సీసీటీవీ సాక్షిగా బయటపడ్డ తండ్రి ఘాతుకం | Watch: CCTV Footage Of Father Eliminates Son In Visakhapatnam | Sakshi
Sakshi News home page

సీసీటీవీ సాక్షిగా బయటపడ్డ తండ్రి ఘాతుకం

Aug 13 2020 3:11 PM | Updated on Mar 21 2024 8:24 PM

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రే తన కొడుకును కిరాతకంగా హతమార్చాడు. సుత్తితో బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివరాలు.. వీర్రాజు అనే వ్యక్తి గతంలో సీమేన్‌గా పనిచేశాడు. ప్రస్తుతం అతడి కుటుంబం పెందుర్తి శివారు చిన్నముసిడివాడ లో నివాసం ఉంటోంది. వీర్రాజుకు కుమారుడు జలరాజు ఉన్నాడు. అతడు సీమెన్‌గా పని చేస్తున్నాడు. కాగా తండ్రితో కలిసి ఉంటున్న జలరాజు ఇటీవల చిన్నముసిడివాడలో సొంతంగా ఇల్లు నిర్మాణం చేపట్టాడు.

ఈ నేపథ్యంలో అతని ముగ్గురు చెల్లెళ్లకు కొంత డబ్బు ఇవ్వాల్సిందిగా తండ్రి వీర్రాజు అతడికి సూచించాడు. ఇందుకు అంగీకరించిన జలరాజు.. తనకు కొంత గడువు ఇవ్వాలని తండ్రిని కోరాడు. ఈ విషయంపై గతకొంత కాలంగా తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. ఈ  క్రమంలో గురువారం జలరాజు ఇంటి ముందర పని చేస్తుండగా వెనకనుంచి వచ్చిన వీర్రాజు వచ్చి సుత్తితో కొడుకు తలపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో తీవ్రగాయాలపాలైన జలరాజును కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కాగా కన్నకొడుకునే తండ్రి హత్య చేయడం వెనుక గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెస్ట్‌ ఏసీపీ స్వరూప రాణి తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో నేరం స్పష్టంగా కనిపిస్తోందని. హత్యానేరం కింద వీర్రాజుపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement