section 124
-
124–ఏ సెక్షన్‌ను ఎందుకు రద్దు చేయాలి?
‘‘ఇండియా తేరే తుకడే తుకడే కరేంగే’’ అని ఊరేగింపులలో బహిరంగంగా అరవడం దేశద్రోహం కాకపోతే, మరేమిటి? భారత పార్లమెంటుపై హంతక దాడికి పాల్పడిన ఉగ్ర వాదులనూ, వారిని ప్రేరేపించిన వారినీ, వారికి శిక్షణ ఇచ్చిన వారినీ హీరోలుగా కీర్తించడం దేశద్రోహం అవ్వక మరే మౌతుంది? ప్రభుత్వాన్ని పడగొట్టి శ్రామికవర్గ నియంతృత్వాన్ని స్థాపించే లక్ష్యంతో సొంత బలగాలను పెంచుకోవడం, సైన్యం దేశరక్షణ బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పుడు వారిపై దొంగ దాడులకు పాల్పడటం దేశద్రోహం కాకపోతే మరింకేమిటి? ముస్లింలు సురక్షితంగా ఉండేందుకూ, వారికి స్వయం పాలన ఒనగూడేందుకూ భారతదేశాన్ని మరోసారి విభజించి మొఘలి స్థాన్‌ను సృష్టించాలని ఒక ప్రొఫెసర్ రాస్తే అది దేశద్రోహం కాకుండా ఎలా ఉంటుంది? హత్య, అత్యాచారం, దోపిడీ అనేవి 150 ఏళ్లకు పైగా ఉన్న భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నేటికీ శిక్షార్హమే అయినప్పుడు ఆ కాలం నాటిదే అయిన 124–ఏ సెక్షన్‌ను ఎందుకు రద్దు చేయాలి? (చదవండి: నల్ల చట్టానికి అమృతోత్సవాలా?) వలస పాలకుల కాలంలో 150 ఏళ్ల క్రితం నేరాలుగా పరి గణన పొందినవి నేడెలా నేరం కాకుండా పోతాయి? భారతదేశంలో దేశ వ్యతిరేక, సమాజ వ్యతిరేక, విదేశీ ప్రేరక... వ్యక్తులూ, సిద్ధాంత కర్తలూ, కార్యకర్తలూ ఉన్నారు. ప్రజాస్వామిక స్వేచ్ఛా భారతాన్ని వారి నుంచి రక్షించడానికి దేశద్రోహ ప్రసంగాలను, రచనలను, ప్రచారాలను, చర్యలను గుర్తించాలి, గమనించాలి, శిక్షించాలి. అందుకోసం రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే సెక్షన్ 124–ఏను కొనసాగించాలి. న్యాయబద్ధంగా నిందితులను విచారించాలి. దోషులకు శిక్షలు విధించాలి. ఈ విషయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజుజు దృఢ వైఖరి సరైనది, ప్రశంసనీయమైనది. (క్లిక్: దేశద్రోహం కేసు నిందితుడిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా) – డాక్టర్ టి. హనుమాన్ చౌదరి; చైర్మన్, ప్రజ్ఞాభారతి -
ఒక చట్టం... వేల వివాదాలు
124ఏ. బ్రిటిష్ వలస పాలకుల కాలం నాటి దేశద్రోహం చట్టం. సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో దీనిపై అంతటా చర్చ జరుగుతోంది. మన దేశంలో ఇది దుర్వినియోగమవుతుండటం నిజమేనా...? సెక్షన్ 124 ఏలో ఏముంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఎవరైనా మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే దేశద్రోహ నేరం కిందకి వస్తుంది. దీని కింద కేసు నమోదైతే బెయిల్ లభించదు. ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయవచ్చు. నేరం రుజువైతే మూడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దేశ ద్రోహం కేసులు ఎదుర్కొన్న వారు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు. ఎందుకు తెచ్చారు ? స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలల్ని అణిచేసేందుకు ఈ చట్టాన్ని తెచ్చారు. బ్రిటిషిండియా తొలి లా కమిషనర్ థామస్ మెకాలే రూపొందించిన ఈ చట్టాన్ని 1890లో 124ఏ సెక్షన్ కింద భారత శిక్షా స్మృతిలో చేర్చారు. దీనికింద 1891లో తొలిసారిగా జోగేంద్ర చంద్రబోస్ అనే పత్రికా సంపాదకుడిపై కేసు పెట్టారు. తర్వాత తిలక్ మొదలుకుని గాంధీ దాకా ప్రముఖులెందరో కూడా ఈ చట్టం కింద జైలుపాలయ్యారు. బ్రిటన్ మాత్రం దీన్ని 2009లో రద్దు చేసింది. ఆస్ట్రేలియా, సింగపూర్ కూడా ఈ చట్టాన్ని రద్దు చేశాయి. దిశ రవి నుంచి వరవరరావు వరకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాజకీయంగా ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహ చట్టాన్ని విస్తృతంగా ప్రయోగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కశ్మీర్‌పై వ్యాఖ్యలు చేసినందుకు అరుంధతి రాయ్, రైతు ఉద్యమానికి మద్దతుగా టూల్ కిట్ రూపొందించిన సామాజిక కార్యకర్త దిశ రవి, హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత మహిళ గ్యాంగ్ రేప్ కవరేజీకి వెళ్లిన జర్నలిస్టు సిద్దిఖి కపన్, పటీదార్ కోటా ఆందోళనలో పాల్గొన్న హార్దిక్ పటేల్, భీమా–కొరెగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు సుధా భరద్వాజ్, వరవరరావు, కరోనా సంక్షోభంపై వ్యాఖ్యలకు జర్నలిస్టు వినోద్ దువా తదితరులపై దేశద్రోహ ఆరోపణలు మోపారు. ► 2015–20 మధ్య దేశవ్యాప్తంగా సెక్షన్ 124ఏ కింద 356 కేసులు నమోదయ్యాయి ► ఈ ఆరేళ్లలో 548 మంది అరెస్టయ్యారు. ఆరుగురికి మాత్రమే శిక్ష పడింది. ► 2010–20 మధ్య బిహార్‌లో 168, తమిళనాడులో 139, యూపీలో 115, జార్ఖండ్‌లో 62, కర్నాటకలో 50, ఒడిశాలో 30 కేసులు నమోదయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విద్యార్థికి దేశద్రోహం కింద శిక్ష పడుతుందా?
న్యూఢిల్లీ : దేశద్రోహం అభియోగంపై భారతీయ శిక్షాస్మృతిలోని 124 ఏ సెక్షన్ కింద జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్, మరి కొందరిపై దాఖలు చేసిన కేసు న్యాయస్థానం ముందు నిలబడుతుందా? నిజంగా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లయితే ఈ కేసులో వారికి శిక్ష పడుతుందా? దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా, నినాదాలు చేసినంత మాత్రాన ఏ వ్యక్తిని దేశద్రోహిగా శిక్షించలేమని, సదరు వ్యక్తి ఉద్రోకపూరిత లేదా కవ్వింపు ప్రసంగాల పర్యవసానంగా దేశంలో తీవ్ర స్థాయిలో అలజడి రేగినా, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నా దేశ ద్రోహం నేరం కింద శిక్షించవచ్చని భారత సుప్రీం కోర్టు పలు కేసుల్లో స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్‌యూలో అఫ్జల్ గురు పేరిట జరిగిన కార్యక్రమంలో కొంత మంది విద్యార్థులు భారతకు వ్యతిరేకంగా నినాదాలు చేసినా, ప్రసంగించినా పర్యవసానంగా విద్యార్థుల నిరసన ప్రదర్శనలు జరిగాయే తప్ప, హింసాత్మక సంఘటనలు ఏమీ జరగలేదు. పాటియాల కోర్టులో జరిగిన దాడి సంఘటన కూడా కన్హయ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిందే తప్ప ఆయన అనుకూలురుగానీ మద్దతుదారులుగానీ దాడికి పాల్పడలేదు. ‘ఖలిస్తాన్ జిందాబాద్, రాజ్ కరేగా ఖల్సా’ నినాదాలు ఇచ్చారంటూ బల్వంత్ సింగ్‌పై 124 ఏ సెక్షన్ కింద పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన దేశ ద్రోహం కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. కేదార్నాథ్ సింగ్ కేసులో కూడా సుప్రీం కోర్టు ఇలాంటి ఉత్తర్వులే జారీ చేసింది. దేశానికి వ్యతిరేకంగా కేదార్నాథ్ ప్రసంగించడం వల్ల ప్రజల్లో ఎలాంటి కల్లోల పరిస్థితులు ఏర్పడలేదని, అందుకని ఆయన్ని ఈ నేరం కింద శిక్షించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ‘ఇంద్రదాస్ వర్సెస్ అస్సాం, అరూప్ భుయాన్ వర్సెస్ అస్సాం’....‘శ్రేయ సింఘాల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’...మధ్య నడిచిన దేశద్రోహం కేసుల్లో కూడా సుప్రీం కోర్టు ఇలాంటి ఉత్తర్వులే జారీ చేసింది. దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవ భావాజాలాన్ని ప్రచారం చేయడం నేరంకాదని, ఆ ప్రచారం పర్యవసానంగా దేశంలో తిరుగుబాటు తలెత్తి. అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే దేశద్రోహం కింద శిక్షించవచ్చని సుప్రీం కోర్టు నక్సల్స్‌పై దాఖలైన దేశద్రోహం కేసుల్లో తీర్పు చెప్పింది. కొంత మంది నక్సల్స్‌గా భావిస్తున్న వాళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నితే ప్రభుత్వం కూలిపోతుందా ? అలాంటి బలహీన ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒక్కటేనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విరసం సభ్యులపై దాఖలైన దేశద్రోహం కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. జేఎన్‌యూ క్యాంపస్ లోపల దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే దేశద్రోహం కింద కేసు దాఖలు చేయడం ఎంతవరకు సమంజసమో! ఆలోచించాలి. దేశద్రోహం పేరిట భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని నియంత్రించాలనుకోవడం సమంజసం కాదు. ఈ విషయంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారత్‌కన్నా అమెరికానే బెటర్. కమ్యూనిస్టులను అణచివేసేందుకు 1940 దశకంలో అమెరికా దేశద్రోహం చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని ప్రయోగించడంతో గొడవలు పెరుగుతుండడంతో 1963 నుంచి ఇంతవరకు ఒక్క కేసును కూడా ఆ చట్టం కింద నమోదు చేయలేదు.