రామయ్య సిత్రాలు చూతము రారండి!
చిన్నతనంలో టీవీలో సచిన్‌ను చూశాడు. క్రికెటర్ కావాలనుకున్నాడు. ఆ తర్వాత పవన్‌కల్యాణ్ నచ్చాడు. హీరో అయితే బాగుంటుందనుకున్నాడు. అయితే ఎన్ని మారినా పసివయసులో సీతను చూశాక తనకు కలిగిన ఫీలింగ్‌ను మార్చుకోలేదు. అదే సీతకు మొగుడైపోవాలని. ఆవారా అనే పదానికి కేరాఫ్ అడ్రస్‌లా ఉండే మనోడు... అచ్చమైన పల్లెటూరి పడుచు అందానికి అద్దంలా ఉండే ఈ సీత మనసును ఎలా గెలుచుకున్నాడనేదే ‘సీతమ్మ అందాలు...రామయ్య సిత్రాలు’ సినిమా అంటున్నారు రాజ్‌తరుణ్.
శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో రాజ్‌తరుణ్, అర్తన జంటగా ఎస్.శైలేంద్రబాబు, కేవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘సున్నితమైన భావోద్వేగాలు, చక్కని వినోదంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. సరికొత్త కథాకథనాలతో రూపొందిన ఈ చిత్రంలో భారీ ఖర్చుతో తీసిన పతాక సన్నివేశాలు హైలైట్ ’’ అని పేర్కొన్నారు. ‘‘ ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది. సంగీత దర్శకుడు గోపీ సుందర్ అందించిన బాణీలు అలరిస్తున్నాయి. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది ’’ అని దర్శకుడు పేర్కొన్నారు.