చదువు సరే..! సంస్కారం వద్దా..?
కట్టు.. బొట్టుపై ప్రై‘వేటు’
- స్కూళ్లలో చిన్నారుల వేషధారణపై ఆంక్షలు
- గాజులు వేసుకుంటే.. గజ్జెలు కట్టుకుంటే శిక్షలు
- అభ్యంతరం వ్యక్తంచేస్తున్న తల్లిదండ్రులు
- పట్టనట్లు ఉంటున్న విద్యాశాఖాధికారులు
ఆర్మూర్ : ఆర్మూర్‌కు చెందిన దివ్య(పేరు మార్చాము) ఓ ప్రైవేటు స్కూళ్లో ఐదోతరగతి చదువుతోంది. రోజూలాగే బడి నుంచి సా యంత్రం ఇంటికి వచ్చింది. రాగానే చేతికి వేసుకున్న గాజులు, కాళ్లకు వేసుకున్న గజ్టెలు(పట్టీలు) తీసి పక్కన పడేసింది. అది చూసిన వాళ్లమ్మ సుజాత(పేరు మార్చాము).. ‘ఏమైంది దివ్య.. ఎందుకలా తీసేస్తున్నవ్.. ఖరాబైనయా.. చె ప్పు తల్లీ..’ అంటూ దగ్గరికి తీసుకుని ప్రశ్నిం చింది. అందుకు ఆ విద్యార్థిని..‘లేదమ్మా.. మా స్కూళ్లో వీటిని పెట్టుకుని రావద్దన్నరు. అందుకే తీసెస్తున్నా..’ అని చెప్పింది.
‘ఎందు కు వేసుకోవద్దంటా..’ అని సుజాత అడిగితే.. ‘ఏమోనమ్మా.. చేతులకు గాజులు, కాళ్లకు గజ్జెలతో పాటు కళ్లకు కాటుక, నాకిష్టమైన మైదాకు కూడా పెట్టుకుని రావద్దని చెప్పిండ్రమ్మా..’ అంటూ ఆ చిన్నా రి చిన్నబోయింది. ‘చదువు బాగా చెబుతున్నరని ఆ స్కూల్‌కు పంపితే.. గిట్ల చెప్పడమేంది..’ అని ఆ తల్లి బిత్తరపోయింది. అప్పుడే అక్కడి వచ్చిన దివ్య తండ్రి వెంకటరమణ(పేరు మార్చా ము) సైతం చిన్నారి మా టలకు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ప్రైవేటు పాఠశాల తీరుపై అసహనం వ్యక్తంచేశారు.
ఇలా దివ్య తల్లిదండ్రులే కాదు.. చాలామంది ప్రైవేటు స్కూళ్లు తీరుపై ఆశ్చర్యం.. అసహనం వ్యక్తపరుస్తున్నారు. జిల్లాలోని చాలావరకు పాఠశాలలు ఇ లాంటి అడ్డగోలు నిబంధనలు పెడుతున్నాయి. సమాజంలో ప్రైవేటు స్కూలంటే.. మంచి చదువుతో చిన్నారులను తీర్చుదిద్దుతారన్న బలమైన నమ్మకం ఉంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఇంగ్లిష్ నేర్పమన్నాం.. చక్కటి చదువులు చెప్పమన్నాం.. కానీ.. ఇలా సంస్కృతి, సంస్కారం,సంప్రదాయాలను తుంగలో తొక్కడమేంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
పాఠశాలల్లో మత బోధనలను చేయడం తప్పు కానీ.. సంస్కృతి, సంప్రదాయాలను అనుసరిస్తే తప్పేంటీ..? అని అడుగుతున్నారు. మనిషికి చదువొక్కటే సరిపోదని.. సంస్కారమూ అవసరమేనంటున్నారు. మన సంప్రదాయాల్ని ముందుతరాలకు అందించకపోతే.. మున్ముందు అవి కనిపించకుండా పోయే ప్రమాదమూ ఉందంటున్నారు. దీపావళీ, హోలీ, సంక్రాంతి, క్రిస్‌మస్ వంటి పండుగలను తమ పిల్లలతో జరిపే స్కూళ్లు ఇలా.. చిత్రమైన షరతులు విధించడం తల్లిదండ్రుల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది.
