seeds problems
-
చూస్తూ ‘ఊరు’కోం..
విత్తనాలతో విప్లవాత్మక చర్యకు శ్రీకారం చుట్టారా గ్రామస్తులు. తన భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నించి దాడి చేయడంతో జైపాల్‌రెడ్డి అనే రైతు మనస్తాపం చెందాడు. కొడుకు చరణ్‌రెడ్డితో కలిసి పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆ రైతు కష్టం చూసి ఊరి ప్రజలంతా ఏకమయ్యారు. చందాలతో విత్తనాలు కొని ఆ రైతు భూమిని చదును చేసి పత్తి విత్తనాలు వేశారు. భూకబ్జాకు యత్నిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో జరిగింది. – తలమడుగు/సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
రైతు మెడపై నకిలీ కత్తి
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో జిల్లాలో మళ్లీ నకిలీ పత్తివిత్తనాలు జోరందుకున్నాయి. ప్రభుత్వం నిషేధించిన పత్తివిత్తనాలతో పాటు, నకిలీ విత్తనాలు కూడా మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. విత్తన వ్యాపారులు, జిన్నింగ్‌మిల్లుల నిర్వాహకులు, దళారులు ఈ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన ఈ విత్తనాలను రైసుమిల్లులు, జిన్నింగ్‌మిల్లుల్లో నిలువ ఉంచి, రైతులతో తమకున్న సంబంధాలను వినియోగించుకొని అంటగడుతూ మోసగిస్తున్నారు. ఓ వైపు పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నా.. మరోవైపు నకిలీ, నిషేధిత విత్తనాలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, మంచిర్యాల: బెల్లంపల్లి పట్టణంలో సత్యనారాయణ అనే రైసుమిల్లు యజమాని ఇంట్లో వ్యవసాయశాఖ అధికారులతో కలిసి పోలీసులు సోదాలు నిర్వహించారు. నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉంచారనే సమాచారంతో ఈనెల 13న దాడులు చేయగా.. బియ్యం బస్తాల్లో దాచి ఉంచిన 120 కిలోల నకిలీ పత్తి విత్తనాలు బయటపడ్డాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.40 లక్షలు. వాటిని రైతులకు విక్రయించడానికి సిద్ధమైన సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో పత్తి పంట సాగుకు అధిక శాతం రైతులు మొగ్గుచూపుతుంటారు. గత సంవత్సరం 1.39లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా. ఈ ఏడాది 1.51లక్షల ఎకరాల్లో సాగుచేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ సాగు కోసం దాదాపు 3.10లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని గుర్తించారు. సాధారణంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తుంటారు. కానీ అధికారులకన్నా.. ఏటా కొనుగోలు చేసే విత్తన వ్యాపారులనే రైతులు నమ్ముతుంటారు. రైతుల నమ్మకాన్ని ఆసరగా తీసుకుని విత్తన వ్యాపారులు వారిని నిండాముంచుతున్నారు. జిల్లాలో నకిలీ విత్తనాలతో పాటు, నిషేధిత పత్తి విత్తనాల విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నాయి. నకిలీ, నిషేధిత విత్తనాల అమ్మకాలు జిల్లాలో నకిలీ, నిషేధిత విత్తనాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలతో పాటు, నాసిరకం విత్తనాలకు రంగులు అద్ది నకిలీ విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నారు. పర్యావరణం దెబ్బతినడం, క్యాన్సర్ లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం గ్లైసిల్ పత్తివిత్తనాలు, గ్లైఫోసిట్ మందులను నిషేధించింది. నిషేధించి