Seaman
-
పోటీకి సై అంటే.. డీఎంకేకు మద్దతు ఇస్తా!
సాక్షి, చైన్నె : రామనాథపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసే పక్షంలో, ఆయనకు ప్రత్యర్థిగా డీఎంకే అభ్యర్థి రంగంలో ఉంటే వారికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ ప్రకటించారు. లేదంటే తాను బరిలో దిగుతామని స్పష్టం చేశారు. వివరాలు.. నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్‌పై సినీ నటి విజయలక్ష్మి చేసిన ఆరోపణలు, ఫిర్యాదులు చర్చకు దారి తీసి ఉన్న విషయం తెలిసిందే. సీమాన్‌ను విచారించేందుకు పోలీసులు సమన్లు సైతం జారీ చేసి ఉన్నారు. ఆయన్ని అరెస్టు కూడా చేయవచ్చు అన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో విజయలక్ష్మికి వ్యతిరేకంగా నామ్ తమిళర్ కట్చి వర్గాలు సైతం పోలీసులకు ఫిర్యాదు చేస్తూ వస్తున్నాయి. ఈ ఎపిసోడ్లో ఆదివారం అనూహ్యంగా సీమాన్ డీఎంకేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మీడియాతో మాట్లాడుతూ.. కోయంబత్తూరులో సీమాన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ కంటే తన పార్టీ పెద్దదని, ఆ మేరకు తనకు ఓటు బ్యాంక్ ఉందన్నారు. అందుకే తనను ఎన్నికల వేళ ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా పరిణామాలను గుర్తుచేశారు. ఒకవేళ రామనాథపురం నుంచి ప్రధాని నరేంద్రమోదీ పోటీ చేస్తే, ఆయనకు ప్రత్యర్థిగా డీఎంకే అభ్యర్థిని నిలబెట్టిన పక్షంలో తాను అన్ని చోట్ల ఎన్నికల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అలాగే డీఎంకేకు మద్దతు ఇస్తానని స్పష్టం చే శారు. అయితే, ఎన్నికల్లో ప్రత్యక్షంగా బీజేపీని డీఎంకే ఒక్కటే ఢీకొట్టే పరిస్థితులు లేవుని , ఇందుకు గత ఎన్నికలే నిదర్శనంగా పేర్కొన్నారు. బీజేపీ పోటీ చేసే స్థానాలను మిత్ర పక్షాలకు డీఎంకే కేటాయిస్తున్న విషయాన్ని గుర్తెరగాలని సూచించారు. -
సీసీటీవీ సాక్షిగా బయటపడ్డ తండ్రి ఘాతుకం
-
సీసీటీవీ సాక్షిగా బయటపడ్డ తండ్రి ఘాతుకం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రే తన కొడుకును కిరాతకంగా హతమార్చాడు. సుత్తితో బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. వీర్రాజు అనే వ్యక్తి గతంలో సీమేన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం అతడి కుటుంబం పెందుర్తి శివారు చిన్నముసిడివాడ లో నివాసం ఉంటోంది. వీర్రాజుకు కుమారుడు జలరాజు ఉన్నాడు. అతడు సీమెన్‌గా పని చేస్తున్నాడు. కాగా తండ్రితో కలిసి ఉంటున్న జలరాజు ఇటీవల చిన్నముసిడివాడలో సొంతంగా ఇల్లు నిర్మాణం చేపట్టాడు.(రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి) ఈ నేపథ్యంలో అతని ముగ్గురు చెల్లెళ్లకు కొంత డబ్బు ఇవ్వాల్సిందిగా తండ్రి వీర్రాజు అతడికి సూచించాడు. ఇందుకు అంగీకరించిన జలరాజు.. తనకు కొంత గడువు ఇవ్వాలని తండ్రిని కోరాడు. ఈ విషయంపై గతకొంత కాలంగా తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం జలరాజు ఇంటి ముందర పని చేస్తుండగా వెనకనుంచి వచ్చిన వీర్రాజు వచ్చి సుత్తితో కొడుకు తలపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో తీవ్రగాయాలపాలైన జలరాజును కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కాగా కన్నకొడుకునే తండ్రి హత్య చేయడం వెనుక గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెస్ట్ ఏసీపీ స్వరూప రాణి తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో నేరం స్పష్టంగా కనిపిస్తోందని. హత్యానేరం కింద వీర్రాజుపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.(నర్సు ఆత్మహత్య) -
మహిళా పోలీసులకే మిగమిగ అవసరం
తమిళసినిమా: మిగమిగ అవసరం చిత్రాన్ని మహిళా పోలీసులకు అంకితం ఇస్తున్నట్లు ఆ చిత్ర దర్శక నిర్మాత సురేశ్ కామాక్షి తెలిపారు. ఇంతకు ముందు అమెదిపడై 2, కంగారు చిత్రాలను నిర్మించిన సురేశ్ కామాక్షి మూడవ చిత్రానికి తానే దర్శకుడిగా అవతారమెత్తారు. ఆయన స్వీయ నిర్మిస్తున్న చిత్రానికి మిగ మిగ అవసరం అని పేరు నిర్ణయించారు. శ్రీప్రియాంక నాయకిగా సెంట్రిక్ పాత్రను పోషిస్తున్న ఇందులో హరీశ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్నారు. పోలీస్ అధికారిగా ప్రధాన పాత్రలో దర్శకుడు సీమాన్ నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో లళక్కు ఎన్ ముత్తరామన్, సేతుపతి లింగ, పరంజ్యోతి, దర్శకుడు సరవణ శక్తి నటిస్తున్నారు. దర్శకుడు జగన్ కథ, కథనాన్ని అందించిన ఈ చిత్రాన్ని సురేశ్ కామాక్ష్మి స్వీయ దర్శకత్వంలో తన వి.హౌస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఆయన తెలుపుతూ మిగ మిగ అవసరం చిత్రంలో మహిళా పోలీసుల మనోధైర్యాన్ని, మానవత్వాన్ని, వాటితో పాటు వాళ్ల సమస్యలను అత్యంత సహజంగా తెరపై ఆవిష్కరించిన ట్లు తెలిపారు. అందువల్ల ఈ చిత్రాన్ని మహిళా పోలీసులకు అంకితం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. -
సీమాన్‌ను అరెస్ట్ చేయాలి
తెలుగుజాతి గౌరవానికి తార్కాణమైన తిరుమల నాయకర్ను కించపరస్తూ వ్యాఖ్యలు చేసిన నామ్ తమిళర్ కట్చి అధ్యక్షుడు సీమాన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఒక రాజకీయ పార్టీ నేతగా హుందాగా వ్యవహరించాల్సిన సీమాన్ చౌకబారు విమర్శలతో ప్రాచుర్యం పొందాలనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. గతం లో వడివేలు హీరోగా నటించిన తెనాలి రామన్ చిత్ర వ్యవహారంలో సైతం సీమాన్ తలదూర్చి తెలుగువారి పట్ల పరుషపదజాలాన్ని ప్రయోగించారని గుర్తు చేశారు. ఆ సమయంలో తెలుగు సంఘాలన్నీ ఏకమై ఆయనకు తగిన బుద్ధి చెప్పిన విషయాన్ని మరచినట్లు ఉన్నారని పేర్కొన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రముఖుడిగా వెలుగొందాలని ఆశిస్తే తెలుగువారు చేష్టలుడిగి ఊరుకోరని హెచ్చరించారు. నడిగర్ ఎన్నికల ప్రచారంలో తెలుగువారి పట్ల దూషణలు చేయడం గమనిస్తే ఇది పథకం ప్రకారం సాగుతోందన్న భావన కలుగుతోందని అన్నారు. ముఖ్యమంత్రి జయలలిత పాలనలో తెలుగువారు సంతోషంగా ఉన్నారన్న అభిప్రాయాన్ని కాలరాస్తున్న సీమాన్ వంటి దుష్టశక్తులను వెంటనే కటకటాల వెనక్కి నెట్టాలని కోరారు. సీఎం, డీజీపీ, రాష్ట్ర గవర్నర్‌కు సీమాన్ విషయమై వినతిపత్రాలు పంపినట్లు చెప్పారు. ప్రభుత్వం తగినరీతిలో స్పందించకుంటే తెలుగు సంఘాలన్నీ ఏకమై తెలుగుద్రోహులకు బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ముందిరక్కాడులో పోలీస్ అధికారిగా సీమాన్
నామ్ తమిళర్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజా పోరాటం చేస్తున్న సినీ దర్శకుడు సీమాన్ సుదీర్ఘ విరామం తరువాత ముందిరకాడు అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.అలాగే కారు విపత్తుకు గురై కొంత కాలంగా సినిమాకు దూరంగా ఉన్న దర్శకుడు కళైంజియం తాజాగా కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని వహిస్తున్న చిత్రం ముందిరక్కాడు. తమిళన్ కలై పంబాట్టు ఇయక్కమ్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో పుగళ్ అనే నవ నటుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇండియన్ కమ్యునిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు సి.మహేంద్రన్ కొడుకు అన్నది గమనార్హం. సుప్రియ కథానాయకిగా నటిస్తుండగా ఇతర ముఖ్యపాత్రల్లో జయకర్, సోము, శక్తివేల్,ఆంబళ్తిరు, కలైశేఖర్, పావల లక్ష్మణన్ నటించారు.ఏకే.ప్రియన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు కళైంజియం తెలుపుతూ ఇది ముందిరక్కాడు ప్రాంత జన జీవనాన్ని యదార్థంగా ఆవిష్కరించే కథా చిత్రం అని వివరించారు. ఇందులో అంబరసన్ అనే పోలీస్ అధికారిగా సీమాన్ నటిస్తుండడం విశేషం అన్నారు. ముందిరక్కాడు ప్రజల జీవన విధానాన్ని వారి సమస్యల్ని కళ్లకు కట్టినట్లు చూపించనున్నట్లు తెలిపారు.ఆ ప్రాంత ఓ యువ జంట ప్రేమను ఆ ఊరే వ్యతిరేకిస్తే పోలీస్ అధికారి సీమాన్ ఆ జంటను కలపడానికి ప్రయత్నిస్తారన్నారు. ఆయన ప్రయత్నం సఫలం అయ్యిందా? లేదా? ఇత్యాది పలు ఆసక్తికర అంశాల సమాహారంగా ముందిరక్కాడు చిత్రం ఉంటుందని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను తంజావూర్,నెల్లై చిల్లాలతో పాటు చెన్నై,ఆంధ్ర ప్రాంతంలోని నగరి ప్రాంతాల్లో 40 రోజుల పాటు నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కడలూరు, పాండీ ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. -
‘ఆర్మీ చర్చా పై వ్యతిరేకత
శ్రీలంకలో నిర్వహించనున్న ఆర్మీ చ ర్చా వేదికకు భారత్ నుంచి ప్రతినిధి వె ళ్తుండడంపై వ్యతిరేకత మొదలైంది. ఆ చర్చను బహిష్కరించాలన్న నినాదంతో ఆదివారం నామ్ తమిళర్ కట్చి నేతృత్వంలో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఆ పార్టీ నేత సీమాన్ నేతృత్వంలో చెన్నైలోని శ్రీలంక దౌత్య కార్యాలయం ముట్టడికి యత్నించారు. సాక్షి, చెన్నై: శ్రీలంకలో జరిగే ఎలాంటి వేడుకలకు భారత్ నుంచి ప్రతినిధి వెళ్లకూడదని, అలాగే, అక్కడి నుంచి ఇక్కడి వేడుకలకు ఏ ఒక్కరూ హాజరు కాకూడదన్న హెచ్చరికను ఈలం తమిళాభిమాన సంఘాలు, పార్టీలు తరచూ ఇస్తున్నాయి. అయినా వారి హెచ్చరికలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం శ్రీలంకలో ఆర్మీ ఘనతను చాటే రీతిలో చర్చా వేదిక సోమవారం నుంచి మూడు రోజులపాటుగా నిర్వహిం చనుంది. ఈ చర్చా వేదికగా అన్ని దేశాల ఆర్మీ అధికారులను శ్రీలంక ఆహ్వానించింది. భారత్ నుంచి అధికారులు అక్కడికి పయనం అయ్యేందుకు రెడీ అవుతున్న సంకేతాలతో తమిళనాట వ్యతిరేకత బయలుదేరింది. తాము వ్యతిరేకిస్తున్నా, కేంద్రం ప్రతినిధిని పంపడం ఎంత వరకు సమంజసమంటూ తమిళాభిమాన సంఘాలు, పార్టీలు ఆందోళనకు దిగుతున్నాయి. నిరసన: ఆర్చీ చర్చలో భారత ప్రతినిధులు పాల్గొనకూడదన్న నినాదంతో నామ్ తమిళర్ కట్చి నేతృత్వంలో ఆదివారం రాష్ట్రంలో పలు చోట్ల నిరసనలు చోటు చేసుకున్నాయి. చెన్నైలో ఆ పార్టీ నేత సీమాన్ నేతృత్వంలో కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా నుంగంబాక్కం చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీలంక దౌత్య కార్యాలయం మార్గం వైపుగా చొచ్చు కెళ్లారు. ఈ హఠాత్పరిణామాన్ని గుర్తించిన ఆ పరిసరాల్లోని భద్రతా సిబ్బంది నిరసనకారులను అడ్డుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేసి, ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. శ్రీలంకకు వ్యతిరేకంగా నిరసన కారులు నినదించారు. ఆర్మీ చర్చలో భారత ప్రతినిధులు పాల్గొంటే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించి నిరసనకు దిగడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. చివరకు పోలీసులు ఆందోళనకారులను బుజ్జగించే యత్నం చేసి, సఫలీకృతులయ్యారు. యూపీఏ బాటలోనే : ఈలం తమిళుల విషయంలో, జాలర్ల సమస్య పరిష్కారంలో యూపీఏ బాటలోనే బీజేపీ సర్కారు సైతం పయనిస్తోందని సీమాన్ మండిపడ్డారు. రెండు పార్టీలకు, ప్రభుత్వాలకు తేడా లేదని, రెండూ దొందు దొందేనని విమర్శించారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను తన ప్రమాణ స్వీకారానికి రెడ్ కార్పెట్‌తో ఆహ్వానించిన రోజునే తమిళుల మీద చిత్తశుద్ధి ప్రధాని నరేంద్ర మోడీకి ఏ పాటిదో స్పష్టమైందన్నారు. రానురాను యూపీఏ బాణిలో మోడీ సర్కారు పయనిస్తోందని ధ్వజమెత్తారు. తమిళులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే, ఎలాంటి పరిణామాలు చవిచూడాల్సి వస్తుందో అన్న విషయం లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు తెలియవచ్చిందన్నారు. ఇదే పరిస్థితి బీజేపీకి ఏర్పడకుండా ఉండాలంటే, ఈలం తమిళుల మీద, తమిళ జాలర్లకు భద్రత కల్పించడంలో కృషి చేయండంటూ హితవు పలికారు. సోమవారం నుంచి శ్రీలంకలో జరగనున్న ఆర్మీ చ ర్చా వేదికకు భారత్ నుంచి ప్రతినిధులు ఎవ్వరూ వెళ్లకూడదని, ఒక వేళ వెళ్లిన పక్షంలో తమిళుల ఆగ్ర హం ఏ పాటిదో చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
ప్రచారానికి రెడీ
సాక్షి, చెన్నై: ఈలం తమిళుల సంక్షేమమే లక్ష్యంగా నామ్ తమిళర్ పేరిట సినీ నటుడు, దర్శకుడు సీమాన్ సంఘా న్ని ఏర్పాటుచేశారు. అనతి కాలంలో దాన్ని పార్టీగా మార్చారు. ఈ పార్టీ ఎన్నికలకు దూరం. ఈలం తమిళులకు చిన్న హాని జరిగినా, వారికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఈ పార్టీ కార్యకర్తలు ముందుంటారు. ప్రధానంగా కాంగ్రెస్‌ను ఢీకొట్టడమే లక్ష్యంగా నామ్ తమిళర్ కట్చి ముందుకు సాగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడ్డ చోటల్లా ఈ పార్టీ కార్యకర్తలు వారికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అలా అని పలాన వ్యక్తికి ఓటేయండని ఓట్లకు విజ్ఞప్తి చేయలేదు. తమిళుల్ని సర్వనాశనం చేస్తున్న కాంగ్రెస్‌ను తరిమి కొట్టాలని వీరు సాగించిన ప్రచారం కొంతమేరకు ఫలితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అనేక మంది ప్రధాన నాయకులు ఆ ఎన్నికల్లో ఓటమిని చవి చూశారు. రెండంకెల నుంచి సింగిల్ డిజిట్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంఖ్య పడిపోయింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. డీఎంకే ఛీదరించుకోవడం, డీఎండీకే హ్యాండివ్వడంతో చివరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఓడించాలనే లక్ష్యంతో ఎన్నికల ప్రచారానికి సీమాన్ రెడీ అయ్యారు. ఈ పర్యాయం బీజేపీని