మాట్లాడుతున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రాధాకృష్ణ
తిరుపతి క్రైం: రైతులకు అందించే రాయితీ విత్తనాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ పరిధిలోని చిత్తూరు జిల్లా ఏపీ సీడ్స్‌లో భారీ కుంభకోణం వెలుగుచూసింది. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ నోడల్ ఏజెన్సీ ముసుగులో ఏపీ సీడ్స్‌లో రూ.13.36 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులు స్వాహా అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తిరుపతి ఎస్పీ పీవీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటకు వచ్చింది. ఆ వివరాలను సోమవారం తిరుపతి విజిలెన్స్‌కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. ఆయన కథనం మేరకు.. ఏపీఎస్‌ఎస్‌డీసీ సబ్సిడీపై రైతులకు అందించే విత్తనాలను మొదట ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ధ్రువీకరిస్తుంది. దీని ప్రకారం సీడ్ ఆర్గనైజర్స్ (మధ్యవర్తులు) నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తుంది. ఈ మధ్యవర్తులు నాణ్యమైన విత్తనాలను పండించేందుకు కొంతమంది స్థానిక రైతుల భూములను రిజిస్టర్ చేసుకుని అందులోనే విత్తనాలు పండిస్తారు. వాటిని ఉత్పత్తి చేసే సమయంలో అధికారులు మూడు పర్యాయాలు పరిశీలించిన అనంతరం సర్టిఫైడ్ సీడ్స్‌గా ఆ విత్తనాలకు గుర్తింపును ఇస్తూ ట్యాగ్ వేస్తారు. వీటినే రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది.
కుంభకోణం ఇలా..
రబీ సీజన్ ద్వారా 2017–18లో సీడ్ ఆర్గనైజర్ (మధ్యవర్తుల) ద్వారా విత్తనాలను సేకరించి 2018 ఖరీఫ్ సీజన్‌లో జిల్లా ఏపీ సీడ్స్ రైతులకు అందించారు. అయితే ఇందులో తేడా జరిగినట్లు రాష్ట్ర అధికారులు భావించారు. దీంతో చిత్తూరు జిల్లా ఏపీ సీడ్స్ సిబ్బందిని, రైతులను విచారించారు. ఈ తనిఖీల్లో ఖరీఫ్ సీజన్‌కు 54,745 క్వింటాళ్లను రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అందించినట్లు గుర్తిం చారు. ఇందులో ఒక కేజీ రూ.61 చొప్పున ఏపీఎస్‌ఎస్‌సీఏ మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేసిందని తేలింది. కాగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అందజేసిన ఈ ధరలో 40శాతం అంటే రూ.24.40 ప్రభుత్వం రాయతీ ఇవ్వగా, రూ.36ను రైతుల నుంచి వసూలు చేశారు. ఇలా ప్రతి రైతుకూ 30 కేజీల విత్తనాలను ఇచ్చారు.
అయితే వ్యవసాయశాఖ అందించిన ఈ విత్తనాలకు వేసిన ట్యాగు తేడా ఉండడంతో దాని ఆధారంగా కుంభకోణంపై విజిలెన్స్ శాఖ తనిఖీలు చేసింది. ఇందులో సీడ్ ఆర్గనైజర్స్ (మధ్యవర్తులు) అసలు రైతుల వద్ద నాణ్యమైన విత్తనాలనే పండించలేదని, ఆ విత్తనాలను సీడ్ సర్టిఫికేషన్స్ (గుర్తింపునిచ్చే) అధికారులు అసలు పరిశీలించలేదని స్పష్టమైంది. కాగా ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి చెందిన రూ.13.36 కోట్లు నిధులు సీడ్ ఆర్గనైజర్స్ అవినీతికి పాల్పడినట్టు గుర్తించారని ఆయన తెలిపారు. ఇందుకోసం జిల్లాలో 822 మంది రైతుల నుంచి వివరాలు సేకరించామన్నారు. కాగా కేవలం చిత్తూరు జిల్లాలోనే ఇంత పెద్దమొత్తంలో అవినీతి జరిగితే, రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఇదే స్థాయిలో మధ్యవర్తులు అవినీతికి పాల్పడితే ఏంటి పరిస్థితి అని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అదించనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో విజిలెన్స్ సీఐలు, అంజుయాదవ్, మద్దెయ్యాచ్చారి, టి.అబ్బన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment