి గదులు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే గత విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు మారారు. పిల్లలందరికీ పౌష్టికాహారం.. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచడం కోసం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకం పూర్తిగా కుంటుపడింది. దీంతో సీఎం జగన్ ఈ పథకంపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించే విధంగా విద్యా శాఖపై చేసిన తొలి సమీక్షలోనే ఆదేశాలు జారీ చేశారు. పౌష్టికాహారం రాజీ పడకుండా సరఫరా చేయాలని, సమీకృత వంటశాలను ఏర్పాటు చేసి వేడిగా, శుచిగా, శుభ్రంగా అందజేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆరోగ్య రక్ష కార్డులు మంజూరు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, డాక్టర్లు, నెలకోసారి పాఠశాలలకు వెళ్లి పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరమైన వారికి రిఫరల్ ఆసుపత్రిల్లో చికిత్స అందిస్తున్నారు. ‘ప్రైవేట్’ కన్నా మిన్న.. ఫీజు ఎక్కువ ఉంటే స్కూలు మంచిదని, ఎక్కువ సమయం తరగతులు నిర్వహిస్తే ఆ స్కూల్ నంబరు వన్ అనే రీతిలో ప్రైవేటు స్కూళ్ల యజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా ఆదే అభిప్రాయంతో ఉండటంతో వారు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కార్పొరేట్ స్కూలు మెట్లు ఎక్కేందుకు ఆరాటపడుతున్నారు. ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సాగుతుండగా ఇరుకు గదులు, ఆపార్టుమెంట్లలో ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. బూట్లు కూడా.. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం బూట్లు ఉచితంగా విద్యార్థులకు సరఫరా చేయనుంది. పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికి పుస్తకాలు బడిలో ఉండాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు 8, 9 తగతుల బాలికలకు ప్రభుత్వం ఉచితంగా సైకిళ్లను అందిస్తోంది. 2017లో కేవలం ఎనిమిదో తరగతి విద్యార్థినులకు మాత్రమే సైకిళ్లు అందించగా.. గత ఏడాది నుంచి 9 వతరగతి బాలికలకు కూడా పంపిణీ చేస్తున్నారు. పాఠశాలలు బాలికల నివాస ప్రాంతాలకు దూరంగా ఉంటున్నందున కొందరు మధ్యలోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజన్న బడిబాట.... ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరికలను పెంచేందుకు కొత్త ప్రభుత్వం ‘రాజన్న బడి బాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఐదు రోజులుపాటు ప్రతి ఇంటికీ ఉపాధ్యాయులు వెళ్లి పిల్లల వివరాలను తెలుసుకొని బడిలో చేర్పించే కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రభుత్వం నిర్ణయాల వల్ల పాఠశాలలు ఎలా ఉండబోతున్నాయో, పిల్లలు ఎటువంటి లబ్ధి పొందనున్నారో వివరించనున్నారు. -
చదువు కొనాల్సిందే
వేసవి సెలవులు ముగిశాయి.. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి.. విద్యార్థులకు పుస్తకాల బరువు, తల్లిదండ్రులకు ఫీజుల భారం తప్పడం లేదు.. ఐఐటీ, నీట్, ఒలింపియాడ్, టెక్నో, ఈటెక్నో తదితర పేర్లతో కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఫీజుల మోత మోగిస్తున్నాయి. పిల్లల భవిష్యత్తుపై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రుల ఆశను కార్పొరేట్ యాజమాన్యాలు చక్కగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు రూ.25 వేల నుంచి రూ.1.75 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజులతోపాటు పుస్తకాలకు రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. వీటితోపాటు అడ్మిషన్ ఫీజును కూడా వసూలు చేస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన విద్యాశాఖాధికారులు కార్పోరేట్ విద్యాసంస్థలపై కన్నెత్తి చూడకపోడం అవినీతి ఆరోపణలకు దారితీస్తోంది. నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. సాక్షి, నెల్లూరు : ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాఠశాలలో ఫీజుల పట్టికను ప్రదర్శించాల్సిఉంది. పట్టిక ఏ పాఠశాలలో కనిపించకపోయినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ విషయంపై కొందరు తల్లిదండ్రులు ప్రశ్నిస్తే తమ పాఠశాలలో అడ్మిషన్లు లేవంటూ తిరిగి పంపివేస్తున్న ఘటనలు ఉన్నాయి. పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీ వేయాల్సి ఉన్నా ఆ ఊసే ఎక్కడా కనిపించలేదు. అధికారుల నిర్లక్ష్యంతో తల్లిదండ్రులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 1054 కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 383 ప్రాథమిక, 274 ప్రాథమికోన్నత, 393 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 1,64,724 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటితోపాటు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా 600కు పైగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో మరో 50 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నట్లు సమాచారం. కార్పొరేట్ పాఠశాలలు వసూలు చేస్తున్న వివిధ రకాల ఫీజులను పరిశీలిస్తే .. తరగతి ఫీజు అడ్మిషన్ ఫీజు పుస్తకాలు,సామాగ్రి 1నుంచి 5వ తరగతి వరకు రూ.25వేలు-రూ.లక్ష రూ.5వేలు రూ.3వేల నుంచి రూ.5వేలు 5 నుంచి 10వ తరగతి వరకు రూ.40 వేలు-రూ.1.75 లక్షలు రూ.10వేలు రూ.5 వేల నుంచి రూ.8 వేలు తమ బిడ్డలను ఉన్నతస్థాయిలో చూడాలన్న తల్లిదండ్రుల ఆశను కార్పొరేట్ విద్యాసంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. రకరకాల కోర్సుల పేరుతో భారీ మొత్తంలో ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో ప్రతి ఏడాది రూ.600 కోట్లకు పైగా వ్యాపారం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఫీజులను ప్రతి ఏడాది 20 నుంచి 30 శాతం వరకు పెంచుతూ తల్లిదండ్రులపై మరింత భారం మోపుతున్నారు. ఉత్తర్వులు బేఖాతర్ 2008లో జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఫీజులు నిర్ణయించేందుకు డీఈఓ, జిల్లా ఆడిట్ అధికారి, స్వచ్ఛంద సంస్థ లేదా తల్లిదండ్రులతో కూడిన కమిటీని కలెక్టర్ ఆధ్వర్యంలో నియమించాల్సిఉంది. ఈ కమిటీ పాఠశాల మౌలిక సదుపాయాలు, పరిస్థితులను పరిశీలించిన తరువాత ఫీజు ఎంత వసూలు చేయాలన్నది నిర్ణయిస్తుంది. పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ తదితరవి విక్రయించరాదు. వీటిని యాజమాన్యాలు సూచించిన వారి వద్దే కొనాలన్న నిబంధన ఏమీ ఉండదు. వీటి అమ్మకాలను పాఠశాలల్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయకూడదు. పరీక్షల ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి. పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్, ఐఐటీ, నీట్, ఒలింపియాడ్, కాన్సెప్ట్, టెక్నో, ఈటెక్నో, ఈ శాస్త్ర తదితర పేర్లను రాయకూడదు. కేవలం పాఠశాల అని మాత్రమే రాయాల్సిఉంది. అయితే ఈ నిబంధనలకు ఏ పాఠశాల యాజమాన్యం ఖాతరు చేయడం లేదు. లంచాలు అందుతుండడంతో అధికారులు పట్టించుకోవడం లేదు. -
పలు పాఠశాలల్లో భద్రతా చర్యలు
పెషావర్ ఘటన ప్రభావం న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని పెషావర్‌లోగల పాఠశాలలో తాలిబన్ రక్తపిశాచుల మారణకాండ నేపథ్యంలో నగరంలోని వివిధ పాఠశాలల యాజమాన్యాలు తగు భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ విషయమై లక్ష్మణ్ పబ్లిక్ పాఠశాల ప్రిన్సిపాల్ ఉషారాం మాట్లాడుతూ తమ పాఠశాలకు సమీపంలోనే మెట్రో రైల్వేస్టేషన్ ఉందన్నారు. ఇందువల్ల ఎవరైనా తమ పాఠ శాల వద్దకు సులువుగా చేరుకునేందుకు వీలవుతుందన్నారు. ఇలా ఉండడం తనకు ఎంతో అసౌకర్యంగా అనిపిస్తోందన్నారు. అందువల్ల తమ పాఠశాల ప్రహరీగోడ ఎత్తును పెంచాలని నిర్ణయించామన్నారు. దీంతోపాటు భద్రతా చర్యల్లో భాగంగా లంచ్ బాక్సులను కూడా తనిఖీ చేయాలని నిర్ణయించామన్నారు. దీంతోపాటు పాఠశాల ప్రాంగణమంతటా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. కాగా పెషావర్ ఘటన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ పాఠశాలల యాజమాన్యాలకు కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. ఇదిలాఉంచితే సాధారణంగా పాఠశాలల్లోకి లంచ్ బాక్సులను అనుమతిస్తారు. అయితే పెషావర్ ఘటన నేపథ్యంలో ఇకపై పాఠశాలకు తీసుకొచ్చే ప్రతి వస్తువునూ తనిఖీ చేయనున్నారు. ఇదే విషయమై మరో పాఠశాల ప్రిన్సిపాల్ నీనా మాట్లాడుతూ ‘ఒకసారి విద్యార్థి బడిలోకి అడుగుపెట్టిన తర్వాత ఎటువంటివాటినీ లోపలికి అనుమతించబోం. ఒకవేళ విద్యార్థులు ఎవరయినా భోజనం మరిచిపోయి వస్తే వారికి డబ్బులు ఇచ్చి క్యాంటీన్‌కు పంపుతాం. ముందస్తు అప్పాయింట్మెంట్ లేకుండా పిల్లల తల్లిదండ్రులను బడిలోకి రానివ్వం’అని తెలిపారు. -
నిబంధనలు గాలికి
స్కూల్ బస్సుల నిర్వహణలో ఆయా పాఠశాలల యాజమాన్యాలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడే అధికారులు హడావుడిగా తనిఖీలు, సీజ్ చేసి వదిలేస్తున్నారే తప్ప తరువాత పట్టించుకోవడం లేదు. దీంతో తరచు పాఠశాలల బస్సులు ప్రమాదాల బారిన పడుతున్నాయి. -నల్లగొండ ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలు పరిమితికి మించి విద్యార్థుల తరలింపు పట్టించుకోని అధికారులు, పాఠశాలల యాజమాన్యాలు నల్లగొండ పట్టణంలో 80 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారుగా 50 పాఠశాలలకు స్కూల్ బస్సులు ఉన్నాయి. కొన్ని పాఠశాలల బస్సులు తిప్పర్తి, కనగల్ మండలాలకు కూడా నడుపుతున్నారు. నియోజకవర్గం లో 200 స్కూల్ బస్సులు ఉండగా 180 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ రెన్యువల్ చేయించారు. 