నిబంధనలు గాలికి
స్కూల్ బస్సుల నిర్వహణలో ఆయా పాఠశాలల యాజమాన్యాలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడే అధికారులు హడావుడిగా తనిఖీలు, సీజ్ చేసి వదిలేస్తున్నారే తప్ప తరువాత పట్టించుకోవడం లేదు. దీంతో తరచు పాఠశాలల బస్సులు ప్రమాదాల బారిన పడుతున్నాయి. -నల్లగొండ
- ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలు
- పరిమితికి మించి విద్యార్థుల తరలింపు
- పట్టించుకోని అధికారులు, పాఠశాలల యాజమాన్యాలు
నల్లగొండ పట్టణంలో 80 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారుగా 50 పాఠశాలలకు స్కూల్ బస్సులు ఉన్నాయి. కొన్ని పాఠశాలల బస్సులు తిప్పర్తి, కనగల్ మండలాలకు కూడా నడుపుతున్నారు. నియోజకవర్గం లో 200 స్కూల్ బస్సులు ఉండగా 180 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ రెన్యువల్ చేయించారు. 15 ఏళ్లు దాటిన బస్సులను రోడ్లపై తిప్పవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా కొన్ని పాఠశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.
కనగల్ మండలం పర్వతగిరి, చండూర్ రూట్‌లల్లో నడిచే బస్సులు సైతం పాత బస్సులు ఉన్నాయి. అదే విధంగా నల్లగొండ పట్టణంలో దేవరకొండ, మిర్యాలగూడ రోడ్‌ల్లో నడిపే పాత బస్సులలో కూడా పరిమితికి మించి విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. కొన్ని పాఠశాలల యాజమాన్యాల వారు ఆటోలను సైతం నడుపుతున్నారు. ఆటోల్లో కూడా పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్నారు.
జరుగుతుంది ఇది..
స్కూల్ బస్సుల విషయంలో ఆయా పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదు. పాత బస్సులకు రంగులు వేసి ఫిట్‌నెస్ చేయించుకుంటున్నారు. బస్సు డ్రైవర్‌కు హెవీ లెసైన్స్ కలిగి ఉండాల్సి ఉంది. కానీ బస్సుల ఫిట్ నెస్ సమయంలో చూపించే డ్రైవర్‌ను కొనసాగించకుండా తక్కువ వేతనాలు వచ్చే వారిని డ్రైవర్‌గా కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా డ్రైవర్‌కు ఐదేళ్ల అనుభవం తప్పని సరిగా ఉండాలనే నిబంధనను పాటించడం లేదు.
స్కూల్ బస్సులు తప్పనిసరిగా ఫస్ట్‌ఎయిడ్ బాక్స్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. స్కూల్ బస్సులపై పాఠశాల పేర్లు కాకుండా స్కూల్ బస్సు అని పెద్ద అక్షరాలతో రాయించాల్సి ఉంది. కానీ అన్ని బస్సులకు కూడా పాఠశాలల పేర్లు రాస్తున్నారు. కిటికీల వద్ద చిన్న పిల్లలు చేతులు బయటకు పెట్టకుండా జాలీలు ఏర్పాటు చేయాలి. అదే విధంగా ప్రతి బస్సుకు క్లీనర్ తప్పని సరిగా ఉండాల్సి ఉన్నా నియమించడం లేదు. కొన్ని పాఠశాలల బస్సులకు విద్యార్థులే బస్సు డోర్‌ల వద్ద ఉంటున్నారు.
ప్రమాదాలు జరిగితేనే అలర్ట్
స్కూల్ బస్సుల ప్రమాదాలు జరిగిన సమయంలో అధికారులు అలర్ట్‌గా వ్యవహరిస్తున్నారే తప్ప ఇతర విషయాల్లో పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిట్‌నెస్ వచ్చిన సమయంలో అన్ని సౌకర్యాలు చూపించినా ఏడాది పాటు తిరుగుతున్న బస్సులను కనీసం అప్పుడప్పుడు కూడా పర్యవేక్షణ చేయడం లేదని విమర్శలు వినవస్తున్నాయి.
.
జిల్లాలో ఇదీ పరిస్థితి
జిల్లాలో పాఠశాలల బస్సులు 1224 ఉన్నాయి. కాగా 2014-15 సంవత్సరానికి 1,073 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ రెన్యువల్ చేశారు. 151 బస్సులు ఫిట్‌నెస్ లేకుండానే తిప్పుతున్నారు. 15 ఏళ్లు దాటిన బస్సులు 34 ఉన్నాయి. కాగా ఫిట్‌నెస్ లేని బస్సులు రోడ్లపై నడపడంతో ఆర్‌టీఏ అధికారులు ఈ ఏడాది ఇప్పటి వరకు 24 కేసులు నమోదు చేశారు.
రవాణా నిబంధనలు పాటించాలి : డీఈఓ
నల్లగొండ అర్బన్ : జిల్లాలోని వివిధ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల రవాణాకు సంబంధించి బస్సులు వినియోగించేవారు ప్రభుత్వ ఉత్తర్వు జీఓ నంబరు 35 ద్వారా జారీ చేసిన విధివిధానాలు తప్పనిసరిగా పాటించాలని డీఈఓ ఎస్.విశ్వనాథరావు గురువారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఈ నెల 27వ తేదీన కోదాడ, మిర్యాలగూడ, భువనగిరి, సూర్యాపేట, నల్లగొండలలో స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లకు ఆర్‌టీఏ అధికారులచే శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. బస్సులు నడిపేవారి లెసైన్స్, గుర్తింపుకార్డు తదితర అంశాలతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు డ్రైవర్లను రిపోర్టు చేయించి శిక్షణ హాజరయ్యేలా చూడాలని ఆదేశించారు.