కెప్టెన్‌గా రోహిత్ సరే.. వైస్ కెప్టెన్‌గా రాహుల్, పంత్‌ల కంటే అతనైతేనే బెటర్..!
Virender Sehwag Picks Jasprit Bumrah As Team India Vice Captain: టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో వైస్ కెప్టెన్‌గా ఎవరుంటారనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు మాజీలు, విశ్లేషకులేమో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌ల పేర్లు ప్రతిపాధిస్తుండగా.. టీమిండియా మాజీ ఓపెనర్, డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరును తెరపైకి తెస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత పరిమిత ఓవర్ల జట్టు ఉప సారధిగా రాహుల్, పంత్‌ల కంటే బుమ్రానే బెటర్ ఛాయిస్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు బుమ్రా ఏ టీ20 జట్టుకు నాయకత్వం వహించకపోయినా బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తున్నాడని, మూడు ఫార్మాట్లలో నిలకగా ఆడే వారినే కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా నియమిస్తారు కాబట్టి బుమ్రా కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్‌గా, వైస్ కెప్టెన్‌గా ఇప్పటివరకూ ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేయలేదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని టీమిండియా వైస్ కెప్టెన్‌గా బుమ్రాను ఎంపిక చేయాలని డిమాండ్ చేశాడు.
కాగా, ఇటీవలే భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా సైతం ఇంచుమించు ఇలాంటి ప్రతిపాదననే చేయగా, సెహ్వాగ్.. నెహ్రా ఛాయిస్‌ను సమర్ధిస్తూ బుమ్రాకు మద్దతు పలికాడు. టీమిండియా కెప్టెన్‌గా బౌలర్ ఉండకూడదని ఏ రూల్ బుక్లోనైనా రాసుందా అంటూ ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోహ్లి స్థానాన్ని ఫాస్ట్ బౌలర్‌తో భర్తీ చేయాలని నెహ్రా డిమాండ్ చేశాడు.
చదవండి: పొట్టి క్రికెట్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన భారత్-పాక్ మ్యాచ్