15 ఏళ్లు దాటిన బస్సులను రోడ్లపై తిప్పవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కొన్ని పాఠశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. కనగల్ మండలం పర్వతగిరి, చండూర్ రూట్లల్లో నడిచే బస్సులు సైతం పాత బస్సులు ఉన్నాయి. అదే విధంగా నల్లగొండ పట్టణంలో దేవరకొండ, మిర్యాలగూడ రోడ్‌ల్లో నడిపే పాత బస్సులలో కూడా పరిమితికి మించి విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని పాఠశాలల యాజమాన్యాల వారు ఆటోలను సైతం నడుపుతున్నారు. ఆటోల్లో కూడా పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్నారు. జరుగుతుంది ఇది.. స్కూల్ బస్సుల విషయంలో ఆయా పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదు. పాత బస్సులకు రంగులు వేసి ఫిట్నెస్ చేయించుకుంటున్నారు. బస్సు డ్రైవర్‌కు హెవీ లెసైన్స్ కలిగి ఉండాల్సి ఉంది. కానీ బస్సుల ఫిట్ నెస్ సమయంలో చూపించే డ్రైవర్‌ను కొనసాగించకుండా తక్కువ వేతనాలు వచ్చే వారిని డ్రైవర్‌గా కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా డ్రైవర్‌కు ఐదేళ్ల అనుభవం తప్పని సరిగా ఉండాలనే నిబంధనను పాటించడం లేదు. స్కూల్ బస్సులు తప్పనిసరిగా ఫస్ట్‌ఎయిడ్ బాక్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. స్కూల్ బస్సులపై పాఠశాల పేర్లు కాకుండా స్కూల్ బస్సు అని పెద్ద అక్షరాలతో రాయించాల్సి ఉంది. కానీ అన్ని బస్సులకు కూడా పాఠశాలల పేర్లు రాస్తున్నారు. కిటికీల వద్ద చిన్న పిల్లలు చేతులు బయటకు పెట్టకుండా జాలీలు ఏర్పాటు చేయాలి. అదే విధంగా ప్రతి బస్సుకు క్లీనర్ తప్పని సరిగా ఉండాల్సి ఉన్నా నియమించడం లేదు. కొన్ని పాఠశాలల బస్సులకు విద్యార్థులే బస్సు డోర్ల వద్ద ఉంటున్నారు. ప్రమాదాలు జరిగితేనే అలర్ట్ స్కూల్ బస్సుల ప్రమాదాలు జరిగిన సమయంలో అధికారులు అలర్ట్‌గా వ్యవహరిస్తున్నారే తప్ప ఇతర విషయాల్లో పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిట్నెస్ వచ్చిన సమయంలో అన్ని సౌకర్యాలు చూపించినా ఏడాది పాటు తిరుగుతున్న బస్సులను కనీసం అప్పుడప్పుడు కూడా పర్యవేక్షణ చేయడం లేదని విమర్శలు వినవస్తున్నాయి. . జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లాలో పాఠశాలల బస్సులు 1224 ఉన్నాయి. కాగా 2014-15 సంవత్సరానికి 1,073 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ రెన్యువల్ చేశారు. 151 బస్సులు ఫిట్నెస్ లేకుండానే తిప్పుతున్నారు. 15 ఏళ్లు దాటిన బస్సులు 34 ఉన్నాయి. కాగా ఫిట్నెస్ లేని బస్సులు రోడ్లపై నడపడంతో ఆర్టీఏ అధికారులు ఈ ఏడాది ఇప్పటి వరకు 24 కేసులు నమోదు చేశారు. రవాణా నిబంధనలు పాటించాలి : డీఈఓ నల్లగొండ అర్బన్ : జిల్లాలోని వివిధ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల రవాణాకు సంబంధించి బస్సులు వినియోగించేవారు ప్రభుత్వ ఉత్తర్వు జీఓ నంబరు 35 ద్వారా జారీ చేసిన విధివిధానాలు తప్పనిసరిగా పాటించాలని డీఈఓ ఎస్.విశ్వనాథరావు గురువారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఈ నెల 27వ తేదీన కోదాడ, మిర్యాలగూడ, భువనగిరి, సూర్యాపేట, నల్లగొండలలో స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లకు ఆర్టీఏ అధికారులచే శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. బస్సులు నడిపేవారి లెసైన్స్, గుర్తింపుకార్డు తదితర అంశాలతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు డ్రైవర్లను రిపోర్టు చేయించి శిక్షణ హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు. -
చదువు సరే..! సంస్కారం వద్దా..?
కట్టు.. బొట్టుపై ప్రై‘వేటు’ - స్కూళ్లలో చిన్నారుల వేషధారణపై ఆంక్షలు - గాజులు వేసుకుంటే.. గజ్జెలు కట్టుకుంటే శిక్షలు - అభ్యంతరం వ్యక్తంచేస్తున్న తల్లిదండ్రులు - పట్టనట్లు ఉంటున్న విద్యాశాఖాధికారులు ఆర్మూర్ : ఆర్మూర్‌కు చెందిన దివ్య(పేరు మార్చాము) ఓ ప్రైవేటు స్కూళ్లో ఐదోతరగతి చదువుతోంది. రోజూలాగే బడి నుంచి సా యంత్రం ఇంటికి వచ్చింది. రాగానే చేతికి వేసుకున్న గాజులు, కాళ్లకు వేసుకున్న గజ్టెలు(పట్టీలు) తీసి పక్కన పడేసింది. అది చూసిన వాళ్లమ్మ సుజాత(పేరు మార్చాము).. ‘ఏమైంది దివ్య.. ఎందుకలా తీసేస్తున్నవ్.. ఖరాబైనయా.. చె ప్పు తల్లీ..’ అంటూ దగ్గరికి తీసుకుని ప్రశ్నిం చింది. అందుకు ఆ విద్యార్థిని..‘లేదమ్మా.. మా స్కూళ్లో వీటిని పెట్టుకుని రావద్దన్నరు. అందుకే తీసెస్తున్నా..’ అని చెప్పింది. ‘ఎందు కు వేసుకోవద్దంటా..’ అని సుజాత అడిగితే.. ‘ఏమోనమ్మా.. చేతులకు గాజులు, కాళ్లకు గజ్జెలతో పాటు కళ్లకు కాటుక, నాకిష్టమైన మైదాకు కూడా పెట్టుకుని రావద్దని చెప్పిండ్రమ్మా..’ అంటూ ఆ చిన్నా రి చిన్నబోయింది. ‘చదువు బాగా చెబుతున్నరని ఆ స్కూల్‌కు పంపితే.. గిట్ల చెప్పడమేంది..’ అని ఆ తల్లి బిత్తరపోయింది. అప్పుడే అక్కడి వచ్చిన దివ్య తండ్రి వెంకటరమణ(పేరు మార్చా ము) సైతం చిన్నారి మా టలకు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ప్రైవేటు పాఠశాల తీరుపై అసహనం వ్యక్తంచేశారు. ఇలా దివ్య తల్లిదండ్రులే కాదు.. చాలామంది ప్రైవేటు స్కూళ్లు తీరుపై ఆశ్చర్యం.. అసహనం వ్యక్తపరుస్తున్నారు. జిల్లాలోని చాలావరకు పాఠశాలలు ఇ లాంటి అడ్డగోలు నిబంధనలు పెడుతున్నాయి. సమాజంలో ప్రైవేటు స్కూలంటే.. మంచి చదువుతో చిన్నారులను తీర్చుదిద్దుతారన్న బలమైన నమ్మకం ఉంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఇంగ్లిష్ నేర్పమన్నాం.. చక్కటి చదువులు చెప్పమన్నాం.. కానీ.. ఇలా సంస్కృతి, సంస్కారం,సంప్రదాయాలను తుంగలో తొక్కడమేంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలల్లో మత బోధనలను చేయడం తప్పు కానీ.. సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిస్తే తప్పేంటీ..? అని అడుగుతున్నారు. మనిషికి చదువొక్కటే సరిపోదని.. సంస్కారమూ అవసరమేనంటున్నారు. మన సంప్రదాయాల్ని ముందుతరాలకు అందించకపోతే.. మున్ముందు అవి కనిపించకుండా పోయే ప్రమాదమూ ఉందంటున్నారు. దీపావళీ, హోలీ, సంక్రాంతి, క్రిస్మస్ వంటి పండుగలను తమ పిల్లలతో జరిపే స్కూళ్లు ఇలా.. చిత్రమైన షరతులు విధించడం తల్లిదండ్రుల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. అడ్డగోలు నిబంధనలు ఇంట్లో తల్లిదండ్రులు పాటిస్తున్న ఆచారాలను, సంప్రదాయాలను పిల్లలు అనుకరిస్తారు. అలా అనాదిగా అవి కొనసాగుతూనే ఉన్నాయి. బొట్టుపెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, గజ్జెలు కట్టుకోవడం, మైదాకు పూసుకోవడం ఇవన్నీ.. ఎన్నో తరాలుగా వస్తున్నాయి. ఇలాంటి వాటిపై పలు ప్రైవేటు పాఠశాలలు