అడ్డగోలు నిబంధనలు
ఇంట్లో తల్లిదండ్రులు పాటిస్తున్న ఆచారాలను, సంప్రదాయాలను పిల్లలు అనుకరిస్తారు. అలా అనాదిగా అవి కొనసాగుతూనే ఉన్నాయి. బొట్టుపెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, గజ్జెలు కట్టుకోవడం, మైదాకు పూసుకోవడం ఇవన్నీ.. ఎన్నో తరాలుగా వస్తున్నాయి. ఇలాంటి వాటిపై పలు ప్రైవేటు పాఠశాలలు విచిత్రమైన నిబంధనలు పెడుతున్నాయి. ఇలాంటి ధోరణి ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఆయా అలంకరణలను వేసుకుని పాఠశాలకు రావద్దని చెబుతున్నాయి.
ఇటీవల ఓ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో తల్లిదండ్రులు ఈ విషయంపై ప్రశ్నిస్తే.. అలాంటివి మేము అనుమతించము. అవసరమైతే మీ అమ్మాయిని వేరే స్కూల్లో చదివించుకోవచ్చని యాజమాన్యం ఖరాఖండిగా చెప్పేశారు. అంతే కానీ.. తమ షరతులను మాత్రం మార్చుకోలేదు. అలాగే పాఠశాలలో కచ్చితంగా ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలని హుకూం జారీ చేస్తున్నారు. అలా కాదని.. తెలుగులో మాట్లాడితే సదరు విద్యార్థులకు దండన విధిస్తున్నారు. కొన్ని పాఠశాలలైతే మరో అడుగు ముందుకేసి.. పిల్లల తల్లిదండ్రులు సైతం స్కూల్‌కు వస్తే ఇంగ్లిష్‌లోనే మాట్లాడాలని సూచిస్తున్నారు.
చిన్నారుల్లో మనోవేదన
ఆర్మూర్‌తో పాటు పెర్కిట్, మామిడిపల్లిలో ఉన్న పలు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న బాలికలు గోరింటాకు పెట్టుకోవద్దని, కాళ్ల పట్టీలు వేసుకోవద్దని, కాటుక పెట్టుకోవద్దు, గాజులు వేసుకోవద్దని, బొట్టు పెట్టుకోవద్దని.. ఒకవేళ బొట్టు పెట్టుకోవాలంటే.. చిన్న టిక్లీ పెట్టుకోవాలని నిబంధనలను అమలు చేస్తున్నారు. ఇలాంటి నిబంధనలతో విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు.
అమ్మాయిలకు సాధారణంగా అలంకరణలంటే ఇష్టం ఉంటుంది. అలాంటి వాటిపై షరతులు పెడుతుండటంతో వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పండుగలు, శుభకార్యాలప్పుడు ఆడపిల్లలు మైదాకు పెట్టుకోవడం సాధారణ విషయం. కానీ స్కూల్ టీచర్ల రూల్స్‌ను తలచుకుని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకోవడానికే జంకుతున్నారు.
ఇలాగైతే కనుమరుగే..
చిన్నతనంలోనే సంస్కృతి, సంప్రదాయాలకు పిల్లలు దూరమైతే.. పెరిగి పెద్దయ్యాక వాటిని అనుసరిస్తారన్న నమ్మకం లేదు. ఇలాగే వారు కొనసాగితే కొన్నాళ్లకు అనాదిగా వస్తున్న అలవాట్లన్నీ మారిపోతాయి. పలు ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు అనుసరిస్తున్న పాశ్చాత్య పోకడలతో సంప్రదాయాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులతోనే
చాలా వరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల సంఖ్య పెంచుకోవడానికి నిర్వహించే పబ్లిసిటీలో భాగంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులను చేర్చుకుంటున్నారు. దీంతో వారు వారి సాంప్రదాయాలను విద్యార్థులపై రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయమై గతంలో ఆర్మూర్‌లోని ఓ పాఠశాలల్లో గొడవలు కూడా జరిగాయి. సంబంధిత అధికారులు సమస్య వచ్చినప్పుడే స్పందిస్తూ.. పరిష్కరిస్తున్నారు. ముందస్తు చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలు పెడుతున్న అడ్డగోలు ఆంక్షలపై దృష్టిసారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.