దోశిళ్లపల్లిలో టెన్షన్ టెన్షన్
చర్ల : మండలంలోని దోశిళ్లపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ కాల్పుల్లో ఓ గిరిజన యువకుడు మృతి చెందిన ఘటనపై పోలీసులు సోమవారం రహస్య విచారణ నిర్వహించారు. విషయం తెలిసి ఆ ప్రాంతానికి వచ్చిన స్థానికులు, మీడియాను ఘటన స్థలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. రహస్య విచారణపై గిరిజనులు, విలేకరులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. బహిరంగ విచారణ చేయాల్సిందేనని ఆదివాసీలు, విచారణను చిత్రీకరించేందుకు అనుమతి ఇవ్వాలని మీడియా ప్రతినిధులు డిమాండ్ చేశారు. పోలీసులు ఎంతకూ ఒప్పుకోలేదు. ముందుకెళ్లేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు.
వారి చేతుల్లో ఉన్న కెమెరాలను లాక్కునేందుకు యత్నించారు. విలేకరులను బలవంతంగా నెట్టివేశారు. కొత్తగూడెం నుంచి విధి నిర్వహణకు వచ్చిన ఆర్ఎస్సై విలేకరులను ఉద్దేశించి ‘మీరే కాల్పులు జరిపి ఇప్పుడు ఫొటోలు తీసేందుకు వచ్చారా?.. వీళ్ల కెమెరాలు లాక్కోండి..’ అంటూ మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ సీపీఎం, గిరిజన సంక్షేమ పరిషత్‌ల ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళనకు పూనుకున్నారు. గంటన్నరపాటు ఆందోళన నిర్వహించారు.
భారీగా తరలివచ్చిన జనం
పోలీస్ కాల్పుల్లో మరణించిన కారం నర్సింహారావు మృతదేహాన్ని సందర్శించి, ఆయన కుటుంబసభ్యులను పరామర్శిం చేందుకు దేవానగరం, దోశిళ్లపల్లి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. వారంతా ఆందోళనకు పూనుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది ఉధృతం అవుతుందని భావించిన పోలీసు ఉన్నతాధికారులు వెంకటాపురం, దుమ్ముగూడెం పోలీస్స్టేషన్ల నుంచి అదనపు బలగాలను రప్పించారు. ఇటు గిరిజనుల ఆందోళన..అటు భారీగా మోహరించిన పోలీస్ బలగాలు..ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
దోశిళ్లపల్లి కాల్పుల ఘటనపై బహిరంగ విచారణ జరపాలని, మీడియా ప్రతినిధుల సమక్షంలో విచారణ కొనసాగాాలని, కాల్పులకు బాధ్యలైన పోలీసులను విధుల నుంచి తప్పించాలని, మృతుని కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, 5 ఎకరాల సాగు భూమితో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, కాల్పుల ఘటనపై సాక్షాధారాలను తారుమారు చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని, పోలీసుల అదుపులో ఉన్న మరో వ్యక్తిని తక్షణమే అప్పగించాలని, ఏజెన్సీలో పోలీసుల దూకుడుకు కళ్లెం వేయాలని, పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాదాపు గంటన్నరపాటు ఈ ఆందోళన కొనసాగడంతో భద్రాచలం ఏఎస్పీ ప్రకాశ్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు.
ఆందోళనకారులతో మాట్లాడారు. ‘కాల్పులకు పాల్పడిన పోలీసులను బదిలీ చేస్తాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థికసాయం, ఐదు ఎకరాల సాగుభూమి, కుటుంబంలో ఒకరికి నెలకు రూ.12 వేల రూపాయలకు పైబడిన ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం’ అని హామీ ఇచ్చారు. తాము నిత్యం వ్యవసాయ పనులు, వివిధ అవసరాల నిమిత్తం అర్థరాత్రి అపరాత్రి తిరుగుతుంటాం. మళ్లీ తమపై కాల్పులు జరుపుతారా? అని గిరిజనులు ప్రశ్నించారు. మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, గిరిజనులతో సక్యతతో మెలిగే వారినే ఇక్కడ విధుల్లో నియమిస్తామని, అవసరమైతే వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని డీఎస్పీ తెలపడంతో గిరిజనులు శాంతించారు.
ఈ ఆందోళనలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏజె రమేష్, జిల్లా కమిటీ సభ్యులు ఎలమంచిలి రవికుమార్, కొలగాని బ్రహ్మచారి, డివిజన్ కార్యదర్శివర్గ సభ్యులు గడ్డం స్వామి, మండల కార్యదర్శి లంకా వెంకట్, డివిజన్ కమిటీ సభ్యులు సోయం రాజారావు, గిరిజన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అద్యక్షులు పాయం సత్యనారాయణ, నాయకులు ఇర్పా ప్రకాశ్, ఎంపీపీ కోదండరామయ్య, ఎంపీటీసీ మచ్చా నర్సింహారవు, మొగళ్లపల్లి సర్పంచ్ పసల రాజేశ్వరి పాల్గొన్నారు.
మృతదేహం కోసం ఎదురుచూపులు
మండలంలోని దోశిళ్లపల్లిలో శనివారం రాత్రి పోలీసుల జరిపిన కాల్పుల్లో మృతి చెందిన కారం నర్సింహారావు మృతదేహం కోసం బందువులు, కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఆదివారం రాత్రే నర్సింహారావు మృతి చెందినప్పటికీ సోమవారం రాత్రి వరకు మృతదేహాన్ని స్వగ్రామం తరలించకపోవడంతో కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మృతి వార్త తెలుసుకున్న సమీప బంధువులు సోమవారం ఉదయం నుంచే దోశిళ్లపల్లికి పెద్ద ఎత్తున తరలివచ్చారు నర్సింహారావును కాల్చి చంపిన పోలీసులు కనీసం మృతదేహాన్ని కూడా సరైన సమయానికి ఇవ్వరా...? అంటూ ప్రశ్నించారు. సోమవారం రాత్రి వరకు మృతదేహాన్ని అప్పగించపోవడంపై మృతుని తరఫువారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.