విచిత్రమైన నిబంధనలు పెడుతున్నాయి. ఇలాంటి ధోరణి ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఆయా అలంకరణలను వేసుకుని పాఠశాలకు రావద్దని చెబుతున్నాయి. ఇటీవల ఓ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో తల్లిదండ్రులు ఈ విషయంపై ప్రశ్నిస్తే.. అలాంటివి మేము అనుమతించము. అవసరమైతే మీ అమ్మాయిని వేరే స్కూల్లో చదివించుకోవచ్చని యాజమాన్యం ఖరాఖండిగా చెప్పేశారు. అంతే కానీ.. తమ షరతులను మాత్రం మార్చుకోలేదు. అలాగే పాఠశాలలో కచ్చితంగా ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలని హుకూం జారీ చేస్తున్నారు. అలా కాదని.. తెలుగులో మాట్లాడితే సదరు విద్యార్థులకు దండన విధిస్తున్నారు. కొన్ని పాఠశాలలైతే మరో అడుగు ముందుకేసి.. పిల్లల తల్లిదండ్రులు సైతం స్కూల్‌కు వస్తే ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలని సూచిస్తున్నారు. చిన్నారుల్లో మనోవేదన ఆర్మూర్‌తో పాటు పెర్కిట్, మామిడిపల్లిలో ఉన్న పలు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న బాలికలు గోరింటాకు పెట్టుకోవద్దని, కాళ్ల పట్టీలు వేసుకోవద్దని, కాటుక పెట్టుకోవద్దు, గాజులు వేసుకోవద్దని, బొట్టు పెట్టుకోవద్దని.. ఒకవేళ బొట్టు పెట్టుకోవాలంటే.. చిన్న టిక్లీ పెట్టుకోవాలని నిబంధనలను అమలు చేస్తున్నారు. ఇలాంటి నిబంధనలతో విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు. అమ్మాయిలకు సాధారణంగా అలంకరణలంటే ఇష్టం ఉంటుంది. అలాంటి వాటిపై షరతులు పెడుతుండటంతో వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పండుగలు, శుభకార్యాలప్పుడు ఆడపిల్లలు మైదాకు పెట్టుకోవడం సాధారణ విషయం. కానీ స్కూల్ టీచర్ల రూల్స్‌ను తలచుకుని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకోవడానికే జంకుతున్నారు. ఇలాగైతే కనుమరుగే.. చిన్నతనంలోనే సంస్కృతి, సంప్రదాయాలకు పిల్లలు దూరమైతే.. పెరిగి పెద్దయ్యాక వాటిని అనుసరిస్తారన్న నమ్మకం లేదు. ఇలాగే వారు కొనసాగితే కొన్నాళ్లకు అనాదిగా వస్తున్న అలవాట్లన్నీ మారిపోతాయి. పలు ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు అనుసరిస్తున్న పాశ్చాత్య పోకడలతో సంప్రదాయాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులతోనే చాలా వరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల సంఖ్య పెంచుకోవడానికి నిర్వహించే పబ్లిసిటీలో భాగంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులను చేర్చుకుంటున్నారు. దీంతో వారు వారి సాంప్రదాయాలను విద్యార్థులపై రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయమై గతంలో ఆర్మూర్‌లోని ఓ పాఠశాలల్లో గొడవలు కూడా జరిగాయి. సంబంధిత అధికారులు సమస్య వచ్చినప్పుడే స్పందిస్తూ.. పరిష్కరిస్తున్నారు. ముందస్తు చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలు పెడుతున్న అడ్డగోలు ఆంక్షలపై దృష్టిసారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.