భర్త ఫొటో పట్టుకొని దీనంగా కూర్చున్న స్వరూప
సదాశివపేట మండలం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: భర్త ఫొటో పట్టుకొని దీనంగా కూర్చున్న ఈమె పేరు స్వరూప. పక్కనుంది ఆమె అత్త, కొడుకు. వీరిది సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగులపల్లి. బీజీ–3 పత్తి ఈ ఇంటి దీపాన్ని ఆర్పివేసింది. స్వరూప భర్త రాజు ఈ ఏడాది తనకున్న నాలుగెకరాలకుతోడు మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. విత్తన డీలర్ బీజీ–2 పత్తి విత్తన ప్యాకెట్ పేరుతో బీజీ–3 విత్తనాలు ఇచ్చాడు. చెట్టు ఎదిగింది కానీ పూత, కాత రాలేదు. ఆ దిగులుతో రాజు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న భర్తను బతికించుకునేందుకు స్వరూప రూ.6 లక్షలు అప్పు చేసి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.
ఇలా ఒక్కరిద్దరు కాదు.. తెలంగాణలో ఎందరో రైతుల్ని బీజీ–3 మింగేసింది. వారి బతుకులను ఛిన్నాభిన్నం చేసింది. రాష్ట్రంలో లక్షల మంది రైతులు వారికి తెలియకుండానే కార్పొరేటు విత్తన కంపెనీల ప్రయోగాలకు సమిధలయ్యారు. బహుళజాతి విత్తన సంస్థలు రాష్ట్రంలోకి రహస్యంగా ప్రవేశపెట్టిన జన్యు మార్పిడి పత్తి వంగడం బీజీ–3ని సాగు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు. దిగుబడి వచ్చే సెప్టెంబర్–డిసెంబర్ మధ్య కాలంలోనే రాష్ట్రంలో అనధికారికంగా 300 మంది రైతులు చనిపోయారు. సంగారెడ్డి జిల్లాలోని ఒక్క సదాశివపేట మండలం లోనే ఆ ఆరు నెలల కాలంలో ఆరుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పత్తి విత్తనాలను అనధికారికంగా బీజీ3 (బోల్‌గార్డు 3) పేరుతో పిలుస్తున్నారు. అనధికారిక డీలర్లు, ప్రత్యేక ఏజెంట్ల ద్వారా విత్తన కంపెనీలు రాష్ట్రంలో దాదాపు 13 లక్షల ఎకరాల్లో బీజీ–3ని సాగుచేయించినట్లు తేలింది.
రైతులు తమకు తెలియకుండానే కంపెనీల మాయాజాలంలో చిక్కి తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యల పాలవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించినా బోల్‌గార్డు 3 పత్తి రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగైంది. రాష్ట్రంలో ఏకంగా 2,500 గ్రామాల్లో దీన్ని సాగు చేసినట్లు అఖిల భారత కిసాన్ సంఘం, తెలంగాణ రైతు సంఘాలు చేసిన పరిశీలనలో తేలింది. దాదాపు తొమ్మిది లక్షల మంది రైతులు 13 లక్షల ఎకరాల్లో ఈ పత్తిని సాగు చేశారు. పంట వేసిన చోటల్లా మొక్కలు 6 నుంచి 7 అడుగులు పెరిగి పూత, కాత లేకుండా గిడసబారిపోయాయి. ఎకరం చేనులో కేవలం 50 కిలోల నుంచి క్వింటాల్ లోపే దిగుబడి వచ్చింది. రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో 1.5 లక్షలు, నల్లగొండ 1.5 లక్షలు, అదిలాబాద్‌లో లక్ష, వరంగల్ 1.5 లక్షల ఎకరాల్లో బీజీ–3ని సాగు చేసినట్లు రైతు సంఘాలు అంచనా వేశాయి. కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో మోస్తరు స్థాయిలో సాగైంది.
విత్తం వారిదే.. విత్తనం వారిదే..
అదును రాగానే రైతులు గ్రామంలోని షావుకార్ల వద్దనో.. విత్తన వ్యాపారుల వద్దనో అప్పు కింద విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తారు. పంట వచ్చినప్పుడు అప్పు తీర్చేలా ఒప్పందం చేసుకుంటారు. ఎలాగూ అప్పు ఇస్తున్నారు కాబట్టి వ్యాపారి ఇచ్చిన విత్తనాలనే రైతులు తీసుకుంటున్నారు. వీటికి ఎలాంటి రశీదులు ఉండవు. విత్తన డీలర్ నిబంధనల ప్రకారం ఒక పత్తి విత్తన ప్యాకెట్ అమ్మితే రూ 25–30 లాభం వస్తుంది. కానీ అదే బీజీ–3 విత్తన ప్యాకెట్‌ను రైతుకు విక్రయిస్తే రూ రూ.500, అదే లూజ్‌గా విక్రయిస్తే కిలోకు రూ.1,200 చొప్పున ఆదాయం సమకూరుతోంది. వీళ్లంతా రైతులకు అక్రమ విత్తనాలు అంటగట్టారు. ‘సాక్షి’సేకరించిన వివరాల ప్రకారం గ్రామాల్లో ప్రతి 100 మంది రైతుల్లో 47 మంది మండల కేంద్రాల్లోని అధికారిక విత్తన దుకాణల నుంచి విత్తనాలు తీసుకుంటుండగా.. 53 మంది షావుకార్లు, ఇతర వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు కింద విత్తనాలు తీసుకున్నారు. బ్యాంకులు అవసరమైన సమయంలో రుణాలు ఇవ్వకపోవటంతో రైతులు ఇలా వడ్డీ వ్యాపారులు, విత్తన వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
రైతులు రాలిపోతున్నారిలా..
సదాశివపేట మండలంలోని నిజాంపూర్‌లో నిరుడు సెప్టెంబర్‌లో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత మూడు నెలల వ్యవధిలోనే మరో అయిదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరందరికి సొంత భూమి కొంతే ఉండగా.. ఎక్కువ విస్తీర్ణాన్ని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశారు. ఎకరాకు 12 నుంచి 14 క్వింటాళ్లు పండే భూముల్లో ఈసారి నాలుగు క్వింటాళ్లు మించి దిగుబడి రాలేదు. కౌలు డబ్బులను ముందే చెల్లించిన రైతులు.. వచ్చిన కాస్త దిగుబడిని అమ్మినా చేతికి చిల్లిగవ్వ రాలేదు. అప్పులు గుదిబండలా మారడంతో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు తీసుకుంటున్నారు. పంట నష్టపోయి ఈ నెల 4న రైతు నాగేశ్వర్ పురుగుల మందు తాగి ప్రాణాలొదిలాడు.
నాగ్‌సాన్‌పల్లికి చెందిన కిష్టయ్య 2016 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. నిజాంపూర్ గ్రామానికి చెందిన బాలయ్య(45), ఇదే గ్రామానికి చెందిన బోడ పాపయ్య బలవన్మరణం చెందారు. ఇదే ఇదే మండలం వెంకటాపూర్‌కు చెందిన అంబాదాస్ (24) మూడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. తీవ్ర నష్టం రావడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు చావులను నివారించే దిశగా కనీస చర్యలకు ఉపక్రమించని అధికారులు.. కనీసం బాధిత కుటుంబాలను ఆదుకునే విషయంలోనూ మానవత్వంతో వ్యవహరించటం లేదు.
ఈమె పేరు అంజమ్మ. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం బొబ్బిలిగామ. భర్త ఉండగా బాగా బతికిన కుటుంబం. ఈమె భర్త శ్రీశైలంను జీ3 పత్తి మింగింది. ఆయన తనకు ఉన్న రెండెకరాలకు తోడు మరో 22 ఎకరాలు కౌలు తీసుకున్నాడు. మొత్తం 24 ఎకరాల్లో తనకు తెలియకుండానే బీజీ 3 వేశాడు. ఆశించిన దిగుబడి రాలేదు. అప్పులు కట్టలేక రెండు నెలల కింద చేనులోనే చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment