Search engine services
-
డక్‌డక్‌గో.. గూగుల్‌కు పోటీ ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాల్లో ఒకే కంపెనీ ఆధిపత్యం ఇక ఎక్కువ రోజులు కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. రోజువారీ జీవితంలో భాగమైన వాట్సాప్ వంటి యాప్‌లనే ప్రైవసీ పాలసీ అప్డేట్స్ కారణంగా పక్కనపెడుతున్న యూజర్లు.. ప్రైవసీకి పెద్దపీట వేసే ఇంటర్నెట్ సాధనాలు, సోషల్‌మీడియా యాప్‌ల వైపు దృష్టి సారించారు. వాట్సాప్‌ను కాదని సిగ్నల్ వైపు మళ్లినట్టే నెటిజన్లు సెర్చ్ ఇంజిన్‌కూ ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు. తమ డేటా ప్రొఫైల్‌ను వినియోగించి వ్యాపారం చేసే సెర్చ్ ఇంజిన్లను కాదని ప్రైవసీ అందించే సెర్చ్ ఇంజిన్ల వైపు మళ్లుతున్నారు. తాజాగా డక్‌డక్‌గో సెర్చ్ ఇంజిన్‌కు యూజర్లు పెరుగుతుండడం ఈ కొత్త ట్రెండ్‌ను సూచిస్తోంది. గూగుల్‌కు పోటీ ఉందా? ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో రోజుకు 350 కోట్ల సెర్చ్ క్వెరీస్ నమోదవుతున్నట్టు అంచనా. అంటే 350 కోట్ల ప్రశ్నలు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను రోజూ పలుకరిస్తున్నాయి. సెర్చ్ ఇంజిన్ల వాడకంలో 90 శాతం వాటా గూగుల్‌దే. మిగిలిన సెర్చ్ ఇంజిన్లు బింగ్ (2.78 శాతం వాటా), యాహూ (1.60 శాతం), బైదు (0.92 శాతం), యాండెక్స్ (0.85 శాతం), డక్‌డక్‌గో (0.50 శాతం) బరిలో ఉన్నాయి. అయితే ఇటీవలికాలంలో ప్రపంచవ్యాప్తంగా డేటా ప్రైవసీ మీద చర్చ జరుగుతుండడంతో యూజర్ల డేటా సేకరించే యాప్‌ల వాడకాన్ని వినియోగదారులు తగ్గిస్తున్నారు. ఇదే సమయంలో డక్‌డక్‌గో సెర్చ్ ఇంజిన్‌లో సెర్చ్ క్వెరీస్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా రోజుకు 10 కోట్ల సెర్చ్ క్వెరీస్ మైలురాయిని డక్‌డక్‌గో అందుకుంది. ఇందుకు కారణంగా డక్‌డక్‌గో ప్రైవసీకి పెద్దపీట వేస్తుంది. యూజర్ల ఐపీ అడ్రస్ వంటివి ఇది సేకరించదు. నిజానికి గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు వచ్చే క్వెరీస్తో పోల్చితే ఇది చాలా తక్కువ. కానీ క్రమంగా పెరుగుతున్న క్వెరీస్ సంఖ్యను బట్టి డక్‌డక్‌గోకు ఆదరణ పెరుగుతోందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డక్‌డక్‌గో ఎందుకు? ఇతర సెర్చ్ ఇంజిన్లకు తాము భిన్నమని, అవి తనకు వచ్చే సెర్చ్ క్వెరీల ఆధారంగా యూజర్‌ను ట్రాక్ చేస్తాయని, భారీ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని కలిగి ఉన్న సెర్చ్ ఇంజిన్లు.. అడ్వర్టయిజర్లను ఆకర్షించుకునేందుకు యూజర్ల డేటా వాడుకుంటున్నాయని, కానీ తాము వాటికి