ఆక్వా రైతుకు ‘సీడ్’ కష్టాలు | Aqua farmers 'seed' difficulties | Sakshi
Sakshi News home page

ఆక్వా రైతుకు ‘సీడ్’ కష్టాలు

Published Mon, Jun 16 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM

Aqua farmers 'seed' difficulties

బోగోలు మండలం సిద్ధవరపు వెంకటేశ్వరపాళేనికి ఓ ఆక్వా రైతు జిల్లాలోని ప్రముఖ హేచరీ నుంచి 25 రోజుల క్రితం మూడు లక్షల వెనామీ రొయ్య పిల్లలు కొనుగోలు చేశాడు. ఒక్కో పిల్లకు 80 పైసల వంతున చెల్లించాడు. రెండు ఎకరాల్లో వదిలిన ఈ పిల్లలు నాసిరకమైనవి కావడంతో ఎదుగుదల నిలిచిపోయింది. గుంటలో వదిలిన 25 రోజులకు కూడా వారం రోజుల పిల్లల్లానే ఉన్నాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన ఆ రైతు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నాడు.
 
 బోగోలు మండలంలోని సిద్ధనపాళేనికి చెందిన మరో రైతు 16 రోజుల క్రితం నెల్లూరుకు సమీపంలోని ఓ హేచరీ నుంచి లక్ష పిల్లలు కొనుగోలు చేసి ఎకరా విస్తీర్ణంలోని గుంటలో వదిలాడు. పిల్లల ఎదుగుదల మెరుగ్గానే ఉన్నా అన్నీ ఒకేలా లేవు. సుమారు 30 శాతం పిల్లల ఎదుగుదల నిలిచిపోవడంతో అనుభవజ్ఞుల సూచన మేరకు వేలాది రూపాయలు వెచ్చించి  వివిధ రకాల మందులు, మినరల్స్ వినియోగిస్తున్నాడు.
 
 కావలి/బిట్రగుంట : నాసిరకమైన సీడ్‌తో ఎదురవుతున్న ఇబ్బందులు బోగోలు మండల రైతులకే పరిమితం కాలేదు. జిల్లాలోని తీరప్రాంతంలో వెనామీ రొయ్యలు సాగుచేస్తున్న వేలాది మంది రైతులది ఇదే పరిస్థితి. ఇటీవల వరకు ఆక్వా రైతులకు కాసుల పంట పండించిన వెనామీ సాగును ప్రస్తుతం సమస్యలు చుట్టుముడుతున్నాయి. చి న్నా, చితకా  హేచరీలతో పాటు ప్రము ఖ హేచరీల్లో ఉత్పత్తి అవుతున్న సీడ్‌లో కూడా నాణ్యత కొరవడడంతో సాగుదారులు ఆర్థికంగా చితికిపోతున్నారు. గతంలో స్కాంపి, టైగర్ రొయ్యల హవా సాగిన రోజుల్లో జిల్లాలో హేచరీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. చివరకు కోళ్లఫారాలు కూడా హేచరీలుగా మారాయి. తర్వాత ఆ రొయ్యల సాగు సంక్షోభంలో చిక్కుకోవడంతో ఎక్కువ శాతం హేచరీలు మూతపడ్డాయి. గత మూడేళ్లుగా వెనామీ సాగు జోరందుకోవడంతో పలు హేచరీలు పలు ఉత్పత్తి ప్రారంభించా యి. ప్రస్తుతం జిల్లాలో సుమారు 50కి పైగా హేచరీలు వెనామీ రొయ్యపిల్లల ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే వీటిలో సగానికి కూడా అనుమతి లేదనేది బహిరంగ రహస్యమే. ఎక్కువ శాతం హేచరీలు నాసిరకమైన సీడ్ అంటగడుతూ రైతులను నిలువునా ముంచేస్తున్నాయి. చిన్నాచితకా హేచరీలతో పాటు కొన్ని ప్రముఖ హేచరీల నిర్వాహకులు కూడా మోసపూరిత చర్యలకు పాల్పడుతుండడం దురదృష్టకరం.
 
 మోసం చేసేదిలా..
 సాధారణంగా రొయ్య పిల్లల నాణ్యత తల్లి రొయ్యపై ఆధారపడి ఉంటుంది. ఒక్కో తల్లి రొయ్య నాలుగు దఫాలుగా గుడ్లు పెడుతుంది. తొలి రెండు దఫాల్లో పెట్టిన గుడ్ల నుంచి వచ్చిన పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉంటాయి. వీటిని హేచరీల నిర్వాహకులు తమ సొంత చెరువుల్లో వదలడంతో పాటు పెద్దరైతులకు మాత్ర మే విక్రయిస్తున్నాయి. ఇక మూడు, నాలుగు దఫాల్లో పెట్టిన గుడ్లతో ఉత్పత్తి చేసిన పిల్లలను సన్నకారు రైతులకు అంటగడుతూ ఒక్కో పిల్లకు 60 నుంచి 80 పైసలు వసూలు చేస్తున్నారు.
 
 హేచరీల్లో రొయ్య పిల్లల వయస్సును పీఎల్(పోస్ట్ లార్వా)గా పిలుస్తారు. లార్వా నుంచి పిల్ల బయటకు వచ్చిన రోజు నుంచి 20వ రోజు వరకూ పీఎల్1, పీఎల్ 2, అంటూ 20వ రోజుకు పీఎల్20గా లెక్కిస్తారు. పీఎల్ 15 (15 రోజుల పిల్ల) పిల్లలు గుంటల్లో వదిలేందుకు అనువుగా ఉంటాయి. హేచరీల నిర్వాహకులు మాత్రం పీఎల్ 10 పిల్లలను పీఎల్ 5, పీఎల్ 6 పిల్లల్లో కల్తీ చేస్తున్నా రు. వీటిని గుంతల్లో వదిలిన తర్వాత తక్కువ పీఎల్ ఉన్న పిల్లలు చనిపోతుం డగా ఎదుగుదలలో కూడా గణనీయమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
 
 భారీగా నష్టాలు
 పిల్లల పీఎల్ తేడాతో ఎదుగుదల నిలిచిపోతుండగా రైతులు మాత్రం ఇంకేదో లోపమని భావించి వేలాది రూపాయలు వెచ్చించి మందులు, మినరల్స్ వినియోగిస్తున్నారు. ఫలితంగా పెట్టుబడి భారీగా పెరిగి చివరకు నష్టాల పాలవుతున్నారు. మరోవైపు పలువురు రైతులు నాణ్యమైన సీడ్ లభించక గుంతలను ఖాళీగా వదిలేస్తున్నారు. మంచి సీడ్  కోసం జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాలోని హేచరీల్లో గాలించినా లభించడం లేదని చెబుతున్నారు. దీంతో వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగుకు సిద్ధం చేసిన గుంతలను ఖాళీగా వదిలేస్తున్నారు. భారీ విస్తీర్ణంలో సాగుచేస్తున్న రైతులు మాత్రం చెన్నై, పాండిచేరి తదితర ప్రాంతాల నుంచి సీడ్ తెప్పించుకుంటున్నారు. చిన్నాచితకా రైతుల్లో పలువురు స్థానిక హేచరీల్లోనే కొనుగోలు చూస్తూ ఇబ్బందులు పడుతూ ముందుకు సాగుతున్నారు.
 
 సీడ్ కోసం వెతుకులాట :
 సుమారు రెండు లక్షల రూపాయిలు ఖర్చు చేసి రెండెకరాల రొయ్యల చెరువు సిద్ధం చేసుకున్నాను. పది రోజుల క్రితమే చెరువులో నీళ్లు నింపినా నాణ్యమైన సీడ్ దొరకలేదు. మరో వైపు ఎండదెబ్బకు చెరువులో నీళ్లన్నీ ఆవిరైపోతుండటంతో మళ్లీమళ్లీ నీళ్లు కొట్టాల్సివస్తుంది. నాణ్యమైన వెనామీ పిల్లలను దొరక్కపోవడంతో చెరువు ఖాళీగా ఉంచాల్సి వచ్చింది.
 - సాంబయ్య, సిద్ధనపాళెం
 
 పది రోజుల నుంచి ప్రయత్నం :
 ఒకటిన్నర ఎకరాల రొయ్యల చెరువును పిల్లలు వదిలేందుకు సిద్ధం చేసుకున్నాం. నీళ్లలో సెలనిటీ, పీహెచ్ వంటివన్నీ బాగున్నాయి. క్వాలిటీ సీడ్ మాత్రం దొరకడం లేదు. పది రోజుల నుంచి మంచి పిల్లల కోసం ప్రయత్నిస్తున్నా  ఫలితం లేదు.
 -అన్నంగి బలరామయ్య,
 ఎస్వీపాళెం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement