కలెక్టరేట్, న్యూస్‌లైన్ : అన్నదాత కష్టం అకాలవర్షాలకు తుడిచిపెట్టుకుపోయింది. చేతికందాల్సిన పంట చేలలోనే కుళ్లిపోయింది. పంటపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతన్నకు వానలు కన్నీళ్లే మిగిల్చాయి. లక్షల ఎకరాల పంట నాశనం చేసి వందల కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టింది. రైతులకు చివరకు అప్పు మిగిల్చింది. ఐదు రోజులపాటు కురిసిన వర్షాలు చేతికి, అంచనాలకు అందని విధ్వంసాన్ని సృష్టించాయి. దెబ్బతిన్న పంటలు
చూసి మనోవేదనకు గురైన రైతుల గుండెలు ఆగిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో ఊహకందిన నష్టాన్ని మాత్రమే అధికారులు అంచనా వేశారు. అన్ని శాఖల పరి ధిలో కనీసం ప్రాథమిక అంచనా ప్రకారం పూర్తిస్థాయిలో నష్టాన్ని లెక్కగట్టకపోవడం జిలా ్లయంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మా పని పూర్తయింది అన్నట్టుగా ఆయా శాఖల పనితీరు సామాన్య రైతుల పట్ల చిత్తశుద్ధిని శంకిస్తోంది.
కోలుకోలేని దెబ్బ
జిల్లాలో ఈ సీజన్‌లో 4.32 లక్షల ఎకరాల్లో పత్తి, 6.17 లక్షల ఎకరాల్లో వరి, 1.48 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 17 వేల ఎకరాల్లో సోయాబీన్ సాగుచేశారు. ఇందులో 1.73 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా వేసింది. 49 మండలాల్లో పత్తి 85,430 ఎకరాలు, వరి 87,730, మొక్కజొన్న 120, సోయాబీన్ 120 ఎకరాల్లో దెబ్బ తిన్నాయని అంచనా వేశారు. మంగళవారం నుంచి రీసర్వే ప్రారంభించిన అధికారులు నష్టం ఇంకా తగ్గవచ్చునని చెప్తున్నారు. ఐదెకరాల్లోపు సాగు విస్తీర్ణంలో దిగుబడి ప్రామాణికంగా 50 శాతం నష్టపోయిన పంటలనే పరిహారానికి అర్హులను చేసే నిబంధన పెట్టారు. ఖరీఫ్ ఆరంభంలో మోతాదుకు మించి కురిసిన వానలతో తెగుళ్లబారిన పడి పత్తి ఎదుగుదల లోపించింది. అయినా రైతన్నలు ఖర్చులు భరించి మొక్కలను కాపాడుకునే ప్రయత్నం చేసినా ఇప్పుడు ఫలితం దక్కలేదు.
పసుతం తుఫాను ప్రభావంతో పంట చేతికందే పరిస్థితి లేకుండా పోయింది. చేలల్లో నీరు నిలవడంతో తెల్లబంగారం నల్లబారిపోయింది. తేమ ప్రభావంతో ఎదుగుదల పూర్తి గా ఆగిపోయింది. ఇప్పటికే ఒక్కొక్క చెట్టుకు 40 నుంచి 80కాయలు ఉండాల్సి ఉండగా 8 నుంచి 15 మాత్రమే ఉండడంతో రైతులు ఆశలు వదులుకున్నారు. వరి పొలా ల్లో ఇసుక మేటలు వేసింది. కోసిన ధాన్యం, మొక్కజొన్న గింజలు మొలకెత్తి రంగుమారాయి. సాధారణ సాగులో సగానికి పైగా దిగుబడి తగ్గింది. రంగుమారి, నాణ్యత దెబ్బతిన్న ధాన్యం, మొక్కజొన్నలను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రైతులు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు.
అంచనా వంచన
జిల్లా యంత్రాంగం వాస్తవంగా జరిగిన నష్టాన్ని తగ్గించి నివేదికలు సిద్ధం చేస్తోంది. పంట నష్టంతోపాటు ఆస్తినష్టం సంభవించినప్పటికీ నివేదికలు మొక్కుబడిగానే ఉన్నాయి. జిల్లా అంతటా పత్తి పంట దెబ్బతింటే 28 మండలాల్లోనే పత్తి పంటకు నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనాల్లో పేర్కొంటున్నారు. వరి పంట సగానికి సగం ముంపునకు గురైంది. కోతలు పూర్తయి, కళ్లాల్లో ఉన్న ధాన్యం కూడా తడిసిముద్దయింది. తడిసి, మొలకలెత్తిన ధాన్యం వివరాలను నష్టం అంచనాల్లో చూపడం లేదు.
ఈ సీజన్‌లో సాగయిన విస్తీర్ణంలో 12 శాతం పంట నష్టంపై అధికారులు రూపొందించిన ప్రాథమిక అంచనా ప్రకారం రైతు పెట్టుబడికి వచ్చే దిగుబడి ఆధారంగా రూ.400 కోట్ల మేర నష్టం జరిగింది. మంగళవారం నుంచి రైతువారీగా సర్వే చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల సాకుతో ఈ నష్టం మరింత తగ్గనుంది. నిబంధనల మేరకు నష్టం నివేదికల ప్రకారం వరి, పత్తి పంటలకు హెక్టారుకు రూ.10 వేలు, మొక్కజొన్నకు రూ.8,333 చొప్పున నష్టాన్ని లెక్కగట్టి పరిహారం కోసం నివేదిస్తారు. ఈ పరిహారం రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి ఉండదని లబోదిబోమంటున్నారు. వాస్తవానికి వరి 40 శాతం, పత్తి 40 శాతం దెబ్బతిన్నాయి.
ఎకరానికి 10 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా వర్షాల వల్ల పత్తి, వరి పంటలు మూడు, నాలుగు క్వింటాళ్లు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మొక్కజొన్న కోతలు పూర్తయ్యాయి. ఆరబోసిన కంకులు తడిసిపోయి మొలకలెత్తాయి. పెట్టుబడులు కూడా తిరిగిరావన్న ఆందోళనతో జిల్లాలో ఇప్పటివరకు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కూరగాయల పంటకు అసలు నష్టమే వాటిల్లలేదని అధికారులు చెప్తుంటే వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. 15 వేల ఎకరాల్లో టమాటా, 5 వేల ఎకరాల్లో వంకాయ పంటలు దెబ్బతిన్నాయి.
గూడు చెదిరింది
జిల్లావ్యాప్తంగా 1625 ఇళ్లు ధ్వంసమయ్యాయని రెవెన్యూ అధికారులు తేల్చారు. నష్టం అంచనా వేయలేదు. ఆర్‌అండ్‌బీ రోడ్లు, భవనాలు, పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. వరదలు పొంగిపొర్లుతుండడంతో రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోయాయి. పలు చోట్ల గోతులు ఏర్పడ్డాయి. 200 కిలోమీటర్ల రహదారులు, రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
వర్షార్పణం
Published Thu, Oct 31 2013 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
Advertisement