సైతం ఆయన టార్గెట్ చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో అక్కడల్లా వారికి కూడా ఓటు వేయొద్దంటూ ప్రచారం చేయనున్నారు. తమిళులకు కాంగ్రెస్ చేసిన ద్రోహం, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ చూపిన నిర్లక్ష్యం, ప్రదర్శించిన కపట నాటకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా నామ్ తమిళర్ కట్చి కార్యకర్తలు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. తమ ప్రచారం జరిగే నియోజకవర్గాల్లో నాటకాలు, లఘు చిత్రాలు, కరప్రతాల రూపంలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏడు నుంచి ప్రచారం ఏప్రిల్ ఏడో తేదీ నుంచి ప్రచారం చేపట్టాలని సీమాన్ నిర్ణయించారు. ఈ విషయంగా ఆయన మీడియాతో బుధవారం మాట్లాడారు. ఈ నెల 29న చెన్నైలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. ఇందులో ఏఏ స్థానాల్లో ఏయే రూపాల్లో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్ని ఓడించాలో నిర్ణయాలు తీసుకోనున్నామన్నారు. తమిళ ప్రజలకు కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని తలచుకుంటే ఆక్రోశం రగులుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను భూ స్థాపితం చేయడమే లక్ష్యంగా తాము ముందుకెళుతున్నామన్నారు. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్రంలో పతనం అంచున చేరిందని, లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌కు నూకలు చెల్లినట్టేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ద్రోహంలో బీజేపీకి కూడా భాగం ఉందన్నారు. కాషాయం పార్టీ బీజేపీ కాంగ్రెస్‌ను వెనకేసుకు రావడం వల్లే ఈలం తమిళులు సర్వనాశనం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చర్యల్ని అడ్డుకోవాల్సిన బీజేపీ నాయకులు వేడుక చూశారని, అందుకే రాష్ట్రంలో ఆ పార్టీ అభ్యర్థుల్ని ఓడించడమే లక్ష్యంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టనున్నామని వివరించారు. డీఎంకే, అన్నాడీఎంకేలు మేల్కొన్నాయని, అందుకే కాంగ్రెస్, బీజేపీల్ని ఛీదరించుకున్నట్టున్నాయని పేర్కొన్నారు. బీజేపీతో కలకుంటే బాగుండేది డీఎండీకే నేత విజయకాంత్ బీజేపీతో చేతులు కలవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సీమాన్ వెల్లడించారు. ఈలం తమిళుల్ని సర్వనాశనం చేసిన వాళ్లతో దోస్తీ మానుకుని ఉంటే బాగుండేదని, వారితో కలిసిన దృష్ట్యా, ఆయనకు ఇక పతనం తప్పదన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన అన్ని విధాలుగా విఫలమయ్యారని విమర్శించారు. ఆయన్ను ప్రజలు ఇక ఆదరించబోరన్నారు. పలాన వారికి ఓట్లు వేయమని తాము సూచించబోమని, కాంగ్రెస్, బీజేపీలకు మాత్రం ఓట్లు వేయొద్దని ఓటర్లను వేడుకుంటామన్నారు. ఆ రెండు పార్టీల అభ్యర్థులకు కాకుండా, మరెవ్వరికైనా ఓటు వేసే రీతిలో ఓటర్లలో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీమాన్ వ్యతిరేక ప్రచారం పలుచోట్ల ఉద్రిక్తతకు దారి తీసింది. అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు కేసుల రూపంలో సీమాన్ మెడకు చుట్టుకున్నారుు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ప్రచారం ఎలాంటి ఉద్రిక్తతలు రేపుతుందో.. అసలు ఆయన ప్రచారానికి పోలీసులు అనుమతి ఇస్తారా? అన్నది వేచి చూడాలి.