హైదరాబాద్ కొండాపూర్‌లోని మజీద్‌బండలో ఎనిమిదెకరాల కుడికుంట చెరువులోని చెత్తాచెదారాన్ని ‘సాహి’అనే ఎన్జీఓ సంస్థ ఇటీవల శుభ్రం చేసి ఇళ్ల నుంచి వచ్చే డ్రైనేజీ నీటిని మళ్లించి వందల ఏళ్ల నాటి ఈ చెరువుకు కొత్త వైభవం తీసుకొచి్చంది. అంతటితో ఆగకుండా ఇదే చెరువుతో పరిసరాల్లో వచ్చిన మార్పులపై ‘లాస్ట్ మైల్ ఫర్ వాటర్’అనే టైటిల్‌తో షార్ట్‌ఫిల్మ్ రూపొందించి యూఎన్‌ఓ బెస్ట్ సిటీస్‌పై నిర్వహించిన కాంపిటీషన్‌కు పంపితే అక్కడ బెస్ట్ కేటగిరీలో నిలబడింది. ప్రపంచం హైదరాబాద్ వైపు చూసేలా చేసింది.
భూకంపాలు, రవాణా ఇబ్బందుల్లేని మహానగరాన్ని బహుళ జాతి సంస్థలు తమ వ్యాపార గమ్యస్థానంగా ఎంచుకుంటున్న సమయంలో, కొద్దిపాటి వర్షాలకే నగరం వరద ముంపు బారిన పడటం, ప్రజారవాణా ఇబ్బందులు, విద్యా సంస్థల మూత, ఐటీ కంపెనీలపై లాగౌట్ ఆంక్షలు.. హైదరాబాద్ సామర్థ్యంపై సరికొత్త సందేహాలను తెరపైకి తెస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు వరంగల్ నగరాలపై (అర్బన్ ఫ్లడ్స్) నిపుణులు ఇచి్చన నివేదికలపై తక్షణం కార్యాచరణ మొదలు పెట్టాలన్న డిమాండ్లను ముందుకు తెస్తున్నాయి.
మూసీ, ఈసీ నదుల ఉగ్రరూపం 1908 సెపె్టంబర్ 28న హైదరాబాద్ మహానగరాన్ని గడగడలాడించి 15,000 మందిని బలి తీసుకుంది. మూసీలో 60 ఫీట్ల ఎత్తుతో ఎగిసిన వరద ఉధృతికి అఫ్జల్‌గంజ్, ముసల్లం, చాదర్‌ఘాట్ వంతెనలు నేలమట్టమయ్యాయి. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం చూపాలనుకున్న ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ 1914లో సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో వరద నివారణతో పాటు ఆధునిక నీటిపారుదల పథకాలకు రూపకల్పన చేయించారు. అందులో భాగంగానే ఎగువ భాగాన మూసీపై ఉస్మాన్‌సాగర్, ఈసీపై హిమాయత్‌సాగర్‌ల నిర్మాణంతో పాటు 24 గంటల్లో 24 సెంటీమీటర్ల వర్షం, వరదను తట్టుకునేలా విశ్వేశ్వరయ్య వందేళ్ల ముందుచూపుతో హైదరాబాద్‌ను పునరి్నరి్మంచారు. కానీ 1990 తర్వాత నగరంలో చెరువులు, నాలాల భారీ ఆక్రమణల ఫలితంగా 1994, 2000, 2009, 2016, 2020 సంవత్సరాలలో హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తాయి.
ఓరుగల్లు ఉక్కిరి బిక్కిరి
పది లక్షల జనాభా దాటిన వరంగల్ నగరాన్ని వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక్కడ కూడా నాలాలు, చెరువుల ఆక్రమణలే సమస్యగా మారాయి. నగరంలో వరద నీటి కాలువలు లేకపోవటం వరంగల్‌కు ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ బొందివాగు నాలాతో హంటర్‌రోడ్డు సహా మరో పది కాలనీలు వర్షం నీరు వెళ్లే నాలాలు, కబ్జా ప్రదేశాలు, లోతట్టు ప్రాంతాల్లో కాలనీల నిర్మాణాలు నీట మునిగే పరిస్థితులు నెలకొన్నాయి. హనుమకొండ వడ్డెపల్లి, గోపాల్‌పూర్ చెరువులు నిండి పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. ఇక్కడ చేపట్టిన నాలా విస్తరణ పనులు నత్తకే నడకలు నేర్పుతుండటంతో ఏటా మునగటం కాలనీల వంతవుతోంది.
►మహానగరాన్ని వరద ముప్పు నుంచి తప్పించేందుకు కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలి. జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ నిపుణులు లక్ష్మణరావు నివేదికపై తక్షణ కార్యాచరణ చేపట్టాలి.
► చెరువులు›, కుంటలు, నాలాల నిర్వహణతో పాటు కబ్జాల నియంత్రణ కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలి.
► వరద నీటి నిల్వ, నియంత్రణలో ఉత్తమ ఫలితాలు కనబరిచే కమ్యూనిటీలను ఆస్తి పన్ను నుంచి మినహాయించాలి.
► ప్రస్తుతం కొనసాగుతున్న స్టెప్‌వెల్స్ (మెట్ల బావులు)కు మరమ్మతులు చేయాలి. బెంగళూరు తరహాలో భారీగా బావుల తవ్వకం చేపట్టాలి.