సంవత్సరాలు గడుస్తున్నా అమ్మకాలను మాత్రం అరికట్టలేకపోతోంది. ఈ సీజన్లో మళ్లీ నిషేధిత గ్లైసిల్, గ్లైఫోసెట్ అమ్మకాలు గ్రామాల్లో జోరందుకుంటున్నాయి. వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు జరుపుతున్నారు. ఈ విత్తనాలు వాడితే పత్తిలో కలుపు సమస్య ఉండదని, గులాబీ పురుగు నివారణకు మెరుగ్గా పనిచేస్తుందని నమ్మబలికి రైతులకు అంటగడుతున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా.. దందా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. విత్తనాలు, ఎరువుల దుకాణాల ద్వారానే ఈ వ్యాపారం ఎక్కువగా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. చీడను తట్టుకుంటుందని, కలుపు తీయడానికి కూలీల సమస్య ఉండదనే కారణంగా రైతులు ఈ నిషేధిత పత్తి విత్తనాల వైపు మొగ్గుచూపుతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిషేధించినప్పటికీ గ్రామాల్లో కొనుగోళ్లు జరగడానికి ఇదే కారణంగా భావిస్తున్నారు. అలాగే నకిలీ విత్తనాల దందా జిల్లాలో సాగుతోంది. నాసిరకం విత్తనాలకు రంగులు అద్ది, ఆకర్షణీయమైన సంచుల్లో విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచే... ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ, నిషేధిత విత్తనాలు జిల్లాకు దిగుమతవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, నంద్యాల తదితర ప్రాంతాల నుంచి ఈ విత్తనాలు జిల్లాకు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన నకిలీ, నిషేధిత విత్తనాలను జిల్లాలోని రైసుమిల్లులు, జిన్నింగ్‌మిల్లుల్లో నిలువ ఉంచారు. రబీలోనే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన నకిలీ, నిషేధిత పత్తి విత్తనాలు తెప్పించుకుని నిల్వ ఉంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో గోదాముల్లో దాచి ఉంచిన విత్తనాలను మార్కెట్లకు తరలిస్తున్నారు. అలాగే గ్రామాల్లోని కొంతమంది రైతులు, దళారులకు కమీషన్ ఇచ్చి వారి ని ఈ దందాలో భాగస్వామ్యులను చేస్తున్నారు. ప్యాకెట్లతోపాటు విడిగా కిలోల చొప్పున కూడా తేలిగ్గా విక్రయిస్తున్నారు. ఓ ముఠాగా ఏర్పడిన కొంతమంది వ్యాపారులు నకిలీ, నిషేధిత విత్తనాల దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మార్చి నెలలో రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. మంచిర్యాల, రామకృష్ణాపూర్, మందమర్రి, తాళ్లగురిజాల, నెన్నెల, కన్నెపల్లి పోలీసుస్టేషన్ల పరిధిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 13 మంది ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.65 లక్షల విలువైన నకిలీ పత్తివిత్తనాలు స్వాధీనపరచుకున్నారు. నకిలీ, నిషేధిత పత్తివిత్తనాల దందాను మరో 20 మంది వ్యాపారులు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ లెక్కన జిల్లాలో చాలా పెద్ద ముఠాయే ఈ కార్యకలాపాలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. నకిలీ, విత్తన దందా సాగిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. లేదంటే విత్తనాలకు నకిలీ చీడ తగిలి దిగుబడి రాక అన్నదాతలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. -
విజిలెన్స్ దాడుల్లో విస్తుపోయే నిజాలు
