జుకర్‌బర్గ్‌కు భారీగా పెరిగిన పరిహారాలు
డేటా చోరి ఉదంతంపై ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ పరిహారాలు భారీగా పెరిగినట్టు తెలిసింది. గతేడాది జుకర్‌బర్గ్ పరిహారాలు 53.5 శాతం పెరిగి 8.9 మిలియన్ డాలర్లుగా నమోదైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ శుక్రవారం పేర్కొంది. దీనిలో ఎక్కువ ఆయన వ్యక్తిగత సెక్యురిటీకి వెచ్చించిన వ్యయాలే ఉన్నాయి. 83 శాతం పరిహారాలు సెక్యురిటీకి సంబంధించిన ఖర్చులని, మిగతా మొత్తం జుకర్‌బర్గ్ వ్యక్తిగతంగా వాడుకున్న ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఖర్చులు ఉన్నాయని కంపెనీ తెలిపింది. గతేడాది జుకర్‌బర్గ్ ఎక్కువ సమయం ట్రావెలింగ్‌కే వెచ్చించారని, అమెరికాలోని అన్ని రాష్ట్రాలను ఆయన చుట్టిముట్టేశారని పేర్కొంది.
సెక్యురిటీ వ్యయాలు అంతకముందు 4.9 మిలియన్ డాలర్లుంటే, 2017లో 7.3 మిలియన్ డాలర్లకు పెరిగాయి. అయితే ఫేస్బుక్ సీఈవో బేస్ శాలరీలో ఎలాంటి మార్పు లేదు. ఆయన బేస్ శాలరీ 1 డాలర్‌గానే ఉంది. అదేవిధంగా కంపెనీలో ఆయన ఓటింగ్ అధికారాలు కూడా 59.9 శాతం పెరిగాయి. చైర్మన్‌గా, సీఈవోగా, వ్యవస్థాపకుడిగా ఉన్న ఆయన భద్రత విషయంలో పలు ముప్పులు ఉంటాయని, ఈ నేపథ్యంలో జుకర్‌బర్గ్‌కు వ్యక్తిగత సెక్యురిటీకి ఎక్కువగా వెచ్చించినట్టు ఫేస్బుక్ బోర్డ్ పరిహారాల కమిటీ తెలిపింది. గత రెండేళ్ల నుంచి ఫేస్బుక్ అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఆదాయాలనే ఆర్జిస్తోంది. కానీ ఇటీవల కేంబ్రిడ్జ్ అనలిటికాతో ఫేస్బుక్ యూజర్ల డేటాను కంపెనీ అక్రమంగా పంచుకుందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా ఢమాల్‌మన్నాయి. ఈ విషయంపై వివరణ ఇవ్వడానికి జుకర్‌బర్గ్ అమెరికన్ కాంగ్రెస్ ముందుకు కూడా వచ్చారు.