seashore
-
మొక్కలు నాటి ఉప్పును పండించవచ్చు
సాక్షి, అమరావతి: సాలికోర్నియా.. సముద్ర తీరం వెంబడి ఉప్పునీటి ప్రాంతాల్లో విస్తారంగా పెరిగే ఈ మొక్కలను సంప్రదాయ ఉప్పునకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నారు. ఈ మొక్కల నుంచి ఉత్పత్తి చేసే ఇంధనాన్ని విమానాల్లో సైతం ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. సముద్రతీర ప్రాంతాల్లో ఉప్పును తట్టుకుని పుషి్పంచే మొక్కల జాతికి చెందిన సాలికోర్నియా మొక్కల్లో 50 శాతం వరకు సోడియం క్లోరైడ్ నిండి ఉంటుంది. ఇందులోని లవణీయత సంప్రదాయ సముద్ర ఉప్పు రుచిని కలిగి ఉంటుంది. వీటి నుంచి తీసే ఉప్పును హెర్బల్ సాల్ట్, గ్రీన్ సాల్ట్‌గా పిలుస్తున్నారు. ప్రొటీన్లు.. విటమిన్లూ ఉన్నాయ్ సాలికోర్నియా మొక్కల్లో 11 శాతం ప్రొటీన్లు, 20 శాతం ఫైబర్, జింక్, పొటాషియం, ఏ, బీ–1, బీ–12, బీ–15, సీ, ఈ విటమిన్లు అపారంగా ఉన్నాయని పరిశోధనల్లో గుర్తించారు. రక్తపోటు, మధుమేహం, గ్యాస్ట్రిక్ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఈ గ్రీన్ సాల్ట్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు చాలా దేశాల్లో ఈ మొక్క నుంచి ఉత్పత్తి చేసే ఉప్పును అన్ని వంటకాల్లో వాడుతున్నారు. సీఎస్ఎంసీఆర్ఐ సాంకేతిక సహకారం గుజరాత్ భావనగర్‌లోని సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఐ) సాలికోర్నియా మొక్కల నుంచి ఉప్పు తయారు చేసే టెక్నాలజీని కనుగొంది. ప్రత్యామ్నాయ ఉప్పు తయారీకి సంబంధించిన అన్ని శాస్త్రీయ, సాంకేతిక సహాయాలను అందిస్తోంది. సాలికోర్నియా మొక్కల సాగు, కోత, మొక్కల్ని ఎండబెట్టడం, ఇతర ప్రక్రియల ద్వారా ఎకరాకు టన్ను ఉప్పు వస్తుందని సీఎస్ఎంసీఆర్ఐ చెబుతోంది. రూ.15 వేల పెట్టుబడితో రూ.25 వేలకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేసింది. ఈ మొక్కల నుంచి ఉత్పత్తి చేసే ఇంధనాన్ని సౌదీ దేశాలలో కొన్ని విమానయాన సంస్థలు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నాయట. ఏపీలోనూ సాగుకు అవకాశాలు రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సువిశాల సముద్రతీర ప్రాంతం ఉంది. కాకినాడ, మచిలీపట్నం ప్రాంతాల్లో పెద్దఎత్తున విస్తీర్ణంలో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. తీరం వెంబడి రిజర్వ్ మడ అడవుల్లో సాలికోర్నియా మొక్కలు విస్తారంగా ఉన్నట్టుగా గుర్తించారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా తీర ప్రాంతంలో ఈ మొక్కల జాడను సీఎస్ఎంసీఆర్ఐ గుర్తించింది. ఉప్పునీటి చెరువుల్లో చేపలు, రొయ్యలు సాగు చేసే రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధిగా సాలికోర్నియా మొక్కల సాగు నిలుస్తుందని చెబుతున్నారు. కొన్ని దేశాల్లో ఇండోర్‌లో కూడా సాగు చేస్తున్నారు. భవిష్యత్‌లో మంచి ఆదాయ వనరుగా ఉపయోగపడే ఈ మొక్కల సాగుపై రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
రంగు మారిన విశాఖ సాగర తీరం.. ఎందుకిలా?
విశాఖ సాగరతీరం అంటే బంగారు వర్ణంతో కనిపించే ఇసుక తిన్నెలు.. సముద్రపు నీటితో శుద్ధి చేశారా? అన్నంతగా స్వచ్ఛతను తలపించే ఒంపులు తిరిగిన చిన్న చిన్న ఇసుక దిబ్బలు.. వాటిని ఎంత సేపు చూసినా, వాటిపై మరెంత సేపు సేద తీరినా తనివి తీరని అనుభూతిని పొందుతారు పర్యాటక ప్రియులు. అలాంటి విశాఖ బీచ్ ఇటీవల తన సహజ సౌందర్యానికి భిన్నంగా కనిపిస్తోంది. సుందర సాగరతీరం ఒంటికి మసి పూసుకున్నట్టు అగుపిస్తోంది. ఔరా! ఇది మన విశాఖ బీచేనా? అనిపించేలా రూపు మారిపోయింది. – సాక్షి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం: కోస్టల్ బ్యాటరీ నుంచి వుడా పార్క్ వరకు బీచ్ ఎక్కడ చూసినా నల్లని ఇసుకను పరుచుకున్నట్టు దర్శనమిస్తోంది. ఇది సాగరతీరానికి వచ్చే సందర్శకులు, పర్యాటక ప్రేమికులకు తీవ్ర నిరాశను మిగిలిస్తోంది. విశాఖ బీచ్‌ను చూడడానికి ఎక్కడెక్కడ నుంచో నిత్యం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇసుక తిన్నెలపై కూర్చుని తీరం వైపు నురుగలు కక్కుతూ వచ్చే కెరటాలను చూస్తూ మైమరచి పోతుంటారు. కొద్ది రోజుల నుంచి ఆ పరిస్థితి లేదు. ఇసుకంతా మురుగు పులుముకున్నట్టు ఉండడంతో బీచ్‌లో కూర్చుని అలలను ఆస్వాదించడానికి వీలు పడడం లేదు. దీంతో బీచ్‌కు వచ్చే సందర్శకుల్లో పలువురు మునుపటిలా కూర్చోకుండా నిలబడే ఉంటున్నారు. బీచ్ రోడ్డుకు అనుకుని ఉన్న గోడపై కొందరు, తీరంలో కొబ్బరిచెట్ల మధ్య ఏర్పాటు చేసిన సిమెంటు బల్లలపై మరికొందరు సేద తీరుతున్నారు. అలా అలలకు అల్లంత దూరం నుంచే బీచ్ అందాలను అరకొరగా ఆస్వాదిస్తున్నారు. దీంతో నిత్యం సందర్శకుల రద్దీతో కళకళలాడుతూ కనిపించే సాగరతీరం కళా విహీనంగా కనిపిస్తోంది. ఎందుకిలా? కొద్ది రోజుల క్రితం నుంచి సాగరతీరం కోతకు గురవుతోంది. ఈ పరిణామమే సందర్శకులకు ఇబ్బందికరంగా ఉంది. అది చాలదన్నట్టు ఇప్పుడు ఇసుక నలుపు రంగును పులుముకుంటోం ది. ఈ పరిస్థితికి సముద్రంలోకి నగరం నుంచి మురుగు నీరు వదిలిపెట్టడం, పోర్టులో బొగ్గు లోడింగ్, అన్‌లోడింగ్‌తో పాటు ఇనుప రజను వంటివి కారణమని సముద్ర అధ్యయన నిపుణులు చెబుతున్నారు. సంవత్సరంలో ఏడెనిమిది నెలలు నగరంపైకి నైరుతి గాలులే వీస్తాయి. విశాఖ నగరానికి నైరుతి దిశలోనే అనేక పరిశ్రమలున్నాయి. వాటి నుంచి విడుదలయ్యే కాలుష్య వ్యర్థాలు కూడా సముద్రంలోనే కలుస్తున్నాయి. ఇవన్నీ సముద్రం అడుగున ఉంటాయి. అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్లు ఏర్పడినప్పుడు కడలి కల్లోలంగా మారుతుంది. దీంతో దిగువన ఉన్న ఈ వ్యర్థాలు పైకి, కిందకు కలుషితమవుతాయి. కెరటాల ఉధృతితో అవి ఇసుకతో సహా తీరానికి కొట్టుకు వస్తాయి. ఫలితంగా అప్పటివరకు తీరంలో గోధుమ, బంగారు వర్ణంలో ఉన్న ఇసుక నల్లగా మసి పూసినట్టుగా మారిపోతుందని ఆంధ్ర విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం ప్రొఫెసర్ ఈడ్పుగంటి ధనుంజయరావు ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం బీచ్‌లో ఇసుక నలుపు రంగులోకి మారిపోవడానికి ఇదే కారణమని తెలిపారు. కొద్దిరోజుల్లో మళ్లీ ఈ నల్లని ఇసుక కెరటాల ఉధృతికి వెనక్కి సముద్రంలోకి వెళ్లిపోతుందని, అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని వివరించారు. -
అంతర్వేది సాగర తీరం.. విభిన్న స్వరూపం!
సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది సాగర తీరం భిన్నమైన మార్పులను సంతరించుకుంటున్నది. గురువారం బీచ్‌లో సుమారు 200 మీటర్ల మేర ముందుకొచ్చిన సముద్రం, అన్నాచెల్లెలు గట్టు వద్ద లైట్‌హౌస్ నుంచి సమారు కిలోమీటరు మేర లోపలికి వెళ్లింది. బీచ్‌లో అలల తీవ్రతతో సంద్రం ఉగ్రరూపంతోనూ, గోదావరి, సముద్రం కలిసే అన్నాచెల్లెలు గట్టు వద్ద సంద్రం తక్కువ అలల తీవ్రతతో ప్రశాంతంగా ఉంది. అన్నాచెల్లెలు గట్టు ప్రాంతంలో సముద్రం ఎంత ముందుకు వస్తుందో అంత వెనక్కి వెళ్లిపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కనుచూపు మేర ఇక్కడ తీరం ఖాళీగా ఆటస్థలంగా కనిపిస్తున్నది. అమావాస్య, పౌర్ణమి ప్రభావాలతో ఆటు పోటులకు బీచ్ వద్ద ఒకలా, అన్నాచెల్లెలు గట్టు వద్ద మరొకలా ఎగసి పడుతున్న కెరటాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన భూకంపం వల్ల సముద్ర గర్భంలో వచ్చిన అలజడి ప్రభావమే ఇందుకు కారణమై ఉంటుందని అధికారులు విశ్లేషిస్తున్నారు. బీచ్‌లో పరిస్థితులను తహసీల్దారు వై.రామకుమారి, మెరైన్ సీఐ బొక్కా పెద్దిరాజు, ఎస్ఐలు రవివర్మ, సోమశేఖర్‌రెడ్డి, సిబ్బంది బీచ్‌లో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అన్నాచెల్లెలు గట్టు వద్ద లైట్‌హౌస్ నుంచి కిలోమీటరు లోపలికి వెళ్లిన సముద్రం ప్రమాదం ఏమీలేదు అంతర్వేది వద్ద సముద్రం రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లడం వల్ల ప్రమాదం ఏమీ ఉండదు. ముంబై, గుజరాత్, గోవా వంటి ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. అంతర్వేది విషయానికి వచ్చేసరికి సముద్రపు భూభాగం సమాంతరంగా (ఫ్లాట్‌గా) ఉండడమే కారణం. సగటున కేవలం 4 అడుగుల ఎత్తులో భూభాగం ఉండడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. – మురళీకృష్ణ, ప్రొఫెసర్, ఎన్విరాన్మెంటల్, డైరెక్టర్, జేఎన్టీయూ కాకినాడ -
ఆ తాబేళ్లు చనిపోవడానికి కారణం అదే
మెక్సికో :వాతావరణంలో చోటు చేసుకున్న మార్పు కారణంగా దాదాపు 300 అరుదైన ఆకుపచ్చ తాబేళ్లు చనిపోయిన ఘటన గురువారం మెక్సికో నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాబేళ్లు కొన్నివేళ సంవత్సరాలు బతుకుతాయన్న సంగతి మనందరికి తెలిసిన విషయమే. అయితే ప్రపంచంలోనే అరుదైన జాతుల్లో ఆకుపచ్చ తాబేళ్లు ఒకటి.1.5 మీటర్ల పొడవు పెరిగే అరుదైన ఆకుపచ్చ తాబేళ్లు సాధారణంగా మెక్సికో, ఆస్ట్రేలియా లాంటి దేశాలలో కనిపిస్తుంటాయి. ఇవి ఎక్కువగా సముద్ర అడుగుభాగంలోనే ఉంటూ జీవిస్తుంటాయి. కాగా గత కొన్ని రోజులుగా మెక్సికోలోని ఒక్సాకా సముద్రం తీరంలో వాతావరణ మార్పులు చోటుచేసుకోవడంతో రెడ్ టైడల్ మైక్రోఆల్గే విపరీతంగా పెరిగిపోయింది. రెడ్ టైడల్ ఆల్గే సముద్రంలో ఉండే సాల్ప్ అనే చిన్న చిన్న చేపలను తినేస్తుంటుంది. ఇది తాబేళ్లకు చాలా విషపూరితం, గత కొన్ని రోజులుగా మైక్రో ఆల్గేను తింటున్న ఆకుపచ్చ తాబేళ్లు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతున్నాయి. అయితే అరుదుగా కనిపించే ఆకుపచ్చ తాబేళ్లు ఇలా చనిపోవడంపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ' ఇప్పటివరకు మైక్రోఆల్గే బారీన పడి 297 తాబేళ్లు చనిపోయాయి. అయితే 27 తాబేళ్లను మాత్రం మైక్రోఆల్గే నుంచి కాపాడి తాబేళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించాము. వాతావరణ పరిస్థితులు మెరుగుపడేవరకు అక్కడే పెంచుతామని ' పర్యావరణ అధికారులు వెల్లడించారు. -
ప్రకృతి అందాల తీరం సూర్యలంక
ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ గోయిల్ బాపట్ల: సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు సూర్యలంక కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుందని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ గోయిల్ అన్నారు. శనివారం రాత్రి ఢిల్లీ ఎమ్మెల్యేలతో కలిసి సూర్యలంక తీరానికి చేరుకున్న స్పీకర్ ఆదివారం ఉదయం తీరంలో పర్యటించారు. స్పీకర్‌ను హరితా రిసార్ట్స్‌లో బాపట్ల ఎంపీపీ మానం విజేత మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువాలతో సత్కరించారు. తీరంలో పర్యటించిన వారిలో ఢిల్లీ ఎమ్మెల్యేలు అల్కాలంబ, పరిమళచూసెస్, భావనగౌరే, టీడీపీ రాష్ట్ర నాయకుడు మానం బ్రహ్మయ్య ఉన్నారు. -
తీరానికి కూర్మ కళేబరం
మొగల్తూరు: నిన్న డాల్ఫిన్, నేడు తాబేలు ఇలా రోజుకో మృత జలచరం తీరానికి కొట్టుకువస్తోంది. కొద్దిరోజుల క్రితం చెన్నై సమీపంలోని సముద్ర తీరంలో రెండు నౌకలు ఢీకొనడంతో ఆయిల్ తెట్టు సముద్ర నీటిలో తెలియాడుతోంది. దీని ప్రభావం జలచరాలపై పడింది. కొన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో కలిసిన తెట్టును తొలగించినా సముద్ర జలచరాలకు పెను ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం నరసాపురం మండలం పీఎం లంక తీరానికి మృత డాల్ఫిన్ కొట్టుకురాగా, బుధవారం మొగల్తూరు మండలం కేపీ పాలెం తీరానికి మృత తాబేలు కొట్టుకువచ్చింది. -
తీరం కబ్జా
ఉలవపాడు: సాగర తీరం కబ్జా కోరల్లో చిక్కుకుపోయింది. బడాబాబుల చేతుల్లో పడి రొయ్యల చెరువులుగా మారిపోయింది. పొరుగు జిల్లా నుంచి వచ్చి మరీ ఇక్కడి తీరంలో వ్యాపారం సాగిస్తున్నా రెవెన్యూ అధికారులు కిమ్మనడం లేదు. మండల పరిధిలోని కరేడు కొత్త పల్లెపాలెం తీరప్రాంతంలో బకింగ్ హామ్ కెనాల్‌కు, సముద్రానికి మధ్యలోని సుమారు 125 ఎకరాలు ఆక్రమించి రొయ్యల చెరువులు వేసి వ్యాపారం చేస్తున్నారు. సముద్రం ఆనుకుని ఈ చెరువులు ఏర్పాటు చేయడం గమనార్హం. ఆక్రమణ జరిగిందిలా... కరేడు కొత్త పల్లెపాలెం గ్రామస్తులను రొయ్యల వ్యాపారులు మంచి చేసుకున్నారు. తాము ఆ భూమిలో రొయ్యల చెరువులు నిర్మిస్తామని, దానికి ప్రతిఫలంగా ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున గ్రామానికి ఇస్తామని ఆశచూపారు. ప్రభుత్వ పొలాల వలన తమకు ఆదాయం వస్తుందని గ్రామస్తులు సంతోషించారు. నగదు చెల్లించి గ్రామస్తుల నుంచి వ్యతిరేకత రాకుండా చేసుకున్న వ్యాపారులు దాదాపు 5 నెలల నుంచి రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోగా అక్రమార్కులకు అండగా నిలవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. అధికారుల అండతోనే... అధికారుల అండతోనే ఇక్కడ రొయ్యల చెరువులు వేయగలిగారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముందుగా వచ్చిన తహశీల్దార్‌తో మాట్లాడి తమ వ్యాపారానికి అడ్డు లేకుండా చేసుకున్నారు. గ్రామస్తుల సహకారం కూడా ఉండడంతో ఒక పంటను అమ్మారు. వెనామీ రొయ్యలను పెంచి కేజీ 300 రూపాయల చొప్పున అమ్మి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక్కడి వ్యాపారులంతా పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వారు. 80 కి.మీ ల దూరం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారంటే ఎంత మేరకు లాభాలు వస్తున్నాయో ఇట్టే అర్థమవుతుంది. జనరేటర్లతోనే నిర్వహణ... ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఏర్పాటు చేసిన రొయ్యల చెరువులకు విద్యుత్ శాఖాధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. పట్టా భూములకు మాత్రమే ఇస్తామని తేల్చి చెప్పారు. దీని కోసం చాలా పాట్లు పడ్డారు కానీ ఉపయోగం లేకుండా పోయింది. తహశీల్దార్ ధ్రువీకరణ పత్రం అందిస్తేనే విద్యుత్ కనెక్షన్ ఇస్తామని చెప్పడంతో ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ చెరువుల నిర్వహణ మాత్రం ఆగలేదు. జనరేటర్లతో బోర్లను ఏర్పాటు చేసి రొయ్యల చెరువులు నిర్వహిస్తున్నారు. కొంత నీరు సముద్రం నుంచి కూడా పంపింగ్ చేసి చెరువులకు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో బకింగ్‌హామ్ కెనాల్, సముద్రం మధ్య భాగాన్ని ఎంతో విలువైనదిగా చూసేవారు. బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా భారీ ఓడలు కూడా వెళ్లేవి. ప్రభుత్వం మళ్లీ ఈ కెనాల్ అభివృద్ధి చేయాలని చూస్తున్న తరుణంలోనూ ఆక్రమణలను అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. ఈ విషయమై తహశీల్దార్ శ్రీశిల్పను సాక్షి వివరణ కోరగా ‘వంద ఎకరాలకుపైగా ఆక్రమణకు గురైందా..అవునా..నేను సోమవారం ఉదయం వచ్చి మాట్లాడతాను’ అని చెప్పారు.