తిరుపతి క్రైం: రైతులకు అందించే రాయితీ విత్తనాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ పరిధిలోని చిత్తూరు జిల్లా ఏపీ సీడ్స్‌లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ నోడల్ ఏజెన్సీ ముసుగులో ఏపీ సీడ్స్‌లో రూ.13.36 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులు స్వాహా అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తిరుపతి ఎస్పీ పీవీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటకు వచ్చింది. ఆ వివరాలను సోమవారం తిరుపతి విజిలెన్స్కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. ఆయన కథనం మేరకు.. ఏపీఎస్ఎస్డీసీ సబ్సిడీపై రైతులకు అందించే విత్తనాలను మొదట ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ధ్రువీకరిస్తుంది. దీని ప్రకారం సీడ్ ఆర్గనైజర్స్ (మధ్యవర్తులు) నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తుంది. ఈ మధ్యవర్తులు నాణ్యమైన విత్తనాలను పండించేందుకు కొంతమంది స్థానిక రైతుల భూములను రిజిస్టర్ చేసుకుని అందులోనే విత్తనాలు పండిస్తారు. వాటిని ఉత్పత్తి చేసే సమయంలో అధికారులు మూడు పర్యాయాలు పరిశీలించిన అనంతరం సర్టిఫైడ్ సీడ్స్గా ఆ విత్తనాలకు గుర్తింపును ఇస్తూ ట్యాగ్ వేస్తారు. వీటినే రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. కుంభకోణం ఇలా.. రబీ సీజన్ ద్వారా 2017–18లో సీడ్ ఆర్గనైజర్ (మధ్యవర్తుల) ద్వారా విత్తనాలను సేకరించి 2018 ఖరీఫ్ సీజన్లో జిల్లా ఏపీ సీడ్స్ రైతులకు అందించారు. అయితే ఇందులో తేడా జరిగినట్లు రాష్ట్ర అధికారులు భావించారు. దీంతో చిత్తూరు జిల్లా ఏపీ సీడ్స్ సిబ్బందిని, రైతులను విచారించారు. ఈ తనిఖీల్లో ఖరీఫ్ సీజన్‌కు 54,745 క్వింటాళ్లను రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అందించినట్లు గుర్తిం చారు. ఇందులో ఒక కేజీ రూ.61 చొప్పున ఏపీఎస్ఎస్సీఏ మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేసిందని తేలింది. కాగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అందజేసిన ఈ ధరలో 40శాతం అంటే రూ.24.40 ప్రభుత్వం రాయతీ ఇవ్వగా, రూ.36ను రైతుల నుంచి వసూలు చేశారు. ఇలా ప్రతి రైతుకూ 30 కేజీల విత్తనాలను ఇచ్చారు. అయితే వ్యవసాయశాఖ అందించిన ఈ విత్తనాలకు వేసిన ట్యాగు తేడా ఉండడంతో దాని ఆధారంగా కుంభకోణంపై విజిలెన్స్ శాఖ తనిఖీలు చేసింది. ఇందులో సీడ్ ఆర్గనైజర్స్ (మధ్యవర్తులు) అసలు రైతుల వద్ద నాణ్యమైన విత్తనాలనే పండించలేదని, ఆ విత్తనాలను సీడ్ సర్టిఫికేషన్స్ (గుర్తింపునిచ్చే) అధికారులు అసలు పరిశీలించలేదని స్పష్టమైంది. కాగా ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి చెందిన రూ.13.36 కోట్లు నిధులు సీడ్ ఆర్గనైజర్స్ అవినీతికి పాల్పడినట్టు గుర్తించారని ఆయన తెలిపారు. ఇందుకోసం జిల్లాలో 822 మంది రైతుల నుంచి వివరాలు సేకరించామన్నారు. కాగా కేవలం చిత్తూరు జిల్లాలోనే ఇంత పెద్దమొత్తంలో అవినీతి జరిగితే, రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఇదే స్థాయిలో మధ్యవర్తులు అవినీతికి పాల్పడితే ఏంటి పరిస్థితి అని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అదించనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో విజిలెన్స్ సీఐలు, అంజుయాదవ్, మద్దెయ్యాచ్చారి, టి.అబ్బన్న పాల్గొన్నారు. -
తెలంగాణ పంట చేలలో విత్తన విధ్వంసం!
