విద్యార్థికి దేశద్రోహం కింద శిక్ష పడుతుందా?
న్యూఢిల్లీ : దేశద్రోహం అభియోగంపై భారతీయ శిక్షాస్మృతిలోని 124 ఏ సెక్షన్ కింద జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్, మరి కొందరిపై దాఖలు చేసిన కేసు న్యాయస్థానం ముందు నిలబడుతుందా? నిజంగా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లయితే ఈ కేసులో వారికి శిక్ష పడుతుందా?
దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా, నినాదాలు చేసినంత మాత్రాన ఏ వ్యక్తిని దేశద్రోహిగా శిక్షించలేమని, సదరు వ్యక్తి ఉద్రోకపూరిత లేదా కవ్వింపు ప్రసంగాల పర్యవసానంగా దేశంలో తీవ్ర స్థాయిలో అలజడి రేగినా, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నా దేశ ద్రోహం నేరం కింద శిక్షించవచ్చని భారత సుప్రీం కోర్టు పలు కేసుల్లో స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్‌యూలో అఫ్జల్ గురు పేరిట జరిగిన కార్యక్రమంలో కొంత మంది విద్యార్థులు భారతకు వ్యతిరేకంగా నినాదాలు చేసినా, ప్రసంగించినా పర్యవసానంగా విద్యార్థుల నిరసన ప్రదర్శనలు జరిగాయే తప్ప, హింసాత్మక సంఘటనలు ఏమీ జరగలేదు. పాటియాల కోర్టులో జరిగిన దాడి సంఘటన కూడా కన్హయ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిందే తప్ప ఆయన అనుకూలురుగానీ మద్దతుదారులుగానీ దాడికి పాల్పడలేదు.
‘ఖలిస్తాన్ జిందాబాద్, రాజ్ కరేగా ఖల్సా’ నినాదాలు ఇచ్చారంటూ బల్వంత్ సింగ్‌పై 124 ఏ సెక్షన్ కింద పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన దేశ ద్రోహం కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. కేదార్‌నాథ్ సింగ్ కేసులో కూడా సుప్రీం కోర్టు ఇలాంటి ఉత్తర్వులే జారీ చేసింది. దేశానికి వ్యతిరేకంగా కేదార్‌నాథ్ ప్రసంగించడం వల్ల ప్రజల్లో ఎలాంటి కల్లోల పరిస్థితులు ఏర్పడలేదని, అందుకని ఆయన్ని ఈ నేరం కింద శిక్షించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అలాగే ‘ఇంద్రదాస్ వర్సెస్ అస్సాం, అరూప్ భుయాన్ వర్సెస్ అస్సాం’....‘శ్రేయ సింఘాల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’...మధ్య నడిచిన దేశద్రోహం కేసుల్లో కూడా సుప్రీం కోర్టు ఇలాంటి ఉత్తర్వులే జారీ చేసింది.
దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవ భావాజాలాన్ని ప్రచారం చేయడం నేరంకాదని, ఆ ప్రచారం పర్యవసానంగా దేశంలో తిరుగుబాటు తలెత్తి. అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే దేశద్రోహం కింద శిక్షించవచ్చని సుప్రీం కోర్టు నక్సల్స్‌పై దాఖలైన దేశద్రోహం కేసుల్లో తీర్పు చెప్పింది. కొంత మంది నక్సల్స్‌గా భావిస్తున్న వాళ్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నితే ప్రభుత్వం కూలిపోతుందా ? అలాంటి బలహీన ప్రభుత్వం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒక్కటేనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విరసం సభ్యులపై దాఖలైన దేశద్రోహం కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. జేఎన్‌యూ క్యాంపస్ లోపల దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే దేశద్రోహం కింద కేసు దాఖలు చేయడం ఎంతవరకు సమంజసమో! ఆలోచించాలి.
దేశద్రోహం పేరిట భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని నియంత్రించాలనుకోవడం సమంజసం కాదు. ఈ విషయంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారత్‌కన్నా అమెరికానే బెటర్. కమ్యూనిస్టులను అణచివేసేందుకు 1940 దశకంలో అమెరికా దేశద్రోహం చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని ప్రయోగించడంతో గొడవలు పెరుగుతుండడంతో 1963 నుంచి ఇంతవరకు ఒక్క కేసును కూడా ఆ చట్టం కింద నమోదు చేయలేదు.