భారతీయ వైద్యుడికి అమెరికాలో అరుదైన గౌరవం
అమెరికాలో అత్యంత ప్రాచుర్యం పొందిన వైద్యులలో రెండోస్థానాన్ని పొంది.. భారత సంతతికి చెందిన న్యూరోసర్జన్ సంజయ్ గుప్తా అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఆయనకు ట్విట్టర్లో 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నట్లు ట్విట్టర్ తెలిపింది. దేశవ్యాప్తంగా ట్విట్టర్ వాడుతున్న వైద్యుల వివరాలను పరిశీలించిన తర్వాత ఈ విషయం చెప్పింది. అట్లాంటాలోని ఎమోరీ క్లినిక్‌లో న్యూరోసర్జన్‌గా పనిచేస్తున్న గుప్తాకు ఇంతకుముందు ఎమ్మీ అవార్డు పలుమార్లు వచ్చింది. ఆయనకంటే ఎక్కువగా 31.8 లక్షల మంది ఫాలోవర్లతో డ్రూ పిన్స్కీ మొదటి స్థానంలో ఉన్నారు.
ఈ వివరాలు తేల్చడానికి అగస్టానా యూనివర్సిటీ విద్యార్థులు 2006 నుంచి అమెరికా వ్యాప్తంగా వైద్యులు ఉపయోగిస్తున్న ట్విట్టర్ అకౌంట్లను విశ్లేషించారు. ఇందుకోసం మొత్తం 4,500 మంది యూజర్లను పరిగణనలోకి తీసుకున్నారు. వైద్యులు ఇతరులతో ట్విట్టర్ ద్వారా ఎలా ఎంగేజ్ అవుతున్నారో చూశామని పరిశోధనలో పాల్గొన్న పేజ్ ష్విట్టర్స్ తెలిపారు. ఎక్కువ పాపులర్ అకౌంట్లు సెలబ్రిటీలు, పబ్లిక్ ఫిగర్లు, టీవీ పర్సనాలిటీలకు చెందినవని చెప్పారు. గుప్తా ఇచ్చే వైద్య శిక్షణ, ప్రజారోగ్య విధానంలో ఆయన అనుభవం, యుద్ధప్రాంతాలు, ప్రకృతి విపత్తుల సమయంలో ఆయన రిపోర్టింగ్ అన్నింటి ద్వారా ఆయన ప్రముఖుడిగా గుర్తింపు పొందినట్లు తెలిపారు. ఇబోలా వ్యాప్తి, తలకు తగిలే గాయాలు, విపత్తుల నుంచి రక్షణ, ఆరోగ్యరంగ సంస్కరణలు, సైన్యానికి ప్రత్యేక చికిత్సలు, ఫిట్నెస్, హెచ్ఐవీ/ఎయిడ్స్ గురించి అవగాహన లాంటి విషయాల్లో కూడా సంజయ్ గుప్తా సలహాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయట. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా అన్నిరకాలుగా సలహాలు, సూచనలు ఇస్తున్నారని అన్నారు.