ఒంటిమామిడి..నిల‘బడి’oది! | Villagers who voluntarily opened a closed government school | Sakshi
Sakshi News home page

ఒంటిమామిడి..నిల‘బడి’oది!

Published Mon, Jun 26 2023 3:40 AM | Last Updated on Mon, Jun 26 2023 8:50 AM

Villagers who voluntarily opened a closed government school - Sakshi

అది నగరానికి దగ్గరగా ఉన్న గ్రామం. ఊరు మొత్తం రైతు కుటుంబాలు. పిల్లలు ఇంగ్లిష్‌ మీడియం చదవాలని వేలకు వేల ఫీజులు కట్టి ప్రైవేట్‌ బడుల్లో చేర్పించారు. విద్యార్థులెవరూ లేకపోవడంతో ఊర్లోని సర్కారు బడి మూతబడింది. ఒకసారి రాలేగావ్‌ సిద్ధి నుంచి వచ్చిన ఓ వ్యక్తి చెప్పిన మాటలు వారిలో ప్రేరణ రగిలించాయి. ప్రైవేట్‌ స్కూళ్లకు కట్టే డబ్బులతో మన ఊరి పాఠశాలను తెరిపించుకోవాలనుకుని నిశ్చయించుకుని స్కూల్‌ను తెరిపించుకున్నారు. ఇప్పుడు ఆ పాఠశాల.. నో అడ్మిషన్‌ బోర్డు పెట్టేవరకు చేరుకుంది. ఇదీ.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం  ఒంటిమామిడిపల్లి పాఠశాల విజయగాథ.   
– సాక్షి, వరంగల్‌ డెస్క్‌

మూతబడినా...  
ఒంటిమామిడి గ్రామస్తులందరూ తమ పిల్లలను వరంగల్‌లోని ప్రైవేట్‌ స్కూళ్లలో చదివిస్తున్నారు. 2005లో విద్యార్థుల సంఖ్య జీరోకు చేరుకోవడంతో పాఠశాల మూతపడింది. 2014–15లో ఆ గ్రామం నీటి సంరక్షణలో రాష్ట్రంలోనే రెండోస్థానంలో నిలిచింది. బాల వికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో గ్రామస్తులు మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్ధి గ్రామానికి వెళ్లి నీటి సంరక్షణలో అన్నా హజారే చేపడుతున్న చర్యలను గమనించారు. వాటిని గ్రామస్తులకు వివరించేందుకు కంపచెట్లతో నిండిపోయిన ఆ పాఠశాల ఆవరణను శుభ్రం చేసి సమావేశమయ్యారు.

రాలేగావ్‌సిద్ది నుంచి వచ్చిన ఓ వక్త మాట్లాడుతూ నీటి సంరక్షణలో మీ గ్రామం బేషుగ్గా ఉంది.. మరి మీ పాఠశాల ఎందుకు మూతపడింది అన్న మాటలు గ్రామస్తులను ఆలోచనలో పడేశాయి. దీంతో ఎంతమంది పిల్లలు ప్రైవేట్‌ పాఠశాలకు వెళ్తున్నారో సర్వే చేశారు. 270 మంది పిల్లలు ఏటా చదువు కోసం రూ.35 లక్షలు కడుతున్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. ఆ డబ్బులో కొంత మన పాఠశాల నిర్వహణకు పెట్టుకుని తెరిపించుకుందామని గ్రామసభలో తీర్మానం చేశారు.

దీన్ని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే ఎల్‌కేజీ నుంచి 7వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం అనుమతి ఇచ్చారు. దీంతో పాఠశాల 270 మంది విద్యార్థులతో పునఃప్రారంభమైంది. తర్వాత టెన్త్‌ వరకు అనుమతులు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 496 మంది విద్యార్థులు ఉన్నారు. అయినా 9 మంది ఎస్జీటీలే ఉండటంతో మరో 11 మంది ప్రైవేట్‌ టీచర్లను పెట్టుకుని పాఠశాలను నిర్వహిస్తున్నారు. 

స్వచ్ఛందంగా ఫీజు చెల్లింపు 
పాఠశాల నిర్వహణ కోసం ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఏడాదికి కొంత ఫీజు రూపంలో విరాళం ఇస్తున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యార్థులు సంవత్సరానికి రూ.5 వేలు, హైసూ్కల్‌ విద్యార్థులు రూ.6 వేలు ఇస్తుంటారు. ప్రైవేట్‌గా పెట్టుకున్న టీచర్లకు నెలకు రూ.2.20 లక్షలు వేతనం చెల్లిస్తుండటం గమనార్హం.

పాఠశాల నిర్వహణలో చైర్మన్‌ పొన్నాల రాజు ఆధ్వర్యంలోని 24 మంది సభ్యులున్న పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) కీలకపాత్ర పోషిస్తోంది. ఇక్కడ ప్రతి తరగతికి ముగ్గురు సభ్యులు ఇన్‌చార్జీలుగా ఉంటారు. ఆ తరగతికి సంబంధించి అన్ని అంశాలను వారే చూసుకుంటారు.  

పాఠశాల ప్రత్యేకతలివీ.. 
 ప్రతి తరగతి గది సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది.   
  మధ్యాహ్న భోజనం వండేందుకు ముగ్గురు వంట మనుషులను పెట్టి ఒక్కొక్కరికి రూ.4,500 వేతనం ఇస్తున్నారు.   
  ముగ్గురు స్కావెంజర్లను నియమించుకున్నారు.  
  మంచినీటి కోసం ప్రత్యేకంగా వాటర్‌ ప్లాంట్‌ఏర్పాటుచేశారు. 
  అన్ని హంగులతో డీజీ క్లాస్‌ రూమ్స్, కంప్యూటర్‌ ల్యాబ్, సైన్స్‌ల్యాబ్, లైబ్రరీ   
  ప్రత్యేక స్టడీ అవర్స్‌  నిర్వహణ
  మండలంలో టెన్త్‌లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించిన ఏకైక పాఠశాలగా గుర్తింపు పొందింది. పలువురు విదేశీయులు పాఠశాలను సందర్శించారు.  

ఏకతాటిపై నిలబడ్డాం
గ్రామస్తులందరం ఒక్కతాటిపై నిలబడి పాఠశాలను నిలబెట్టుకున్నాం. పిల్లలు బాగా చదువుతున్నారు. ఉపాధ్యాయుల సహకారం కూడా ఎంతో ఉంది. కానీ ఇప్పుడు విద్యార్థుల సంఖ్యకు తగినట్లు టీచర్లు లేరు. రేషనలైజేషన్, బైఫర్‌కేషన్‌ కాలేదని స్కూల్‌ అసిస్టెంట్లను ఇవ్వడం లేదు. ఐదు అదనపు తరగతి గదులు కావాలి. స్థలం కూడా సరిగా లేకపోవడంతో ఇరుకుగా ఉంది.   – పొన్నాల రాజు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ 

పిల్లలను ఇన్‌వాల్వ్‌ చేసి బోధిస్తాం
విద్యార్థులు ఉదయం 8 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటలకు బడినుంచి వెళ్తారు. స్టడీ అవర్స్‌లో టీచర్లు దగ్గరుండి చదివించడంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి అంశంలో పిల్లలను ఇన్‌వాల్వ్‌ చేసి బోధన సాగుతుంది. ఇప్పటికే నో అడ్మిషన్‌ బోర్డు పెట్టాం.       – ఆరోగ్యమ్మ గోపు, హెచ్‌ఎం 

అర్థమయ్యేలా చెబుతారు
బట్టీ విధానం ఉండదు. ప్రతి పాఠం సుల భంగా అర్థమయ్యేలా చెబుతారు. కంప్యూటర్‌ తరగతులు కూడా ఉన్నాయి. స్టడీ అవర్స్‌ వల్ల మేము బాగా చదవగలుగుతున్నాం. మధ్యాహ్న భోజనం కూడా బాగుంటుంది.    – పరకాల సాత్విక, టెన్త్‌ విద్యార్థిని 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement