ఆత్మరక్షణపై మహిళలకు వర్క్‌షాప్
న్యూఢిల్లీ: ‘మీపై ఎవరైనా దాడి చేస్తే భయపడకండి. వెంటనే కళ్లు తదితర సున్నిత భాగాలపై కొట్టండి. చిమ్మచీకటిగా ఉండే ప్రాంతాల్లో సంచరిస్తాల్సి వస్తే మీ వెంట పెప్పర్ స్త్రేని ఉంచుకోండి. ప్రతిఘటించేందుకు పిడికిళ్లను ఉపయోగించకండి. మోకాళ్లను మాత్రమే వినియోగించండి’ ఇలా అనేక విలువైన సలహాలు, సూచనలను నిపుణులు మహిళలకు తెలియజేశారు. మహిళల భద్రతకు సంబంధించి మంగళవారం నగరంలో మంగళవారం ఓ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ‘ఉమెన్ సేఫ్టీ అండ్ సర్వైవల్’ పేరిట ఈ కార్యక్రమం అమెరికాకు చెందిన ఓ సంస్థ సహకారంతో స్థానిక స్వచ్ఛంద నేతృత్వంలో జరిగింది. ‘ఓ మహిళపై దాడి జరిగినపుడు ఏవిధంగా ప్రతిఘటించాలో ఆమెకు తెలియదు. అందువల్ల వారికి తగు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’అని స్ట్రీట్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రాం (ఎస్ఎల్ఏపీ) సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు మృగంకా దడ్వాల్ పేర్కొన్నారు.
ఏ క్షణంలోనైనా దాడికి గురికావచ్చనీ, దానిని తిప్పికొట్టేందుకు సన్నద్ధంగా ఉండాలని హితవు పలికారు. ఇటువంటి శిక్షణ పొందినట్టయితే వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందన్నారు. ‘నాపై దాడి జరగదనే ధీమా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఒకవేళ దాడి జరిగితే పెప్పర్ స్ప్రేని ఎలా ఉపయోగిస్తాననే అంశం నాకు బాగా ఆశ్చర్యం కలిగించింది’ అని ఈ కార్యక్రమానికి హాజరైన వాణి మెహతా పేర్కొంది. మరో మహిళ దడ్వాల్ మాట్లాడుతూ సరైన సమయంలో సరయిన విధంగా వ్యవహరించాలి. చిమ్మచీకటిగా ఉండే ప్రాంతంలో వెళ్లాల్సి వచ్చినపుడు పెప్పర్ స్ప్రేని ఉంచుకోవాలి. అది ఎంతగానో ఉపయోగపడుతుంది.’అని పేర్కొంది.