అమ్మ ఒడి నుంచి అక్షరాల గుడికి | Schools Are Reopening Today In Andha Pradesh | Sakshi
Sakshi News home page

అమ్మ ఒడి నుంచి అక్షరాల గుడికి

Published Wed, Jun 12 2019 11:25 AM | Last Updated on Wed, Jun 12 2019 11:34 AM

Schools Are  Reopening Today In Andha Pradesh - Sakshi

ఇప్పటి వరకు ఆకాశాన ఇంద్రధనస్సులోని ఏడు రంగులూ వారివే.. ఈత సరదాలు, వేసవి ఎండలు అన్నీ వారివే.. వేసవి సెలవుల్లో వారికి ప్రతి ఘడియా మధురమే.. అందుకే సెలవుల అమృత జ్ఞాపకాలన్నింటినీ చిరునవ్వుల్లో దాచుకుని.. నేడు అనురాగపు అమ్మ ఒడి నుంచి  చదువులమ్మ గుడిలోకి అడుగుపెడుతున్నారు విద్యార్థులు.. మరో వైపు రాజన్న బాటలో అడుగులు వేస్తున్న ప్రభుత్వం సరస్వతీ నిలయాలకు వసతుల తోరణాలు కట్టి విద్యార్థులను మనసారా ఆహ్వానిస్తోంది. నో బ్యాగ్‌ డే, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, డిజిటల్‌ తరగతులు వంటి నిర్ణయాలతో సర్కారు బడిని ఉన్నతంగా తీర్చిదిద్ది.. రేపటి పౌరుల బంగారు భవిష్యత్‌కు బంగారు బాటలు పరిచింది.
సాక్షి, గుంటూరు : నూతనంగా ఏర్పాటైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌ ప్రభుత్వ బడుల బలోపేతానికి మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో వేలకు వేలు ఫీజులు కట్టలేని నిరుపేద విద్యార్థులకు ఒత్తిడి లేని, నాణ్యమైన విద్య అందించాలని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ నిర్ణయించుకుంది. శనివారం నో బ్యాగ్‌ డే, ఆనంద పాఠ్యాంశాలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, డిజిటిల్‌ తరగతులు, పుస్తకాలు, సైకిళ్ల పంపిణీ వంటి వాటిని దీటుగా అమలు చేసి ప్రభుత్వ బడులపై నమ్మకం కలిగించేలా అడుగులు ముందుకు వేస్తోంది.  

ఒత్తిడి నుంచి ఉపశమనం..
ర్యాంకులతో కుస్తీలు పడుతూ విద్యార్థులు మానసికంగా ఒత్తిడికిలోనై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఒత్తిడి నుంచి పిల్లలకు ఉపశమనం కలిగించటంతోపాటు వారిపై శారీరిక భారాన్ని కాస్త తగ్గించటంలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతి శనివారం బ్యాగ్‌ లేకుండా స్కూల్‌కు వచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు.

సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అనేక రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తోంది. సులువుగా అర్థమయ్యేలా బోధించేందుకు డిజిటల్‌ తరగతి గదులు, వర్చువల్‌ తరగతి గదులు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే గత విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు మారారు.  

పిల్లలందరికీ పౌష్టికాహారం..
ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచడం కోసం దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకం పూర్తిగా కుంటుపడింది. దీంతో సీఎం జగన్‌ ఈ పథకంపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించే విధంగా విద్యా శాఖపై చేసిన తొలి సమీక్షలోనే ఆదేశాలు జారీ చేశారు.

పౌష్టికాహారం రాజీ పడకుండా సరఫరా చేయాలని, సమీకృత వంటశాలను ఏర్పాటు చేసి వేడిగా, శుచిగా, శుభ్రంగా అందజేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆరోగ్య రక్ష కార్డులు మంజూరు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, డాక్టర్లు, నెలకోసారి పాఠశాలలకు వెళ్లి పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా సరఫరా చేస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరమైన వారికి రిఫరల్‌ ఆసుపత్రిల్లో చికిత్స అందిస్తున్నారు.

‘ప్రైవేట్‌’ కన్నా మిన్న..
ఫీజు ఎక్కువ ఉంటే స్కూలు మంచిదని, ఎక్కువ సమయం తరగతులు నిర్వహిస్తే ఆ స్కూల్‌ నంబరు వన్‌ అనే రీతిలో ప్రైవేటు స్కూళ్ల యజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా ఆదే అభిప్రాయంతో ఉండటంతో వారు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి.

తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కార్పొరేట్‌ స్కూలు మెట్లు ఎక్కేందుకు ఆరాటపడుతున్నారు. ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సాగుతుండగా ఇరుకు గదులు, ఆపార్టుమెంట్లలో ప్రైవేటు పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి.

బూట్లు కూడా..
ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం బూట్లు ఉచితంగా విద్యార్థులకు సరఫరా చేయనుంది. పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికి పుస్తకాలు బడిలో ఉండాలని సీఎం జగన్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు 8, 9 తగతుల బాలికలకు ప్రభుత్వం ఉచితంగా సైకిళ్లను అందిస్తోంది.

2017లో కేవలం ఎనిమిదో తరగతి విద్యార్థినులకు మాత్రమే సైకిళ్లు అందించగా.. గత ఏడాది నుంచి 9 వతరగతి బాలికలకు కూడా పంపిణీ చేస్తున్నారు. పాఠశాలలు బాలికల నివాస ప్రాంతాలకు దూరంగా ఉంటున్నందున కొందరు మధ్యలోనే చదువుకు స్వస్తి చెబుతున్నారు. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

రాజన్న బడిబాట....
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల చేరికలను పెంచేందుకు కొత్త ప్రభుత్వం ‘రాజన్న బడి బాట’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఐదు రోజులుపాటు ప్రతి ఇంటికీ ఉపాధ్యాయులు వెళ్లి పిల్లల వివరాలను తెలుసుకొని బడిలో చేర్పించే కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రభుత్వం నిర్ణయాల వల్ల పాఠశాలలు ఎలా ఉండబోతున్నాయో, పిల్లలు ఎటువంటి లబ్ధి పొందనున్నారో వివరించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement