ఖరీఫ్ మళ్లీ ఆలస్యమే
అంచనాలకు అందని సాగు విస్తీర్ణం
వచ్చేనెల సమీక్ష ద్వారానే నిర్ధారణకు వీలు
రబీకీ ప్రతికూల వాతావరణం
అనకాపల్లి, న్యూస్‌లైన్: ఈ ఏడాది కూడా ఖరీఫ్ అనుకున్నట్టు ప్రారంభం కాదనిపిస్తోంది. వాతావరణ కారణాల వల్లే ఖరీఫ్ మళ్లీ ఆలస్యం కానుంది. దీనికి సంబంధించి వ్యవసాయ విస్తరణ, పరిశోధన విభాగాలు ఇప్పటికే ఓ ప్రాథమిక అంచనాకు వచ్చాయి. ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొనడంతో పాటు వర్షపాతం తగ్గే అవకాశముందని వచ్చిన సూచనలు వ్యవసాయ విభాగాన్ని కలవరపరుస్తున్నాయి.
జిల్లాలో 2.16 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు చేపట్టాల్సి ఉండగా, దీనిలో ప్రధానభాగం వరిపంటకే దక్కుతుంది. సరాసరి లక్ష హెక్టార్లలో వరి సాగు చేయా ల్సి ఉన్నప్పటికీ వర్షంపైనే అధిక శాతం రైతులు ఆధారపడతారు. వరి నారుమళ్లు వేసే రైతులు నింగివైపు ఆశగా ఎదురుచూస్తుంటారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల అంచనాల మేరకు ఈ ఏడాది కనీ సం ఆగస్టు రెండోపక్షం నుంచే ఖరీఫ్ సాగు మొదలవుతుందని తెలుస్తోంది. ఈ ఏడాది మొక్కజొన్న విస్తీర్ణం పెరిగే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మొక్కజొన్న పంట గిట్టుబాటుకావడం తో పాటు స్వీట్‌కార్న్‌పై అందరికీ ఆసక్తి పెరగడంతో వాటి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముంది. వర్షాలను బట్టి వరి, వర్షాధార చెరకు విస్తీర్ణాలు నమోదయ్యే అవకాశం ఉంది. వర్షపాతం తగ్గితే అపరాల సాగుపై రైతులు మళ్లే అవకాశముంది. ఇప్పటికిప్పుడే పరిస్థితిపై అంచ నా లేకపోయినా, మే రెండో వారానికి ఓ అవగాహన కలిగే అవకాశం ఉంది.
పరిశోధన విభాగం శాస్త్రవేత్తలంతా మే 12 నుంచి ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న సదస్సులో దృశ్యం ఆవిష్కృతమయ్యేట్టు ఉంది. ఈ సదస్సులో ఖరీఫ్, రబీ సీజన్‌కు సంబంధించి సమీక్ష జరగనుంది. జూన్ 2 నుంచి రెండు ప్రభుత్వా లు ఏర్పాటు కాబోతూ ఉండడంతో ఆ లోపు ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించే చిట్టచివరి రాష్ట్రస్థాయి సమీక్ష ఇదే కానుంది.
రబీకి చిక్కులు : భారీ వర్షాల నేపథ్యంలో గత రబీ సీజన్ ఆలస్యంగా మొదలైన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, నీటిముంపు పరిస్థితుల నుంచి తెప్పరిల్లి రబీ పంటలపై ఆశలు పెట్టుకున్న రైతులకు జనవరి నుంచి మారిన వాతావరణ స్థితిగతులు ప్రతికూల ఫలితాలనే రుచి చూపిస్తున్నాయి. వాస్తవానికి ఈపాటికే రబీ సాగు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యంగా మొదలుకావడంతో ఇంకా కొనసాగుతోంది. జిల్లాలో పొద్దుతిరుగుడు, వరి, చెరకు, మొక్కజొన్న పంటలు సాగు దశలో ఉన్నాయి. చెరకు దీర్ఘకాలికపంట కావడంతో పాటు ఖరీఫ్, రబీల జమిలి పంటగా గుర్తింపు పొందింది. పొద్దు తిరుగుడు వరి, చెరకులకు చీడపీడల తాకిడి అధికంగా ఉంది. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల వరి, చెరకులకు పీక పురుగుల తాకిడి ఎక్కువైంది.