ఈ కష్ట‘మెట్లు’ తప్పున్!
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్‌కు వెళ్లాలన్నా.. విద్యార్థులు, ఉద్యోగులు బస్‌పాస్‌లు తీసుకోవాలన్నా అందుబాటులో ఉన్నది ఏకైక వసతి మెట్ల మార్గమే. రెండంతస్తులు పైకి వెళ్లి అక్కడి నుంచి సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్‌కు చేరుకోవాలి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సిటీ బస్సుల్లో రెతిఫైల్కు చేరుకునేవారు, దూరప్రాంతాల నుంచి రైళ్లలో సికింద్రాబాద్ స్టేషన్‌కు వస్తున్న వేలాది మంది ప్రయాణికులు మెట్రో రైలు కోసం ఈ మెట్ల మార్గంలో రాకపోకలు సాగించాలంటే ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇటు నాగోల్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి.. అటు మియాపూర్, కూకట్పల్లి, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల నుంచి ఎలాంటి కుదుపు లేకుండా మెట్రో రైళ్లలో హాయిగా సికింద్రాబాద్ ఈస్ట్‌కు చేరుకున్నవారు రెతిఫైల్ మెట్లను ఎక్కలేక, దిగలేక చుక్కలు చూస్తున్నారు. పైగా ఈ మెట్లు ఎంతో ఇరుకుగా, నిటారుగా ఉండడంతో పిల్లలు, మహిళలు, వయోధికులు అవస్థలు పడుతున్నారు.
లగేజీతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు రెతిఫైల్ నుంచి మెట్రో స్టేషన్‌కు వెళ్లేందుకు మెట్లు ఎక్కలేకపోతున్నారు. మెట్రో స్టేషన్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లను అనుసంధానం చేసేలా ఉన్న రెతిఫైల్ బస్‌స్టేషన్‌లో కనీస సదుపాయాలు లేకపోవడం ప్రయాణికుల పాలిట శాపంగా పరిణమించింది.
కొరవడిన సమన్వయం...
♦ రెతిఫైల్ బస్‌స్టేషన్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, గురుద్వారా, చిలకలగూడ క్రాస్‌రోడ్స్, బ్లూసీ హోటల్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి రోజు సుమారు 1500కు పైగా బస్సులు ఆయా బస్టాపుల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. కనీసం 10 లక్షల మంది సికింద్రాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తారు.
♦ మరోవైపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రోజుకు 1.85 లక్షల మంది రాకపోకలు సాగిస్తారు. మెట్రో రైళ్లలో సికింద్రాబాద్‌కు చేరుకోవాలంటే తప్పనిసరిగా రెతిఫైల్ నుంచి వెళ్లాల్సిందే. నిత్యం సుమారు 10 వేల మంది ప్రయాణికులు మెట్రో నుంచి ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల కోసం రెతిఫైల్ మీదుగా వెళ్తారు. ఆరీ్టసీ, మెట్రోరైల్, దక్షిణమధ్య రైల్వేల మధ్య సమన్వయం కొరవడడంతో రెతిఫైల్ స్టేషన్లో కనీస సదుపాయాలు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
♦ వాస్తవానికి ఇది ఆర్టీసీకి చెందిన ప్రయాణికుల ప్రాంగణం. ఈ బస్‌స్టేషన్‌లో అద్దెల రూపంలో ఆర్టీసీకి రూ.లక్షల్లో ఆదాయం లభిస్తోంది. కానీ ప్రయాణికుల సదుపాయాలపై మాత్రం ఆర్టీసీ దృష్టి సారించడం లేదు. రైలు, బస్సులు, మెట్రో మధ్య అనుసంధానం కోసం ఈ స్టేషన్‌కు ఆధునిక హంగులు కల్పించే అవకాశం ఉంది. కానీ మెట్రో, ఆర్టీసీ, దక్షిణమధ్య రైల్వేల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రయాణికులు ఒక కనెక్టివిటీ నుంచి మరో కనెక్టివిటీకి సాఫీగా చేరుకోలేకపోతున్నారు.
ర్యాంపులు, లిఫ్ట్‌లు అవసరం...
♦ మెట్రో రైళ్లకు, సాధారణ రైళ్లకు అనుసంధానంగా ఉన్న రెతిఫైల్ నుంచి రాకపోకలు సాగించేందుకు ర్యాంపులు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఎంతో అవసరం. భారీ లగేజీతో సికింద్రాబాద్ ఈస్ట్‌కు చేరుకొనేవారు అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లేందుకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రైల్వేస్టేషన్ నుంచి మెట్రో స్టేషన్‌కు వెళ్లాలన్నా రెండంతస్తుల మెట్లు ఎక్కడం కష్టంగా మారింది. కొద్ది పాటి సదుపాయాలతో ప్రయాణికులకు మూడు ప్రజారవాణా సదుపాయాలను అందుబాటులోకి తీసురావచ్చు. అందుకు కావాల్సిందల్లా మూడు సంస్థల మధ్య సమన్వయమే.