అతనికి వెటకారం... ఇతనికి మమకారం
‘‘శైలేంద్ర ప్రొడక్షన్స్‌లో సంస్కారం ఎక్కువ. దర్శకుడు గవిరెడ్డి కథల్లో వెటకారం ఉంటుంది. రాజ్ తరుణ్‌లో మమకారం ఎక్కువ. ఇలాంటి మంచి సినిమాలో నేను భాగస్వామ్యం అవడం ఆనందంగా ఉంది ’’ అన్నారు ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్. రాజ్‌తరుణ్, అర్తన జంటగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్. శైలేంద్ర బాబు, కేవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మించిన చిత్రం ‘సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు’. గోపీ సుందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. పాటల సీడీని ఎన్. శంకర్ ఆవిష్కరించి, నిర్మాత అనిల్ సుంకరకు అందించారు. ట్రైలర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేశారు.
‘‘హృద్యమైన ప్రేమకథగా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ నెలాఖరున చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఎన్. శంకర్ చేసిన పాత్ర ఇందులో ప్రత్యేక ఆకర్షణ’’ అని నిర్మాతలు తెలిపారు. ‘‘పురాణాల్లో సీతమ్మ కోసం రాముడు శివధనుస్సు ఎత్తాడు. ఈ సినిమాలో సీతమ్మ కోసం రాముడు ఏం చేశాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది’’ అని దర్శకుడు అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరోలు మంచు విష్ణు, సుశాంత్, ఆది, బెల్లంకొండ శ్రీనివాస్, రాహుల్ రవీంద్రన్, దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, పల్నాటి సూర్యప్రతాప్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, మదన్, నిర్మాతలు లగడపాటి శ్రీధర్, మల్కాపురం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.