► మహానగరంలో చెల్లాచెదురైన æచెరువులను గొలుసుకట్టు పద్ధతిలో తక్షణం అనుసంధానం చేయాలి. నార్త్ ఈస్ట్ బేసిన్‌లోని నేరేడ్‌మెట్ ముక్కిడి చెరువు నుంచి మొదలయ్యే వరద దిగువన ఉన్న సఫిల్‌గూడ నదీం చెరువు, మల్కాజిగిరి బండచెరువుల నుంచి నాచారం పెద్ద చెరువు, ఉప్పల్ నల్లచెరువు మీదుగా సాఫీగా మూసీలోకి వెళ్లేలా చూడాలి.
►జీడిమెట్లలోని ఫాక్స్‌సాగర్ పూర్తిగా నిండిన తర్వాత అక్కడి నుంచి జీడిమెట్ల వెన్నెల చెరువు మీదుగా కూకట్‌పల్లి ఎల్లమ్మ చెరువు, మైసమ్మ చెరువు, పరికి చెరువుల మీదుగా బాలానగర్‌లోని అంబర్‌చెరువు, మూసాపేట కామునిచెరువు, కూకట్‌పల్లి రంగధామునికుంట, నల్లచెరువు
వరకు వరద మూసీకి వెళ్లేలా ఆక్రమణలు తొలగించాలి.
► శేరిలింగంపల్లి ఖాజాగూడ పెద్దచెరువు నుంచి మొదలయ్యే వరద నీరు మణికొండ ఎల్లమ్మచెరువు, ఇబ్రహీంబాగ్ పెద్దచెరువు మీదుగా షేక్‌పేట శాతం చెరువు నుంచి గోల్కొండ సమీపంలోని లంగర్‌హౌస్ చెరువుకు చేరేలా చేయాలి. ఇక మియాపూర్ గురునాథ్ చెరువు నుంచి ప్రారంభమయ్యే గొలుసుకట్టు మదీనగూడ పటేల్ చెరువు, గంగారం పెద్దచెరువు, హఫీజ్‌పేట మేడికుంట, కాయిదమ్మకుంట, కొత్తకుంటల మీదుగా మదీనగూడ ఎర్రచెరువు, లింగంపల్లి గోపిచెరువు, చాకలివాని చెరువు, నల్లగండ్ల చెరువుల మీదుగా వరద వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.
నాలుగేళ్ల క్రితమే నివేదిక
హైదరాబాద్ మహానగరానికి ముంపు ముప్పు తప్పించేందుకు నాలుగేళ్ల క్రితమే జేఎన్‌యూటీ నుంచి నివేదిక ఇచ్చాం. కేవలం రూ.4,093 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌ను వచ్చే వందేళ్ల వరకు సేఫ్‌గా ఉంచేలా నివేదికను ఇచ్చాం. ముఖ్యంగా క్లౌడ్ కంట్రోల్ చేస్తూనే వర్షం వల్ల వచ్చే వరదలను నివారించేందుకు మూడు మార్గాలు సూచించాం. అవి చేయకుండా ఆఫీసులు, విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. వరదల వల్ల ఏటా రూ.5 వేల కోట్లు వ్యయమయ్యే రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి, మరో రూ.5 వేల కోట్ల వరకు నగరవాసులు నష్టపోతున్నారు. వరదలకు శాశ్వత పరిష్కారం చూపకుండా తాత్కాలిక పద్ధతుల్లో వెళితే విశ్వనగరం దిశగా అడుగులేస్తున్న హైదరాబాద్ ఇమేజ్ మసకబారే ప్రమాదముంది.
– డాక్టర్ కేఎం లక్ష్మణరావు,
అర్బన్ ఫ్లడ్స్ నిపుణుడు, జేఎన్‌టీయూ
ఇది నిజంగా దైన్యస్థితి
హైదరాబాద్ అంటేనే గొలుసుకట్టు చెరువులు. 24 సెంటీ మీటర్ల వర్షం, వరదను తట్టుకునేలా డిజైన్ చేసిన వరద కాల్వలు మన నగరం సొంతం. కానీ రియల్ ఎస్టేట్ విస్తరణే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితమే నేడు హైదరాబాద్‌లో రెయినీ హాలిడేస్. వర్షం, వరద భయంతో ఐటీ, విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వటమనేది. ఇది నిజంగా దైన్యస్థితే.
–లుబ్నా సర్వత్, సేవ్ అవర్ లేక్ సొసైటీ (సోల్)
అందరం కలిస్తేనే బెటర్ హైదరాబాద్
హైదరాబాద్ ఈ రోజు చిరు జల్లులకే వణుకుతోందంటే..అందుకు అందరూ బాధ్యులే. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలో అందరి బాధ్యత ఉన్నట్లు, వర్షం నీటి వృథా విషయంలోనూ ప్రతి ఇంటి బాధ్యత ఉంది. హైదరాబాద్‌లో ఈ పరిస్థితికి అందరూ బాధ్యులే. అందుకే అందరు కలిసి బెటర్ హైదరాబాద్ దిశగా ముందుకు సాగాలి. కుడికుంట చెరువు తర్వాత ఇప్పుడు శేరిలింగంపల్లి ప్రాంతంలో 30 చెరువుల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది.
– కల్పనా రమేశ్, సాహి ఎన్జీఓ
Comments
Please login to add a commentAdd a comment