విత్తన సదస్సును విజయవంతం చేయాలి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ విత్తన సదస్సు–2019కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి గురువారం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో విత్తన సదస్సు లోగో, కరదీపికలను ఆవిష్కరించారు. 2019 జూన్ 26 నుంచి జూలై 3 వరకు ఈ సదస్సు జరగనుంది. 94 ఏళ్ల సదస్సు చరిత్రలో ఆసియా ఖండంలో ఇలాంటి సదస్సు జరగడం ఇదే తొలిసారని, దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు.
ఇలాంటి గొప్ప అవకాశం రాష్ట్రానికి రావడం సంతోషకరమని, అధికారులు సమన్వయంతో పనిచేసి సదస్సును విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సదస్సుకు 83 దేశాల నుంచి విత్తన పరిశోధన, ఉత్పత్తి, నాణ్యత మొదలగు రంగాలకు చెందిన 800 మంది ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ సంచాలకులు కేశవులు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ పీటర్ కార్బెర్రి, వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జ, వ్యవసాయ వర్సిటీల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.