దూరంగా ఉంటామని డక్‌డక్‌గో చెబుతోంది. సెర్చ్ ఇంజిన్లలో ఇచ్చే క్వెరీ ఆధారంగా థర్డ్ పార్టీ సోషల్ మీడియా యాప్‌లలో యాడ్స్ ప్రత్యక్షమవుతాయని చెబుతోంది. కానీ యూజర్ల ప్రైవసీకి పెద్దపీట వేసేలా తాము బిజినెస్ మోడల్‌ను ఉపయోగిస్తున్నామని చెబుతోంది. సాధారణంగా మనం బ్రౌజ్ చేసే వెబ్సైట్లు మాత్రమే కాకుండా థర్డ్ పార్టీ ట్రాకర్లు మన బ్రౌజింగ్, లొకేషన్, సెర్చ్, కొనుగోళ్ల వివరాలు సేకరించి మన బిహేవియరల్ ప్రొఫైల్‌ను సిద్ధంచేసుకుంటాయి. తద్వారా మనకు వ్యాపార ప్రకటనలు సూచిస్తాయి. పెద్ద సెర్చ్ ఇంజిన్లు, సోషల్ మీడియా యాప్‌లు యూజర్లను ట్రాక్ చేస్తూ తమ యాడ్ నెట్వర్క్ కోసం డేటాను వినియోగిస్తున్నాయని చెబుతోంది. తమ సెర్చ్ ఇంజిన్‌లో ఉన్న ప్రైవసీ ఎసెన్షియల్స్‌ను వాడడం వల్ల థర్డ్ పార్టీ ట్రాకర్లు పనిచేయవని డక్‌డక్‌గో చెబుతోంది. తాము కేవలం యూజర్లు ఇచ్చే క్వెరీ ఆధారంగా యాడ్ చూపిస్తామని, కానీ యూజర్ బ్రౌజింగ్ ఆధారంగా బిహేవిరియల్ యాడ్స్ ఉండవని చెబుతోంది. అలాగే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్(ఐఎస్పీ) నుంచి నిఘా కూడా ఉండదని చెబుతోంది. ఐఎస్పీ నుంచి నిఘా ఉంటే.. మన బ్రౌజింగ్ డేటాను అది వినియోగించుకోవడం, అమ్ముకోవడం చేస్తుందని హెచ్చరిస్తోంది. తాము ఐపీ అడ్రస్‌ను కూడా సేకరించమని చెబుతోంది. ఫేస్బుక్ డేటా సేకరణపైనా చర్చ.. ఫేస్బుక్ గత ఏడాది తెచ్చిన కొత్త ఫీచర్ ఆధారంగా యూజర్లు ఫేస్‌బుక్‌పై కాకుండా ఇతరత్రా బ్రౌజింగ్ చేసినా ఆ యాక్టివిటీని సేకరిస్తోంది. ఫేస్బుక్ సెటింగ్స్‌లోకి వెళ్లి ‘ఆఫ్–ఫేస్బుక్ యాక్టివిటీ’ని క్లిక్ చేసి, మళ్లీ ‘మేనేజ్ యువర్ ఆఫ్–ఫేస్బుక్ యాక్టివిటీ’ని క్లిక్ చేసి, అందులో ఉండే ‘మేనేజ్ ఫ్యూచర్ యాక్టివిటీ’లో టర్న్ ఇట్ ఆఫ్ అని నొక్కితే యాక్టివిటీ డేటాను సేకరించడం ఆపుతుంది. దీని వల్ల మనకు యాడ్స్ అంతేసంఖ్యలో కనిపించినప్పటికీ.. అవి మన యాక్టివిటీని బట్టి ఉండవు. కానీ మన ఫేస్బుక్ ఖాతా, ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో యాక్టివిటీని బట్టి యాడ్స్ కనిపిస్తాయి. ఇటీవల వాట్సాప్ ప్రైవసీ అప్డేట్స్పై భారీఎత్తున చర్చ జరిగిన సందర్భంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ‘ఆఫ్–ఫేస్బుక్ యాక్టివిటీ’పై కూడా చర్చ జరుగుతోంది. యూజర్ల డేటాను యాప్‌లు తమ వాణిజ్య కార్యకలాపాల్లో వినియోగించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలోనే యూజర్లు ప్రైవసీకి పెద్దపీట వేసే సోషల్ మీడియా యాప్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. -
సరిలేరు ‘సుందర్’కెవ్వరు..!
హోదాల బదలాయింపుతో అల్ఫాబెట్ సంస్థాగత స్వరూపంలో గానీ రోజువారీ కార్యకలాపాల్లో గానీ పెద్ద మార్పులేమీ ఉండబోవు. ఎప్పట్లాగే ఇకపైనా గూగుల్‌ని మరింత వృద్ధిలోకి తెచ్చేందుకు కృషి చేస్తా. కంప్యూటింగ్ హద్దులు చెరిపేసేందుకు, అందరికీ మరింత ఉపయోగకరంగా ఉండేలా గూగుల్‌ను తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతాయి. పెను సవాళ్లను టెక్నాలజీతో పరిష్కరించే దిశగా అల్ఫాబెట్ దీర్ఘకాలిక వ్యూహాల అమలు కూడా కొనసాగుతుంది. – సుందర్ పిచాయ్ వాషింగ్టన్: టెక్నాలజీ ప్రపంచంలో మనోళ్ల హవా కొనసాగుతోంది. టెక్ దిగ్గజం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈఓ)గా ఉన్న సుందర్ పిచాయ్ (47)... తాజాగా దాని మాతృసంస్థ అల్ఫాబెట్‌కూ సీఈవోగా నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఈ బాధ్యతల్లో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్ వాటి నుంచి తప్పుకున్నారు. తాజా పరిణామంతో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరిగా సుందర్ పిచాయ్ నిలవనున్నారు. మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు తెలుగువాడైన సత్య నాదెళ్ల సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త మార్పులపై కంపెనీ ఉద్యోగులకు పేజ్, బ్రిన్ లేఖ రాశారు. అల్ఫాబెట్ ప్రస్తుతం గట్టిగా నిలదొక్కుకుందని, గూగుల్‌తో పాటు ఇతర అనుబంధ సంస్థలూ స్వతంత్రంగా రాణిస్తున్నాయని... మేనేజ్మెంట్ వ్యవస్థను సరళీకరించేందుకు ఇదే సరైన తరుణమని వారు పేర్కొన్నారు. ‘కంపెనీని మరింత మెరుగ్గా నడిపించగలిగే మార్గాలున్నప్పుడు.. మేము మేనేజ్మెంట్ హోదాలకు అతుక్కుని ఉండదల్చుకోలేదు. అల్ఫాబెట్, గూగుల్ సంస్థలకిక ఇద్దరు సీఈవోలు, ఒక ప్రెసిడెంట్ అవసరం లేదు. ఇకపై రెండింటికీ సుందరే సీఈవోగా ఉంటారు. గూగుల్‌కు సారథ్యం వహించడంతో పాటు ఇతర అనుబంధ సంస్థల్లో అల్ఫాబెట్ పెట్టుబడులన్నింటినీ ఆయనే చూస్తారు‘ అని పేజ్, బ్రిన్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ బోర్డు సభ్యులుగా, షేర్‌హోల్డర్లుగా, సహ–వ్యవస్థాపకులుగా గూగుల్, అల్ఫాబెట్ వృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ‘దాదాపు 15 సంవత్సరాలుగా.. అల్ఫాబెట్ ఏర్పాటులోనూ, గూగుల్ సీఈవోగా, అల్ఫాబెట్ డైరెక్టరుగా సుందర్ పిచాయ్ మాతో కలిసి నడిచారు. అల్ఫాబెట్ భవిష్యత్తుపైన, సవాళ్లను టెక్నాలజీ సాయంతో అధిగమించేలా చేయగలిగే సంస్థ సామర్థ్యంపైనా మాకున్నంత నమ్మకం ఆయనకూ ఉంది‘ అని పేజ్, బ్రిన్ తెలిపారు. సెర్చికి పర్యాయపదంగా గూగుల్... ఒకప్పటి దిగ్గజం యాహూను పక్కకు నెట్టేసి.. ఇంటర్నెట్లో సెర్చికి పర్యాయపదంగా మారిన గూగుల్‌ను సెర్గీ బ్రిన్, ల్యారీ పేజ్ 1998లో ఆరంభించారు. పేజ్ తొలి సీఈవో కాగా... తర్వాత 2001 నుంచి 2011 దాకా ఎరిక్ ష్మిట్ ఆ హోదాలో కొనసాగారు. తర్వాత పేజ్ మళ్లీ కొన్నాళ్ల పాటు సీఈవోగా వచ్చారు. 2015లో హోల్డింగ్ కంపెనీగా అల్ఫాబెట్‌ను ఏర్పాటు చేసినప్పట్నుంచీ బ్రిన్, పేజ్.. గూగుల్‌లో కీలక పాత్ర పోషించడాన్ని తగ్గించుకున్నారు. సింపుల్.. సుందర్ ఐఐటీలో చదివేటప్పుడు తనకు ఒక దశలో సీ గ్రేడ్ రావడం.. మళ్లీ మెరుగుపడటానికి తాను కిందా మీదా పడటం లాంటి ఆసక్తికరమైన విషయాలను కొన్నాళ్ల కిందట ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యార్థులతో సమావేశమైన సందర్భంగా పిచాయ్ చెప్పారు. చిన్నప్పటి సాదా సీదా జీవితాన్ని ఒక పత్రిక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఇప్పటితో పోలిస్తే అప్పట్లో మా జీవితం సింపుల్‌గా, హాయిగా ఉండేది. ఒక మోస్తరు అద్దింట్లో ఉంటూ లివింగ్ రూమ్‌లో హాయిగా కింద పడుకునేవాళ్లం. ఒకసారి తీవ్ర కరువొచ్చింది. అదెంత భయపెట్టిందంటే.. ఇప్పటికీ నేను పడుకునేటప్పుడు మంచం పక్కన మంచినీటి బాటిల్ పెట్టుకుంటాను. మేం ఫ్రిజ్ కొనుక్కోవడం అప్పట్లో మాకో గొప్ప విశేషం‘ అని ఆయన చెప్పుకొచ్చారు. గూగుల్‌లో టీమ్‌ను ముందుండి నడిపించగలిగే సత్తాతో టాప్ మేనేజ్మెంట్ దృష్టిలో పడ్డారు. మృదు భాషిగా, ఎవర్నీ నొప్పించకుండా సమస్యలను పరిష్కరించగలిగే వ్యక్తిగా సుందర్ గురించి ఆయన సన్ని హితులు చెబుతారు. విభిన్న ఉత్పత్తులపై, టెక్నాలజీపై పరిజ్ఞానంతో పాటు ఈ సామర్థ్యాలే ఆయన్ను గూగుల్‌లో కీలక వ్యక్తిగా నిలిపాయి. మదురై టు సిలికాన్ వ్యాలీ... సుందర్ పిచాయ్ తమిళనాడులోని మదురైలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీరు కాగా తల్లి స్టెనోగ్రాఫర్. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేస్తూ అక్కడే తన జీవిత భాగస్వామి అంజలిని కలిశారు. తరవాత అమెరికాలోని స్టాన్ఫోర్డ్ వర్సిటీలో ఎంఎస్ చేశారు. ఎంబీఏ అనంతరం 2004లో గూగుల్‌లో చేరారు. కీలకమైన క్రోమ్ బ్రౌజర్ ప్రాజెక్టును విజయవంతం చేశాక కంపెనీలో ఆయన వేగంగా ఎదిగారు. 2013లో ముఖ్యమైన ఆండ్రాయిడ్ డివిజన్ ఇన్చార్జిగా... తర్వాత రెండేళ్లకే 2015లో గూగుల్ సీఈవో అయ్యారు. దాంతోనే పలు అల్ఫాబెట్ ప్రాజెక్టులూ ఆయన పరిధిలోకి వచ్చాయి. ఇటీవల ఉద్యోగుల నిరసనల్లాంటి వాటితో పాటు పలు వివాదాలను సమర్థంగా ఎదుర్కొన్న తీరు.. అల్ఫాబెట్ సీఈవో పీఠానికి ఆయన్ను మరింత దగ్గర చేశాయి. భార్య అంజలితో సుందర్ పిచాయ్ -
మిస్డ్ కాల్‌తో సమాచారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు. సమాచారం క్షణాల్లో అందించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఎస్ఎస్ ఫ్రీ టు డయల్ కమ్యూనికేషన్స్ ‘ఫ్రీ టు డయల్’ పేరుతో సేవలను ప్రారంభించింది. రెస్టారెంట్లు, ఫుడ్, దుస్తులు, క్లినిక్స్, విద్య.. ఇలా సమాచారం ఏదైనా 040-66444466 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ప్రతిగా కంపెనీ ప్రతినిధి కాల్ చేసి కస్టమర్‌కు కావాల్సిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా అందిస్తారు. అటు వెండార్‌కు కూడా ఈ సమాచారం వెళ్తుంది. ప్రస్తుతం 2 వేలకుపైగా వెండార్లతో చేతులు కలిపినట్టు కంపెనీ డెరైక్టర్ సునీల్‌కుమార్ సింగ్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. వైజాగ్, విజయవాడ, బెంగళూరు నగరాలకూ విస్తరించాలన్నది ప్రణాళిక. ఇప్పటి వరకు కంపెనీ రూ.3 కోట్లు వెచ్చించింది. ఫ్రీటుడయల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ సర్చ్ ఇంజన్ సేవలను అందిస్తోంది.