సదాశివపేట మండలం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: భర్త ఫొటో పట్టుకొని దీనంగా కూర్చున్న ఈమె పేరు స్వరూప. పక్కనుంది ఆమె అత్త, కొడుకు. వీరిది సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగులపల్లి. బీజీ–3 పత్తి ఈ ఇంటి దీపాన్ని ఆర్పివేసింది. స్వరూప భర్త రాజు ఈ ఏడాది తనకున్న నాలుగెకరాలకుతోడు మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. విత్తన డీలర్ బీజీ–2 పత్తి విత్తన ప్యాకెట్ పేరుతో బీజీ–3 విత్తనాలు ఇచ్చాడు. చెట్టు ఎదిగింది కానీ పూత, కాత రాలేదు. ఆ దిగులుతో రాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న భర్తను బతికించుకునేందుకు స్వరూప రూ.6 లక్షలు అప్పు చేసి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఇలా ఒక్కరిద్దరు కాదు.. తెలంగాణలో ఎందరో రైతుల్ని బీజీ–3 మింగేసింది. వారి బతుకులను ఛిన్నాభిన్నం చేసింది. రాష్ట్రంలో లక్షల మంది రైతులు వారికి తెలియకుండానే కార్పొరేటు విత్తన కంపెనీల ప్రయోగాలకు సమిధలయ్యారు. బహుళజాతి విత్తన సంస్థలు రాష్ట్రంలోకి రహస్యంగా ప్రవేశపెట్టిన జన్యు మార్పిడి పత్తి వంగడం బీజీ–3ని సాగు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు. దిగుబడి వచ్చే సెప్టెంబర్–డిసెంబర్ మధ్య కాలంలోనే రాష్ట్రంలో అనధికారికంగా 300 మంది రైతులు చనిపోయారు. సంగారెడ్డి జిల్లాలోని ఒక్క సదాశివపేట మండలం లోనే ఆ ఆరు నెలల కాలంలో ఆరుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పత్తి విత్తనాలను అనధికారికంగా బీజీ3 (బోల్‌గార్డు 3) పేరుతో పిలుస్తున్నారు. అనధికారిక డీలర్లు, ప్రత్యేక ఏజెంట్ల ద్వారా విత్తన కంపెనీలు రాష్ట్రంలో దాదాపు 13 లక్షల ఎకరాల్లో బీజీ–3ని సాగుచేయించినట్లు తేలింది. రైతులు తమకు తెలియకుండానే కంపెనీల మాయాజాలంలో చిక్కి తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యల పాలవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించినా బోల్‌గార్డు 3 పత్తి రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగైంది. రాష్ట్రంలో ఏకంగా 2,500 గ్రామాల్లో దీన్ని సాగు చేసినట్లు అఖిల భారత కిసాన్ సంఘం, తెలంగాణ రైతు సంఘాలు చేసిన పరిశీలనలో తేలింది. దాదాపు తొమ్మిది లక్షల మంది రైతులు 13 లక్షల ఎకరాల్లో ఈ పత్తిని సాగు చేశారు. పంట వేసిన చోటల్లా మొక్కలు 6 నుంచి 7 అడుగులు పెరిగి పూత, కాత లేకుండా గిడసబారిపోయాయి. ఎకరం చేనులో కేవలం 50 కిలోల నుంచి క్వింటాల్ లోపే దిగుబడి వచ్చింది. రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 1.5 లక్షలు, నల్లగొండ 1.5 లక్షలు, అదిలాబాద్‌లో లక్ష, వరంగల్ 1.5 లక్షల ఎకరాల్లో బీజీ–3ని సాగు చేసినట్లు రైతు సంఘాలు అంచనా వేశాయి. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో మోస్తరు స్థాయిలో సాగైంది. విత్తం వారిదే.. విత్తనం వారిదే.. అదును రాగానే రైతులు గ్రామంలోని షావుకార్ల వద్దనో.. విత్తన వ్యాపారుల వద్దనో అప్పు కింద విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. పంట వచ్చినప్పుడు అప్పు తీర్చేలా ఒప్పందం చేసుకుంటారు. ఎలాగూ అప్పు ఇస్తున్నారు కాబట్టి వ్యాపారి ఇచ్చిన విత్తనాలనే రైతులు తీసుకుంటున్నారు. వీటికి ఎలాంటి రశీదులు ఉండవు. విత్తన డీలర్ నిబంధనల ప్రకారం ఒక పత్తి విత్తన ప్యాకెట్ అమ్మితే రూ 25–30 లాభం వస్తుంది. కానీ అదే బీజీ–3 విత్తన ప్యాకెట్‌ను రైతుకు విక్రయిస్తే రూ రూ.500, అదే లూజ్‌గా విక్రయిస్తే కిలోకు రూ.1,200 చొప్పున ఆదాయం సమకూరుతోంది. వీళ్లంతా రైతులకు అక్రమ విత్తనాలు అంటగట్టారు. ‘సాక్షి’సేకరించిన వివరాల ప్రకారం గ్రామాల్లో ప్రతి 100 మంది రైతుల్లో 47 మంది మండల కేంద్రాల్లోని అధికారిక విత్తన దుకాణల నుంచి విత్తనాలు తీసుకుంటుండగా.. 53 మంది షావుకార్లు, ఇతర వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు కింద విత్తనాలు తీసుకున్నారు. బ్యాంకులు అవసరమైన సమయంలో రుణాలు ఇవ్వకపోవటంతో రైతులు ఇలా వడ్డీ వ్యాపారులు, విత్తన వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రైతులు రాలిపోతున్నారిలా.. సదాశివపేట మండలంలోని నిజాంపూర్‌లో నిరుడు సెప్టెంబర్‌లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత మూడు నెలల వ్యవధిలోనే మరో అయిదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరందరికి సొంత భూమి కొంతే ఉండగా.. ఎక్కువ విస్తీర్ణాన్ని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. ఎకరాకు 12 నుంచి 14 క్వింటాళ్లు పండే భూముల్లో ఈసారి నాలుగు క్వింటాళ్లు మించి దిగుబడి రాలేదు. కౌలు డబ్బులను ముందే చెల్లించిన రైతులు.. వచ్చిన కాస్త దిగుబడిని అమ్మినా చేతికి చిల్లిగవ్వ రాలేదు. అప్పులు గుదిబండలా మారడంతో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు తీసుకుంటున్నారు. పంట నష్టపోయి ఈ నెల 4న రైతు నాగేశ్వర్ పురుగుల మందు తాగి ప్రాణాలొదిలాడు. నాగ్సాన్పల్లికి చెందిన కిష్టయ్య 2016 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. నిజాంపూర్ గ్రామానికి చెందిన బాలయ్య(45), ఇదే గ్రామానికి చెందిన బోడ పాపయ్య బలవన్మరణం చెందారు. ఇదే ఇదే మండలం వెంకటాపూర్‌కు చెందిన అంబాదాస్ (24) మూడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. తీవ్ర నష్టం రావడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు చావులను నివారించే దిశగా కనీస చర్యలకు ఉపక్రమించని అధికారులు.. కనీసం బాధిత కుటుంబాలను ఆదుకునే విషయంలోనూ మానవత్వంతో వ్యవహరించటం లేదు. ఈమె పేరు అంజమ్మ. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం బొబ్బిలిగామ. భర్త ఉండగా బాగా బతికిన కుటుంబం. ఈమె భర్త శ్రీశైలంను జీ3 పత్తి మింగింది. ఆయన తనకు ఉన్న రెండెకరాలకు తోడు మరో 22 ఎకరాలు కౌలు తీసుకున్నాడు. మొత్తం 24 ఎకరాల్లో తనకు తెలియకుండానే బీజీ 3 వేశాడు. ఆశించిన దిగుబడి రాలేదు. అప్పులు కట్టలేక రెండు నెలల కింద చేనులోనే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఆక్వా రైతుకు ‘సీడ్’ కష్టాలు
బోగోలు మండలం సిద్ధవరపు వెంకటేశ్వరపాళేనికి ఓ ఆక్వా రైతు జిల్లాలోని ప్రముఖ హేచరీ నుంచి 25 రోజుల క్రితం మూడు లక్షల వెనామీ రొయ్య పిల్లలు కొనుగోలు చేశాడు. ఒక్కో పిల్లకు 80 పైసల వంతున చెల్లించాడు. రెండు ఎకరాల్లో వదిలిన ఈ పిల్లలు నాసిరకమైనవి కావడంతో ఎదుగుదల నిలిచిపోయింది. గుంటలో వదిలిన 25 రోజులకు కూడా వారం రోజుల పిల్లల్లానే ఉన్నాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన ఆ రైతు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. బోగోలు మండలంలోని సిద్ధనపాళేనికి చెందిన మరో రైతు 16 రోజుల క్రితం నెల్లూరుకు సమీపంలోని ఓ హేచరీ నుంచి లక్ష పిల్లలు కొనుగోలు చేసి ఎకరా విస్తీర్ణంలోని గుంటలో వదిలాడు. పిల్లల ఎదుగుదల మెరుగ్గానే ఉన్నా అన్నీ ఒకేలా లేవు. సుమారు 30 శాతం పిల్లల ఎదుగుదల నిలిచిపోవడంతో అనుభవజ్ఞుల సూచన మేరకు వేలాది రూపాయలు వెచ్చించి వివిధ రకాల మందులు, మినరల్స్ వినియోగిస్తున్నాడు. కావలి/బిట్రగుంట : నాసిరకమైన సీడ్‌తో ఎదురవుతున్న ఇబ్బందులు బోగోలు మండల రైతులకే పరిమితం కాలేదు. జిల్లాలోని తీరప్రాంతంలో వెనామీ రొయ్యలు సాగుచేస్తున్న వేలాది మంది రైతులది ఇదే పరిస్థితి. ఇటీవల వరకు ఆక్వా రైతులకు కాసుల పంట పండించిన వెనామీ సాగును ప్రస్తుతం సమస్యలు చుట్టుముడుతున్నాయి. చి న్నా, చితకా హేచరీలతో పాటు ప్రము ఖ హేచరీల్లో ఉత్పత్తి అవుతున్న సీడ్లో కూడా నాణ్యత కొరవడడంతో సాగుదారులు ఆర్థికంగా చితికిపోతున్నారు. గతంలో స్కాంపి, టైగర్ రొయ్యల హవా సాగిన రోజుల్లో జిల్లాలో హేచరీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. చివరకు కోళ్లఫారాలు కూడా హేచరీలుగా మారాయి. తర్వాత ఆ రొయ్యల సాగు సంక్షోభంలో చిక్కుకోవడంతో ఎక్కువ శాతం హేచరీలు మూతపడ్డాయి. గత మూడేళ్లుగా వెనామీ సాగు జోరందుకోవడంతో పలు హేచరీలు పలు ఉత్పత్తి ప్రారంభించా యి. ప్రస్తుతం జిల్లాలో సుమారు 50కి పైగా హేచరీలు వెనామీ రొయ్యపిల్లల ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే వీటిలో సగానికి కూడా అనుమతి లేదనేది బహిరంగ రహస్యమే. ఎక్కువ శాతం హేచరీలు నాసిరకమైన సీడ్ అంటగడుతూ రైతులను నిలువునా ముంచేస్తున్నాయి. చిన్నాచితకా హేచరీలతో పాటు కొన్ని ప్రముఖ హేచరీల నిర్వాహకులు కూడా మోసపూరిత చర్యలకు పాల్పడుతుండడం దురదృష్టకరం. మోసం చేసేదిలా.. సాధారణంగా రొయ్య పిల్లల నాణ్యత తల్లి రొయ్యపై ఆధారపడి ఉంటుంది. ఒక్కో తల్లి రొయ్య నాలుగు దఫాలుగా గుడ్లు పెడుతుంది. తొలి రెండు దఫాల్లో పెట్టిన గుడ్ల నుంచి వచ్చిన పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉంటాయి. వీటిని హేచరీల నిర్వాహకులు తమ సొంత చెరువుల్లో వదలడంతో పాటు పెద్దరైతులకు మాత్ర మే విక్రయిస్తున్నాయి. ఇక మూడు, నాలుగు దఫాల్లో పెట్టిన గుడ్లతో ఉత్పత్తి చేసిన పిల్లలను సన్నకారు రైతులకు అంటగడుతూ ఒక్కో పిల్లకు 60 నుంచి 80 పైసలు వసూలు చేస్తున్నారు. హేచరీల్లో రొయ్య పిల్లల వయస్సును పీఎల్(పోస్ట్ లార్వా)గా పిలుస్తారు. లార్వా నుంచి పిల్ల బయటకు వచ్చిన రోజు నుంచి 20వ రోజు వరకూ పీఎల్1, పీఎల్ 2, అంటూ 20వ రోజుకు పీఎల్20గా లెక్కిస్తారు. పీఎల్ 15 (15 రోజుల పిల్ల) పిల్లలు గుంటల్లో వదిలేందుకు అనువుగా ఉంటాయి. హేచరీల నిర్వాహకులు మాత్రం పీఎల్ 10 పిల్లలను పీఎల్ 5, పీఎల్ 6 పిల్లల్లో కల్తీ చేస్తున్నా రు. వీటిని గుంతల్లో వదిలిన తర్వాత తక్కువ పీఎల్ ఉన్న పిల్లలు చనిపోతుం డగా ఎదుగుదలలో కూడా గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. భారీగా నష్టాలు పిల్లల పీఎల్ తేడాతో ఎదుగుదల నిలిచిపోతుండగా రైతులు మాత్రం ఇంకేదో లోపమని భావించి వేలాది రూపాయలు వెచ్చించి మందులు, మినరల్స్ వినియోగిస్తున్నారు. ఫలితంగా పెట్టుబడి భారీగా పెరిగి చివరకు నష్టాల పాలవుతున్నారు. మరోవైపు పలువురు రైతులు నాణ్యమైన సీడ్ లభించక గుంతలను ఖాళీగా వదిలేస్తున్నారు. మంచి సీడ్ కోసం జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాలోని హేచరీల్లో గాలించినా లభించడం లేదని చెబుతున్నారు. దీంతో వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగుకు సిద్ధం చేసిన గుంతలను ఖాళీగా వదిలేస్తున్నారు. భారీ విస్తీర్ణంలో సాగుచేస్తున్న రైతులు మాత్రం చెన్నై, పాండిచేరి తదితర ప్రాంతాల నుంచి సీడ్ తెప్పించుకుంటున్నారు. చిన్నాచితకా రైతుల్లో పలువురు స్థానిక హేచరీల్లోనే కొనుగోలు చూస్తూ ఇబ్బందులు పడుతూ ముందుకు సాగుతున్నారు. సీడ్ కోసం వెతుకులాట : సుమారు రెండు లక్షల రూపాయిలు ఖర్చు చేసి రెండెకరాల రొయ్యల చెరువు సిద్ధం చేసుకున్నాను. పది రోజుల క్రితమే చెరువులో నీళ్లు నింపినా నాణ్యమైన సీడ్ దొరకలేదు. మరో వైపు ఎండదెబ్బకు చెరువులో నీళ్లన్నీ ఆవిరైపోతుండటంతో మళ్లీమళ్లీ నీళ్లు కొట్టాల్సివస్తుంది. నాణ్యమైన వెనామీ పిల్లలను దొరక్కపోవడంతో చెరువు ఖాళీగా ఉంచాల్సి వచ్చింది. - సాంబయ్య, సిద్ధనపాళెం పది రోజుల నుంచి ప్రయత్నం : ఒకటిన్నర ఎకరాల రొయ్యల చెరువును పిల్లలు వదిలేందుకు సిద్ధం చేసుకున్నాం. నీళ్లలో సెలనిటీ, పీహెచ్ వంటివన్నీ బాగున్నాయి. క్వాలిటీ సీడ్ మాత్రం దొరకడం లేదు. పది రోజుల నుంచి మంచి పిల్లల కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు. -అన్నంగి బలరామయ్య, ఎస్వీపాళెం