Seethamma Andalu Ramayya Sitralu
-
నేను మోడ్రన్ సీతను!
జర్నలిజం చదువుతూ సెల్యులాయిడ్‌పైకి అడుగుపెట్టారు అర్తన. రాజ్‌తరుణ్ సరసన ఆమె నటించిన ‘ సీతమ్మ అందాలు... రామయ్య సిత్రాలు ’ ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రం గురించి అర్తన చెప్పిన ముచ్చట్లు... * మాది కేరళ. సోషల్ మీడియాలో నా ప్రొఫైల్ చూసిన ఓ కాస్టింగ్ ఏజెంట్ నన్ను కలిశారు. స్వతహాగా నాకూ సినిమాలపై ఆసక్తి ఉండటంతో ఆడిషన్స్‌కి వచ్చా. కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశా. * ఈ చిత్రంలో నా పాత్ర పేరు సీతా మహాలక్ష్మి. నా పాత్రను మోడ్రన్ సీతగా అభివర్ణించవచ్చు. పల్లెటూరి నేపథ్యంలో జరిగే కథ ఇది. ఈ చిత్రంతో నటనకు సంబంధించి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభించింది. * సినిమా అంటే కేవలం గ్లామర్ రంగం అనే అభిప్రాయం ఉండేది. ఇక్కడికొచ్చాక సినిమా కోసం ఎంత కష్టపడాలో తెలిసింది. షూటింగ్ ప్రారంభంలో భాషాపరమైన ఇబ్బంది తలెత్తినా ఇప్పుడు తెలుగు అర్థం చేసుకుంటున్నా. త్వరలోనే తెలుగులో మాట్లాడతాను. నటన, డైలాగ్స్ విషయంలో రాజ్ తరుణ్ చక్కటి సహకారం అందించారు. * గ్లామర్ పాత్రలంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి పాత్రలు నాకు అసౌకర్యంగా అనిపిస్తాయి. అందుకే వాటికి దూరంగా ఉందామనుకుంటున్నా. * తెలుగు చిత్రాలు చూస్తుంటాను. నాగార్జున, అల్లు అర్జున్‌లను బాగా అభిమానిస్తా. నేను హీరోయిన్గా నటించిన మలయాళ చిత్రం ‘ముతుగావు’ త్వరలో విడుదల కానుంది. -
రామయ్య సిత్రాలు చూతము రారండి!
చిన్నతనంలో టీవీలో సచిన్‌ను చూశాడు. క్రికెటర్ కావాలనుకున్నాడు. ఆ తర్వాత పవన్‌కల్యాణ్ నచ్చాడు. హీరో అయితే బాగుంటుందనుకున్నాడు. అయితే ఎన్ని మారినా పసివయసులో సీతను చూశాక తనకు కలిగిన ఫీలింగ్‌ను మార్చుకోలేదు. అదే సీతకు మొగుడైపోవాలని. ఆవారా అనే పదానికి కేరాఫ్ అడ్రస్‌లా ఉండే మనోడు... అచ్చమైన పల్లెటూరి పడుచు అందానికి అద్దంలా ఉండే ఈ సీత మనసును ఎలా గెలుచుకున్నాడనేదే ‘సీతమ్మ అందాలు...రామయ్య సిత్రాలు’ సినిమా అంటున్నారు రాజ్‌తరుణ్. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్‌తరుణ్, అర్తన జంటగా ఎస్.శైలేంద్రబాబు, కేవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘సున్నితమైన భావోద్వేగాలు, చక్కని వినోదంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. సరికొత్త కథాకథనాలతో రూపొందిన ఈ చిత్రంలో భారీ ఖర్చుతో తీసిన పతాక సన్నివేశాలు హైలైట్ ’’ అని పేర్కొన్నారు. ‘‘ ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది. సంగీత దర్శకుడు గోపీ సుందర్ అందించిన బాణీలు అలరిస్తున్నాయి. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది ’’ అని దర్శకుడు పేర్కొన్నారు. -
అతనికి వెటకారం... ఇతనికి మమకారం
‘‘శైలేంద్ర ప్రొడక్షన్స్‌లో సంస్కారం ఎక్కువ. దర్శకుడు గవిరెడ్డి కథల్లో వెటకారం ఉంటుంది. రాజ్ తరుణ్‌లో మమకారం ఎక్కువ. ఇలాంటి మంచి సినిమాలో నేను భాగస్వామ్యం అవడం ఆనందంగా ఉంది ’’ అన్నారు ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్. రాజ్‌తరుణ్, అర్తన జంటగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్. శైలేంద్ర బాబు, కేవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మించిన చిత్రం ‘సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు’. గోపీ సుందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. పాటల సీడీని ఎన్. శంకర్ ఆవిష్కరించి, నిర్మాత అనిల్ సుంకరకు అందించారు. ట్రైలర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. ‘‘హృద్యమైన ప్రేమకథగా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ నెలాఖరున చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఎన్. శంకర్ చేసిన పాత్ర ఇందులో ప్రత్యేక ఆకర్షణ’’ అని నిర్మాతలు తెలిపారు. ‘‘పురాణాల్లో సీతమ్మ కోసం రాముడు శివధనుస్సు ఎత్తాడు. ఈ సినిమాలో సీతమ్మ కోసం రాముడు ఏం చేశాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోలు మంచు విష్ణు, సుశాంత్, ఆది, బెల్లంకొండ శ్రీనివాస్, రాహుల్ రవీంద్రన్, దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, పల్నాటి సూర్యప్రతాప్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, మదన్, నిర్మాతలు లగడపాటి శ్రీధర్, మల్కాపురం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘సీతమ్మ అందాలు- రామయ్య సిత్రాలు’ మూవీ స్టిల్స్