కందిసాగు..ఇప్పుడెంతో బాగు
ఖమ్మం వ్యవసాయం: ప్రత్యామ్నాయ పంటగా కంది సాగుకు ఇదే అనువైన సమయం. విత్తనాల ఎంపిక, ఎరువుల యాజమాన్యంలో కొద్దిపాటి మెళకువలు పాటిస్తే గణనీయంగా లాభాలు గడించవచ్చంటున్నారు జిల్లా వ్యవసాయశాఖ ఉపసంచాలకులు ఎం.రత్నమంజుల. కంది సాగుకు సంబంధించిన ఎన్నో వివరాలను ఆమె వెల్లడించారు.
విత్తన రకాలు: పల్నాడు ఎల్ఆర్జీ 30, ఎల్ఆర్జీ 38, ఎల్ఆర్జీ 41, లక్ష్మి (ఐసీపీఎల్ 85063), ఎంఆర్జీ 66, డబ్ల్యూఆర్జీ 27, డబ్ల్యూఆర్జీ 53, సూర్య (ఎంఆర్జీ 1004) వంటి రకాలు విత్తుకోవాలి.
విత్తే విధానం: ఎకరాకు 6 నుంచి 8 కిలోలు విత్తనాలను విత్తుకోవాలి. అయితే తొలకరిలో లాగా కాకుండా ఈనెలలో విత్తేటప్పుడు సాళ్ల మధ్య దూరం తగ్గించి 45-90ఁ10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి.
ఎరువుల యాజమాన్యం: ఎకరానికి సుమారు రెండు టన్నుల పశువుల ఎరువు వాడాలి. ఇలా చేస్తే భూమి భౌతికశక్తి పెరుగుతుంది. భూసారాన్ని దీర్ఘకాలం కాపాడుకోవచ్చు. సూక్ష్మధాతులోపాన్ని సవరించుకోవచ్చు. ఎకరానికి 16 కిలోల నత్రజని, 20 కిలోల భూస్వా రం చొప్పున దుక్కిలో వేయాలి. భా స్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్పేట్ రూపంలో అందిస్తే మొక్కకు గంధకం కూడా అంది దిగుబడి 20-25 శాతం పెరుగుతుంది. విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు ఎకరాకు లీటర్ నుంచి 1.5 లీటర్ల పెండిమిథాలిన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
తెగుళ్ల నివారణ
కందికి వివిధ దశలలో నష్టం కలగజేసే చీడపీడలు వ్యాపిస్తాయి. వీటిలో మారుకా మచ్చల పురుగు, ఎండు తెగులు ప్రధానమైనవి. సెప్టెంబర్లో వేసినప్పుడు జనవరిలో పూతకు వస్తుంది కాబట్టి శనగ పచ్చ పురుగు ఉధృతి కొంత తక్కువనే చెప్పాలి.
మారుకా మచ్చల పురుగు: తల్లి పురుగు పూ మొగ్గలు, లేత ఆకులు, పిందెలపై 2 నుంచి 16 గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి నాలుగైదు రోజుల్లో పిల్లలు బయటకు వస్తాయి. ఇవి పురుగు మొగ్గ, పూత, పిందె దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలగజేస్తాయి. ప్రతి దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్థాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు వాటిని దగ్గరుకు చేర్చుతాయి. అలా దగ్గరుగా చేర్చిన కాయలకు గూడు కట్టి రంధ్రం చేసి లోపలికి పోయి గింజలను తింటాయి.
నివారణ: మారుకా మచ్చల పురుగు నివారణకు పూతకు ముందే ఐదు శాతం వేపగింజల కషాయాన్ని లీటర్ నీటిలో 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరీఫాస్ లేదా ఒక గ్రాము ఎసిఫేట్ లేదా 2.5 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్తో కలిపి పిచికారీచేయాలి. ఈ మందులతోపాటుగా ఉదర స్వభావం కలిగిన డైక్లోరోఫాస్ మందును మిల్లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు స్పైనోపాడ్ 0.4 మిల్లీలీటర్లు లేదా ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు, ప్లూబెండా మైడ్ 0.15 మిల్లీలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ఎండు తెగులు
ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కాని, మొక్కలో కొంత భాగం కాని వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగం చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి.
మాక్రోఫోమినా ఎండుతెగులు: ముదురు మొక్కల కాండం పైన నూలు కండె ఆకారము కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చ చుట్టూ గోధుమ వర్ణం, మధ్య భాగం తెలుపు వర్ణంలో ఉంటాయి. ఈ తెగులు సోకిన మొక్కలు ఎండిపోతాయి. ఒకొక్కప్పుడు కొన్ని కొమ్మలు మాత్రమే ఎండిపోతాయి.
నివారణ: ఎండుతెగులును ఐసీపీఎల్ 85063 (లక్ష్మి) తట్టుకుంటుంది. మాక్రోఫోమినా ఎండుతెగులు ఎంఆర్జీ 66, సూర్య (ఎంఆర్జీ 1004) రకాలు తట్టుకుంటాయి. ఎండుతెగులువచ్చే ప్రాంతాల్లో ఇటువంటి రకాలనే వేయాలి. తెగులు ఎక్కువగా ఉన్న పొలంలో వర్షపునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ట్రైకోడెర్మా విరిడి జీవనియంత్రణ శిలీంద్రం పొడి మందు కిలో విత్తనానికి 10 గ్రాములు లేదా కార్బన్డిజమ్ రెండు గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేస్తే ఎండుతెగులును నివారించవచ్చు.