ప్రచారానికి రెడీ | ready for campaign | Sakshi
Sakshi News home page

ప్రచారానికి రెడీ

Published Thu, Mar 27 2014 12:10 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ప్రచారానికి రెడీ - Sakshi

ప్రచారానికి రెడీ

సాక్షి, చెన్నై:
ఈలం తమిళుల సంక్షేమమే లక్ష్యంగా నామ్ తమిళర్ పేరిట సినీ నటుడు, దర్శకుడు సీమాన్ సంఘా న్ని ఏర్పాటుచేశారు. అనతి కాలంలో దాన్ని పార్టీగా మార్చారు. ఈ పార్టీ ఎన్నికలకు దూరం. ఈలం తమిళులకు చిన్న హాని జరిగినా, వారికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఈ పార్టీ కార్యకర్తలు ముందుంటారు.
 
ప్రధానంగా కాంగ్రెస్‌ను ఢీకొట్టడమే లక్ష్యంగా నామ్ తమిళర్ కట్చి ముందుకు సాగుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడ్డ చోటల్లా ఈ పార్టీ కార్యకర్తలు వారికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అలా అని పలాన వ్యక్తికి ఓటేయండని ఓట్లకు విజ్ఞప్తి చేయలేదు.
 
తమిళుల్ని సర్వనాశనం చేస్తున్న కాంగ్రెస్‌ను తరిమి కొట్టాలని వీరు సాగించిన ప్రచారం కొంతమేరకు ఫలితాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. అనేక మంది ప్రధాన నాయకులు ఆ ఎన్నికల్లో ఓటమిని చవి చూశారు. రెండంకెల నుంచి సింగిల్ డిజిట్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంఖ్య పడిపోయింది.
 
ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. డీఎంకే ఛీదరించుకోవడం, డీఎండీకే హ్యాండివ్వడంతో చివరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఓడించాలనే లక్ష్యంతో ఎన్నికల ప్రచారానికి సీమాన్ రెడీ అయ్యారు. ఈ పర్యాయం బీజేపీని సైతం ఆయన టార్గెట్ చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో అక్కడల్లా వారికి కూడా ఓటు వేయొద్దంటూ ప్రచారం చేయనున్నారు.
 
తమిళులకు కాంగ్రెస్ చేసిన ద్రోహం, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ చూపిన నిర్లక్ష్యం, ప్రదర్శించిన కపట నాటకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా నామ్ తమిళర్ కట్చి కార్యకర్తలు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. తమ ప్రచారం జరిగే నియోజకవర్గాల్లో నాటకాలు, లఘు చిత్రాలు, కరప్రతాల రూపంలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
 
 ఏడు నుంచి ప్రచారం
ఏప్రిల్ ఏడో తేదీ నుంచి ప్రచారం చేపట్టాలని సీమాన్ నిర్ణయించారు. ఈ విషయంగా ఆయన మీడియాతో బుధవారం మాట్లాడారు. ఈ నెల 29న చెన్నైలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. ఇందులో ఏఏ స్థానాల్లో ఏయే రూపాల్లో ప్రచారం నిర్వహించి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్ని ఓడించాలో నిర్ణయాలు తీసుకోనున్నామన్నారు.
 
తమిళ ప్రజలకు కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని తలచుకుంటే ఆక్రోశం రగులుతోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను భూ స్థాపితం చేయడమే లక్ష్యంగా తాము ముందుకెళుతున్నామన్నారు. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్రంలో పతనం అంచున చేరిందని, లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌కు నూకలు చెల్లినట్టేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ ద్రోహంలో బీజేపీకి కూడా భాగం ఉందన్నారు. కాషాయం పార్టీ బీజేపీ కాంగ్రెస్‌ను వెనకేసుకు రావడం వల్లే ఈలం తమిళులు సర్వనాశనం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
కాంగ్రెస్ చర్యల్ని అడ్డుకోవాల్సిన బీజేపీ నాయకులు వేడుక చూశారని, అందుకే రాష్ట్రంలో ఆ పార్టీ అభ్యర్థుల్ని ఓడించడమే లక్ష్యంగా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టనున్నామని వివరించారు. డీఎంకే, అన్నాడీఎంకేలు మేల్కొన్నాయని, అందుకే కాంగ్రెస్, బీజేపీల్ని ఛీదరించుకున్నట్టున్నాయని పేర్కొన్నారు.
 
బీజేపీతో కలకుంటే బాగుండేది
డీఎండీకే నేత విజయకాంత్ బీజేపీతో చేతులు కలవడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సీమాన్ వెల్లడించారు. ఈలం తమిళుల్ని సర్వనాశనం చేసిన వాళ్లతో దోస్తీ మానుకుని ఉంటే బాగుండేదని, వారితో కలిసిన దృష్ట్యా, ఆయనకు ఇక పతనం తప్పదన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన అన్ని విధాలుగా విఫలమయ్యారని విమర్శించారు. ఆయన్ను ప్రజలు ఇక ఆదరించబోరన్నారు.
 
పలాన వారికి ఓట్లు వేయమని తాము సూచించబోమని, కాంగ్రెస్, బీజేపీలకు మాత్రం ఓట్లు వేయొద్దని ఓటర్లను వేడుకుంటామన్నారు. ఆ రెండు పార్టీల అభ్యర్థులకు కాకుండా, మరెవ్వరికైనా ఓటు వేసే రీతిలో ఓటర్లలో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీమాన్ వ్యతిరేక ప్రచారం పలుచోట్ల ఉద్రిక్తతకు దారి తీసింది. అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు కేసుల రూపంలో సీమాన్ మెడకు చుట్టుకున్నారుు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ప్రచారం ఎలాంటి ఉద్రిక్తతలు రేపుతుందో.. అసలు ఆయన ప్రచారానికి పోలీసులు అనుమతి ఇస్తారా? అన్నది వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement