సాక్షి, కర్నూలు : పంటలు నాశనం అవుతున్నా.. గొర్రెలు, మేకలు చనిపోతున్నా.. జ్వరం, దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నా.. ఎవరో గిట్టని వారు ఫిర్యాదు చేశారని. ఆ ప్రాంతంలో కాలుష్య జాడలు కనబడలేదని, అక్కడ అంతా సవ్యంగా ఉందని అధికారులు కితాబు ఇచ్చేశారు.
‘రాయలసీమ అల్కాలీస్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల తుంగా తీరం కలుషితమవుతోంది. ఆహ్లాదకర వాతావరణం కనుమరుగవుతోంది. పరీవాహక ప్రాంత ప్రజల జీవనం దుర్భరంగా మారింది. ఫ్యాక్టరీ వ్యర్థాలతోనే దుర్వాసన వస్తోంది’ అంటూ ప్రజలు, ప్రజాసంఘాలు కోడై కూసినా చర్యలకు వెనకడుగు వేసిన అధికారులు.. తీరా హైకోర్టు ఆదేశాలతో బుధవారం విచారణ చేపట్టారు.
అయితే విచారణాధికారుల తీరును చూస్తే ఫ్యాక్టరీకి చెందిన ఓ ఉన్నత ఉద్యోగి, అధికార పార్టీ కనుసన్నల్లోనే జరిగినట్లుగా భావించాల్సి వస్తోందని ఈ.తాండ్రపాడు వాసులు ఆరోపిస్తున్నారు. ‘పచ్చని భూమలు కాలుష్యంతో బీడు భూములుగా మారుతున్నాయి. వేసిన పంటలు నాశనం అవుతున్నాయి. వేల రూపాయలు నష్టపోతున్నాం. నా పొలంలో ఉల్లి వేసి.. రూ. 70 వేలు నష్టపోయాను.’ అంటూ విచారణాధికారుల వద్ద తాండ్రపాడు గ్రామస్థుడు మాబూబ్‌లాల్ వాపోగా.. రాయలసీమ ఫ్యాక్టరీకి చెందిన కొందరు అతన్ని అడ్డుకోవడం కనిపించింది.
అదే గ్రామానికి చెందిన బోయ మద్దిలేటి ఫ్యాక్టరీ వ్యర్థాల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో విచారణకు వచ్చిన అధికారులకు వివరిస్తూ.. ‘సర్, అల్కాలీస్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల లింగమన్నవాగు, బసాపురం వాగుల్లో నీళ్లు విషంగా మారాయి. ఆ నీళ్లు తాగి గొర్రెలు, మేకలు చనిపోతున్నాయి. గ్రామస్థులు కూడా పలు రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. 5 వేలు జనాభా ఉన్న ఈ గ్రామంలో 20 మంది ఆర్‌ఎంపీ డాక్టర్లు ఉన్నారంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోండి’ అంటూ వేడుకున్నారు. ఇలా చాలా మంది ప్రజలు ముందుకొచ్చి ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం మౌనంగా వారి మాటలు విని ముందుకు కదిలారు. కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో పర్యటించకుండా.. పంట పొలాలు పచ్చగా ఉన్న చోట పరిశీలించడంపై ప్రజాసంఘాలు మండిపడ్డాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారి నేత ృత్వంలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు ఉదయం అల్కాలీస్ ఫ్యాక్టరీని పరిశీలించారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, కాలుష్యంపై ఆరా తీశారు. అనంతరం విచారణ వివరాలను విలేకరులు ప్రశ్నించగా సమాచారం బయటకు వెల్లడించరాదని, నివేదికను హైకోర్టుకు అందజేస్తామని విచారణ బృందం పేర్కొంది.
అయితే ఫ్యాక్టరీలో పరిశీలించిన అంశాల గురించి ‘సాక్షి’ ఓ అధికారిని అడగ్గా.. ‘ఫ్యాక్టరీలో అంతా సవ్యంగా ఉంది. వ్యర్థాలను శుద్ధిచేసి ఆ నీటినే అక్కడ మొక్కలకు వినియోగిస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాలు కాలుష్యమయ్యే అవకాశం లేదు. ఇక దుర్వాసన సమస్య తలెత్తే అవకాశం లేదు.
’ అని స్పష్టం చేశారు. కాగా, ‘గత జనవరిలో దాదాపు నెల రోజులు ఫ్యాక్టరీ నుంచి వస్తున్న దుర్వాసన భరించలేక.. నానా ఇబ్బందులు పడిన సంగతి విదితమే. గత కొన్నేళ్లు ఈ.తాండ్రపాడు, గొందిపర్ల పరిసర ప్రాంతాల్లో పంటలు పండడం లేదన్న విషయమూ తెలిసిందే. అధికారులకు తమ గోడు వినిపించినా.. అటువైపు కన్నెత్తి చూసేందుకూ సాహసించలే కపోయారు. కనీసం ఏం జరుగుతోందని ఆరా తీసేందుకు ముందుకు రాలేకపోయారు. తీరా ఇప్పుడు విచారణకు వచ్చినా అధికార పార్టీ నేత ఒత్తిళ్ల వల్ల నివేదికను నీరుగార్చే అవకాశం ఉంద’ని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
క్లీన్ చీట్!
Published Thu, Dec 4 2014 3:25 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement