విత్తన నాణ్యతలో రాజీపడేది లేదు
అనంతపురం అగ్రికల్చర్ : విత్తన వేరుశనగ నాణ్యత విషయంలో రాజీపడేది లేదని, నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఏపీ మార్క్ఫెడ్ జనరల్ మేనేజర్ (జీఎం) ఆదినారాయణ ఆదేశించారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయన మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ఎ.బాలభాస్కర్తో కలిసి అనంతపురం, కల్లూరు, ధర్మవరం, గుత్తి ప్రాంతాల్లో ఉన్న విత్తన వేరుశనగ ప్రాసెసింగ్ ప్లాంట్లను సందర్శించారు. అక్కడ జరుగుతున్న విత్తనశుద్ధి కార్యక్రమాన్ని పరిశీలించారు.
తేమశాతం, వ్యర్థాలు, కల్తీ విత్తనాలు తదితర విషయాల్లో నిబంధనలు తప్పకుండా పాటించి, విత్తనశుద్ధి చేయాలన్నారు. ప్యాకింగ్, ట్యాగ్, సంచులు తదితర అంశాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతపురం జిల్లాలో రాయితీ విత్తన వేరుశన పంపిణీకి మార్క్ఫెడ్ తరఫున ఈ ఏడాది 34,600 క్వింటాళ్లు సేకరించి నిల్వ చేస్తున్న నేపథ్యంలో రైతులకు మంచి విత్తనకాయలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.