ఇన్ఫీకి త్వరలోనే కొత్త సీఈఓ
బెంగళూరు: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ ఎస్.డి.శిబూలాల్ వారసుడిని త్వరలోనే ప్రకటించనున్నారు. కొత్త సీఈఓ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి వెల్లడించారు. దేశ విదేశాల్లోని 1.60 లక్షల మంది ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఆయన శుక్రవారం ఈ మేరకు ఈ మెయిల్ పంపారు. ఎంపిక ప్రక్రియ ముగింపు దశలో కొత్త సీఈఓను నామినేషన్ బోర్డు ప్రకటిస్తుందని తెలిపారు. శిబూలాల్ పదవీకాలం వచ్చే ఏడాది మార్చి వరకు ఉంది కానీ జనవరిలో రిటైర్ అవుతానని గతంలోనే చెప్పారు. ఈ నేపథ్యంలో సీఈఓ పదవికి అర్హులైన వారిని డెవలప్మెంట్ డెమైన్షన్స్ ఇంటర్నేనల్ (డీడీఐ) అనే సంస్థ సహకారంతో షార్ట్‌లిస్ట్ చేయాల్సిందిగా డెరైక్టర్ల బోర్డును కంపెనీ కోరింది.
కంపెనీ ప్రెసిడెంట్, బోర్డు సభ్యుడు బి.జి.శ్రీనివాసన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘కంపెనీ అత్యున్నత ప్రయోజనాలకు అనుగుణంగానే నాయకత్వ మార్పులుంటాయని భరోసా ఇస్తున్నాను. మరింత ఉజ్వల భవిష్యత్తు కోసం బయటికి వెళ్తున్నట్లు శ్రీనివాసన్ చెప్పారు. శ్రీనివాసన్ ఆశయ సిద్ధికి నా మద్దతు ఉంటుంది...’ అని మూర్తి తన లేఖలో తెలిపారు. ఇన్ఫోసిస్ పగ్గాలను మూర్తి గతేడాది జూన్‌లో తిరిగి చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 10 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీకి గుడ్‌బై చెప్పారు. దీనిపై కంపెనీ ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించడానికి మూర్తి ఈమెయిల్లో యత్నించారు. కంపెనీ తన లక్ష్యాలపై దృష్టిని కొనసాగిస్తుందనీ, నిరంతరం ప్రగతి పథంలో కొనసాగుతుందన్నారు.
నిలేకని సేవలు అవసరం...
మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ సూచన
సాక్షి, బెంగళూరు : ‘ఇన్ఫోసిస్ ప్రస్తుతం సంక్లిష్ట స్థితిలో ఉంది. సంస్థలో మెరుగైన వాతావరణం ఏర్పడటానికి మీ సేవ లు అవసరం. అందువల్ల మీరు మరల ఇన్ఫోసిస్‌లో అడుగుపెట్టండి’ అంటూ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్.. సంస్థ మాజీ సీఈఓ నందన్ నిలేకనికి సూచించారు. శుక్రవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇన్ఫోసిస్ నుంచి పలువురు సీనియర్ అధికారులు సంస్థ వీడి వెళ్లిపోయిన నేపథ్యంలో మోహన్‌దాస్ సూచన ప్రాధాన్యతను సంతరించుకుంది.