వెలుగనివీ విలువైనవే!
ఫిలమెంట్ మాడిపోయిన బల్బుని క్షణాల్లో డస్ట్‌బిన్ బాట పట్టిస్తాం. కానీ ఒక్కక్షణం ఆలోచిస్తే దానిని మళ్లీ పనికొచ్చేలా చేయొచ్చు. అంటే... మళ్లీ వెలిగేలా చేయలేం కానీ, దాని రూపాన్నే మార్చి ఇంటికి కొత్త వెలుగులు తీసుకు రావచ్చు. కావాలంటే ఈ ఫొటోలో చూడండి. ఇవన్నీ పనికిరాని బల్బులే. కానీ వీటిని పనికొచ్చేలా మార్చారు కొందరు క్రియేటివ్ పీపుల్. బల్బు చివర ఉండే స్క్రూ త్రెడ్ కాంటాక్ట్ (హోల్డర్‌లో పెట్టే మెటల్ భాగం)ను అలాగే ఉంచి, దాని మధ్యలో ఉండే భాగాన్ని జాగ్రత్తగా తీసేయాలి. అందులో మట్టిని నింపి, అందులో ఓ చిన్ని మొక్కను నాటితే చక్కని పూలకుండీ రెడీ.
నీళ్లు నింపి పూలగుత్తులు వేస్తే అందమైన ఫ్లవర్ వాజ్ రెడీ. అలాగే రంగురంగుల బటన్సో, గోళీలో వేసి, తాడు కట్టి, ఎక్కడైనా వేళ్లాడదీస్తే ఇంటికే కొత్త అందం వస్తుంది. కావాలంటే బల్బునే ఓ చోట కట్ చేసి, లోపల ప్లాస్టిక్ బొమ్మలు మొక్కలు కూడా పెట్టుకుని ఇంటిని అలంకరించుకోవచ్చు. కాస్త నూనె, వత్తి వేసి దీపంలా వెలిగించుకోవచ్చు. చక్కటి రంగులు వేసి బొమ్మల్లా మేకప్ చేసి షో కేసుల్లోనూ పెట్టుకోవచ్చు. ఐడియాలకు కొదవేముంది! ట్రై చేసి చూడండి.