షార్‌లో చోరీల జోరు
► భద్రత కరవైన అంతరిక్ష కేంద్రం
► తరుచుగా దొంగతనాలు
► ఉగ్రదాడులు చొరబడితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) దేశం గర్వించే రాకెట్ ప్రయోగ కేంద్రం. అంతరిక్షాన్ని అణువణువూ పరిశోధించే పనుల్లో శాస్త్రవేత్తలు మునిగి ఉంటారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ కేంద్రాన్ని కాపాడటానికి చీమ చిటుక్కుమన్నా అప్రమత్తమయ్యే భద్రతా సిబ్బంది వేయి కళ్లతో పహారా కాస్తూ ఉండాలి. అయితే ఆ కేంద్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న దొంగతనాలు భయంపుట్టిస్తున్నాయి. భద్రత పటిష్టంగా ఉందని అధికారుల చెబుతున్నా.. ఆ భద్రతలో డొల్లతనాన్ని తరచుగా దొంగలు బహిర్గతం చేస్తున్నారు. చిన్నచిన్న దొంగలే ఇంత సులువుగా లోపలికి ప్రవేస్తుంటే ఉగ్రవాద దాడులు జరిగితే ఎలా అన్న ప్రశ్నతలెత్తుతోంది.
భద్రతపై భేటీలతో సరి..
ఇటీవల షార్‌లో సీఐఎస్ఎఫ్, కోస్టల్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్, విజిలెన్స్, రెండు రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో భద్రతా సమావేశాన్ని నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అవన్నీ ఫైళ్లల్లో భద్రంగా ఉన్నాయే తప్ప అమలుకు నోచుకోవడం లేదు. ఈ సమావేశం జరిగిన తరువాత ఛత్తీస్ గ స్గఢ్కు చెందిన ఒక వ్యక్తి షార్‌లో చొరబడటం విశేషం. సుమారు 43,360 ఎకరాలు (175 చదరపు కిలోమీటర్లు) విస్తరించి ఉన్న షార్ కేంద్రానికి వెయ్యి మంది భద్రతా సిబ్బంది పహరాకాస్తూ ఉంటారు. శ్రీహరికోట దీవి చుట్టూ 25 వరకూ గస్తీ పాయింట్లు ఉన్నాయి. సముద్రంవైపు మాత్రం ఆశించిన స్థాయిలో నిఘా లేదు. ముఖ్యంగా శ్రీహరికోటకు ఉత్తరంవైపు నవాబుపేట నుంచి, దక్షిణభాగంలో పల్వేరికాడ్ నుంచి దొంగలు వస్తున్నట్టు భద్రతాసిబ్బంది కనుగొన్నారు. అయితే ఈ రెండు వైపులా నిఘా పెంచడంలో భద్రతా అధికారులు విఫలమవుతున్నారు.2013లో మెరైన్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. అయితే మెరైన్ పోలీస్ స్టేషన్లను ఎవరూ పట్టించుకోకపోవడంతో అక్కడి సిబ్బంది నామమాత్రపు విధులు నిర్వహిస్తున్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువ అవుతున్న దృష్ట్యా షార్కు మరింత అదనపు బలగాలతో పాటు సముద్రం వైపు నుంచి కూడా నిఘాను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అంతా అభిప్రాయపడుతున్నారు.
భద్రతా సిబ్బందికి దొంగల సవాల్..
షార్‌లో సౌండింగ్ రాకెట్ ప్రయోగవేదిక సమీపంలోని మాగ్జైన్ భవనం (పాడుపడిపోయిన భవనం)లో పదిరోజులు కిందట దొంగలుపడి పిడుగుపాటును నివారించే రాగివైర్లను కత్తిరించుకుని వెళ్లారు. ఈ విషయాన్ని సీఐఎస్ఎఫ్ సిబ్బంది గురువారం గుర్తించారు. భారీగా సామగ్రి చోరీ జరక్కపోయినా.. దొంగలు రావడమే భద్రతా సిబ్బందికి సవాల్‌గా మారింది. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి దొంగతనాలు జరిగాయి. 2013లో ఎంతో విలువైన కేబుల్ స్ ను కాల్చి అందులో ఉన్న రాగిని అక్కడే తీసి పట్టుకుపోయినా సీఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించలేకపోవడం అప్పట్లో సంచలనమైంది. అత్యంత పకడ్బందీ భద్రత ఉండే రెండో గుండా దొంగలు వెళ్లి ఏకంగా కంప్యూటర్లనే ఎత్తుకుపోయిన ఘటనలు కూడా ఉన్నాయి.