కలెక్టరేట్, న్యూస్‌లైన్: బాధితురాలికి పరిహారం చెల్లింపు విషయంలో కలెక్టరేట్ వేలానికి సంబంధించి అధికారులకు కొంత ఊరట లభించింది. వేలం తీర్పుపై అధికారులు రివ్యూ పిటిషన్ దాఖలుచేయగా, విచారణ చేపట్టిన హైకోర్టు ముందుగా బాధితురాలికి చెల్లించాల్సిన పరిహారం ఎంతో తేల్చాలని సూచించింది. ఆ ఆ తరువాత పరిహారం చెల్లించేందుకు అధికారులకు కొంత సమయం ఇవ్వాలని, అప్పుడు కూడా స్పందించకపోతే వేలం వేయాల్సిందిగా ఆదేశించింది. దీనిపై పూర్తి విచారణకు కింది కోర్టును ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వేలం ప్రక్రియకు కొంత బ్రేక్‌పడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయమై..బాధితురాలికి చెల్లించాల్సిన పరిహారం ఎంతో కోర్టు తేల్చితే తక్షణమే చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని డీఆర్‌ఓ రాంకిషన్ వెల్లడించారు. అయితే బాధితురాలికి ప్రభుత్వపరంగా రూ.11లక్షలు చెల్లించాల్సి ఉందని, కానీ రూ.49లక్షలు రావాల్సి ఉందని వారి వాదన ఉందన్నారు. అయితే ఈ విషయమై స్పష్టత కోసం జిల్లా కోర్టు ముందుంచామన్నారు. విచారణ చేపట్టి పరిహారం ఎంత చెల్లించాలనే విషయం నిర్ణయిస్తే చెల్లిస్తామన్నారు.
అయితే ఇంతకుముందు వెల్లడించిన తీర్పులో పరిహారం ఎంత చెల్లించాలని లేకపోవడంతో తాము రివ్యూ పిటిషన్‌ను వేసినట్లు డీఆర్‌ఓ పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన జిల్లాకోర్టు ఈనెల 28న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సిందిగా మహబూబ్‌నగర్ తహశీల్దారును ఆదేశించింది. ఇప్పటికైనా బాధితురాలికి పరిహారం చెల్లిస్తారో లేక కలెక్టరేట్‌ను వేలం వేయిస్తారో వేచి చూడాలి..!
పరిహారమెంతో తేల్చండి
Published Thu, Sep 19 2013 2:00 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement