విత్తన ఎంపికలో అయోమయం
పాలకోడేరు రూరల్, న్యూస్‌లైన్ : విత్తనాల ఎంపికపై సరైన అవగాహన కొరవడటంతో కొందరు రైతులు నష్టపోతున్నారు. విత్తనోత్పత్తికి వాడే విత్తనాలను తీసుకుని సాధారణ సాగు చేసి.. ఆనక దిగుబడి తగ్గడంతో లబోదిబోమంటున్నారు. వ్యవసాయ శాఖ విత్తనోత్పత్తి పథకం కింద ప్రతి మండలానికి కొన్ని బస్తాలు ఫాండేషన్ విత్తనం పంపిణీ చేస్తోంది. వీటిని వ్యవసాయ అధికారులు సబ్సిడీపై రైతులకు విక్రయిస్తుంటారు. అయితే ఇదే అసలు విత్తనం అనుకుని రైతులు కొనుగోలు చేసి ఖరీఫ్‌లో సాధారణ సాగు చేస్తున్నారు.
తీరా పంట దిగుబడి వచ్చేసరికి బయట విత్తనంతో పోల్చుకుంటే ఫౌండేషన్ విత్తనంతో సాగు చేసిన పొలంలో ఎకరాకు 5 బస్తాలు దిగుబడి తగ్గుతోంది. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. గతేడాది సార్వాలో చాలామంది రైతులు విత్తనోత్పత్తి విత్తనాలను తీసుకుని సాధారణ సాగుచేసి దిగుబడి కోల్పోయారు. అసలు విషయం ఏమిటో కొందరు రైతులు తెలుసుకోగా.. మరికొందరు పంట తేలిపోయి ఉంటుందని, వరి సరిగ్గా పాలుపోసుకోలేదని తదితర కారణాలతో సరిపెట్టుకుంటుండటం గమనార్హం.
సార్వాకు దాళ్వా.. దాళ్వాకు సార్వా విత్తనం ఇవ్వాలి
విత్తనోత్పత్తి పథకంలో దాళ్వా సాగుకు ఉపయోగించే 1010 లాంటి విత్తనాలను సార్వా సాగు సమయంలో ఇస్తే రైతులు వాటిని తమ పొలాల్లో కొంత మేర ఆ విత్తనం సాగు చేసి.. ఆ తర్వాత దాళ్వా సమయం వచ్చినప్పుడు సాధారణ సాగు చేయాలి. అలాగే సార్వాలో ఉపయోగించే స్వర్ణ లాంటి విత్తనాలను దాళ్వా సాగు సమయంలో ఇస్తే రైతులు కొంత మేర ఆ విత్తనం సాగు చేసి.. ఆనక సార్వా వచ్చినప్పుడు దానిని సాగు చేయాలి. అయితే రైతులు అలా చేయకుండా విత్తనోత్పత్తి విత్తనాలను కొనుగోలు చేసిన వెంటనే సాధారణ సాగు చేయడంతో దిగుబడి తగ్గిపోయి రైతులు గగ్గోలు పెడుతున్నారు.
వ్యవసాయ శాఖ కూడా సార్వా సాగు సమయంలో దాళ్వా విత్తనాలను కాకుండా సార్వా విత్తనాన్ని విత్తనోత్పత్తి పథకం కింద సరఫరా చేస్తుండడంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. దీనిపై అవగాహన కల్పించాల్సి ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం విత్తనోత్పత్తి ఎంటీయూ 7029 స్వర్ణ విత్తనాలు మండల వ్యవసాయ కార్యాలయాలకు చేరాయి. విత్తనాల అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. 30 కేజీల బస్తా రూ.780 ఉంటే సబ్సిడీపై రూ.390కు విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు స్పందించి రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంది.