బెయిల్ లేదు.. పెరోల్ లేదు
న్యూఢిల్లీ: నాలుగు నెలలుగా తీహార్ జైలులో నిర్బంధంలో ఉన్న సహారా చీఫ్ సుబ్రతారాయ్ కు విముక్తి కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయనకు బెయిల్ లేదా పెరోల్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. న్యూయార్క్, లండన్ లో ఉన్న సహారా హోటళ్లను అమ్మేందుకు లేదా తనఖా పెట్టేందుకు న్యాయస్థానం అనుమతి మంజూరు చేసింది.
ఎక్కడ, ఎప్పుడు ఆస్తులు అమ్మేందుకు సంప్రదింపులు జరిపినా పోలీసుల పర్యవేక్షణలోనే జరగాలని సుబ్రతారాయ్ ను ఆదేశించింది. ఆస్తుల అమ్మకానికి సంబంధించి జైలు వెలుపల క్లయింట్లతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పోలీసుల పర్యవేక్షణలో సంప్రదింపులు కొనసాగించొచ్చని తెలిపింది. తనకు ‘దయతో’ తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలని సుబ్రతారాయ్ సుప్రీంకోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే.