Sellur K Raju
-
మరో మంత్రికి కరోనా పాజిటివ్
సాక్షి, చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. తాజాగా రాష్ట్ర కేబినెట్లోని సహకార శాఖ మంత్రి సెల్లూరు కె. రాజుకు శుక్రవారం రోజున కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. దీంతో ఆయన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. దీనిపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. మంత్రితో ఫోన్లో మాట్లాడానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అయితే తమిళనాడు కేబినెట్లో గతంలో విద్యుత్ శాఖ మంత్రి పి. తంగమణి, ఉన్నత విద్యాశాఖ మంత్రి పి. అన్బళగన్‌కు కరోనా నిర్ధారణ అయ్యింది. తాజాగా సెల్లూర్ కె. రాజుకు కరోనా పాజిటివ్ రావడంతో సహచరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాగా తమిళనాడులో ఇప్పటివరకు ముగ్గురు మంత్రులు, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. చదవండి: కరోనా నియంత్రణకు రంగంలోకి కమాండోలు -
ఆయనకు వయసైపోయింది!
పెరంబూరు: సెల్లూర్ రాజుకు వయసైపోయ్యిందని నటి, అఖిలభారత కాంగ్రెస్ పార్టీ ప్రచార కర్త కుష్బూ అన్నారు. ఆమె ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా పాల్గొనడం లేదు. కుష్బూ తమిళనాడు కాంగ్రెస్ పార్టీలో నాయకుడు అని చెప్పుకునే ఏకైన వ్యక్తి ఈవీకే.ఇళంగోవన్. ఆయన కోసం ఆయన పోటీ చేస్తున్న కోవైలో కుష్బూ ప్రచారం చేశారు. అలా ఉచలంపట్టిలో నిర్వహించిన ప్రచారసభలో కుష్బూ ఆన్నాడీఎంకే నాయకులపై ఆరోపణలు గుప్పించారు. దీంతో కుష్బూ ఆరోపణలకు ఎదురుదాడి చేసిన అన్నాడీఎంకే మంత్రి సెల్లూర్ రాజు వైగై నదిలో పెరుమాళ్( వేంకటేశ్వరస్వామి)కి స్నానం చేయించినా జనం వస్తారని అన్నారు. కాగా నటీనటుల ప్రచారానికి వచ్చే జనం ఓట్లుగా మారవని అన్నారు. అదే విధంగా నటి కుష్బూపైనా ఆరోపణలు చేశారు. కుష్బూకు వయసైపోయ్యిందన్నారు, ఆమె ఒంటి రంగు గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు ట్విట్టర్లో స్పందించిన నటి కుష్బూ మన అన్నాడీఎంకే జ్ఞాని సెల్లూర్ రాజుకు వయసైపోయ్యిందన్నది బాగా తెలుస్తోందని పేర్కొన్నారు. పాపం ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. అయినా తన ప్రచారానికి వస్తున్న జనం గురించి ఆయన గమనించడం గర్వంగా ఉందన్నారు. 30 ఏళ్ల తరువాత కూడా ఇలా చేయగలుగుతున్నానంటే అది తమి ళ ప్రజల గొప్పేనని నటి కుష్బూ పేర్కొన్నారు. -
స్లీపర్ సెల్స్.. పని ఆరంభం!
సాక్షి, చెన్నై: సహకార మంత్రి సెల్లూరు కే రాజు వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో ఆదివారం రచ్చకెక్కాయి. చిన్నమ్మ శశికళ జపం అందుకుంటూ, ఆమె దయే ఈ ప్రభుత్వం, ఈ పదవీ అని వ్యాఖ్యానించి సీఎం పళని స్వామికి షాక్ ఇచ్చారు. దీంతో స్లీపర్ సెల్స్ తమ పని మొదలెట్టారంటూ దినకరన్ శిబిరం దూకుడు పెంచే పనిలో పడడం గమనార్హం. సీఎం పళని స్వామికి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగుర వేసిన దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడ్డ విషయం తెలిసిందే. 18 మందిపై వేటు వేసినా, ప్రభుత్వంలో ఉన్న స్లీపర్ సెల్ మంత్రులు, ఎమ్మెల్యే మరికొందరు తమ పని ఏదో ఒకరోజు మొదలెట్టడం ఖాయం అని దినకరన్ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అందరూ తమ వాళ్లేనని, అయితే, వారిని భయ పెట్టి, బెదిరించి దారిలోకి తెచ్చుకుని ఉన్నట్టు ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సహకార మంత్రి సెల్లూరు రాజు తన మదిలో మాటను బయట పెట్టడం సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలకు షాక్ తగిలేలా చేసింది. చిన్నమ్మ జపం అందుకోవడంతో పాటు అన్నీ ఆమె దయే అని సెల్లూరు రాజు వ్యాఖ్యల్ని అందుకోవడం చర్చకు దారితీశాయి. అన్నీ చిన్నమ్మే సహకార మంత్రి సెల్లూరు రాజు మీడియాతో మాట్లాడుతూ, చిన్నమ్మ శశికళ ప్రస్తావనను తీసుకొచ్చారు. అన్నాడీఎంకే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం వెనుక చిన్నమ్మ కృషి ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. అలాగే, ప్రస్తుతం ఈ ప్రభుత్వం మనుగడలో ఉందంటే, అందుకు కారణం కూడా ఆమే అని స్పందించారు. చిన్నమ్మ లేకుండా ఉండి ఉంటే, ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉండేది కాదేమోననంటూ, సీఎం పళని స్వామి గానీయండి, తాను గానీయండి ఈ పదవిలో ఉన్నామంటే అందుకు చిన్నమ్మ కారణం అని, ఇందులో ఎలాంటి మార్పు అన్నది లేదని సెల్లూరు రాజు స్పందించడం సీఎం పళని, డిప్యూటీ పన్నీరు శిబిరానికి షాక్ తగిలేలా చేసింది. ఈ వ్యవహారం కాస్త చర్చకు దారితీసినా, మంత్రి మాత్రం వెనక్కు తగ్గకపోవడం గమనార్హం. అదే సమయంలో మరో మంత్రి వెల్లమండి నటరాజన్ మీడియాతో మాట్లాడుతూ, అమ్మ జయలలితకు అందిన చికిత్స, నటరాజన్‌కు అందుతున్న చికిత్స గురించి ప్రస్తావిస్తూ, అది వేరు, ఇది వేరు అని, చిన్నమ్మ శశికళను ఎవరూ కలవబోరని వ్యాఖ్యానించారు. కాగా, చిన్నమ్మ రాకతో మంత్రులు ఆమె పేరును ఏదో ఒక సందర్భంగా స్మరించే రీతిలో వ్యాఖ్యల్ని అందుకోవడం గమనార్హం. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో దినకరన్ శిబిరం వర్గాలు మాత్రం దూకుడుగా స్పందించే పనిలో పడ్డారు. స్లీపర్ సెల్స్ ఒకొక్కకరుగా బయటకు వస్తున్నారని, అన్నీ చిన్నమ్మకు అనుకూలంగానే పరిణామాలు ఉంటాయని, పళని, పన్నీరులకు మున్ముందుకు షాక్‌ల మీద షాక్‌లు ఎదురు కాబోతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంగా దినకరన్ శిబిరానికి చెందిన మహిళా నేత సీఆర్ సరస్వతి మీడియాతో మాట్లాడుతూ, స్లీపర్ సెల్స్ ఆట ఆరంభం అని వ్యాఖ్యానించడం గమనించాల్సిందే. -
మంత్రి వ్యాఖ్యలతో కలకలం
సాక్షి,చెన్నై:తమిళనాడు మంత్రి సెల్లూర్ రాజు చేసిన వ్యాఖ్యలు పాలక ఏఐఏడీఎంకేలోని ఓపీఎస్, ఈపీఎస్ గ్రూపుల్లో కలకలం రేపాయి. అమ్మ(జయలలిత) ప్రభుత్వం మెరుగైన పాలన అందించేందుకు చిన్నమ్మ(శశికళ) కష్టపడి పనిచేశారని వ్యాఖ్యానించారు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం అన్నారు. ఆయన వ్యాఖ్యలతో తమిళనాడు సర్కార్‌కు సారథ్యం వహిస్తున్న ఏఐఏడీఎంకేలోని ఇరు వర్గాలూ షాక్‌కు గురయ్యాయి. సీఎం పళనిస్వామికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మంత్రి రాజు చిన్నమ్మను పొగడటం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అవినీతి కేసులో జైలు పాలయిన శశికళతో విభేదిస్తూ అత్యధిక ఎంఎల్ఏలను తమవైపు తిప్పుకోవడంలో పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు విజయం సాధించారు.అయితే మంత్రి వ్యాఖ్యలపై పళని, పన్నీర్ వర్గాలు ఇప్పటివరకూ నోరుమెదపలేదు. చెన్నైలో చికిత్స పొందుతున్న తన భర్తను పరామర్శించేందుకు పెరోల్‌పై శశికళ బయటకు వచ్చిన నేపథ్యంలో ఏఐఏడీఎంకేలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. మరోవైపు పెరోల్ సమయంలో చిన్నమ్మను కలిసేందుకు వెనుకాడబోనని మరో మంత్రి ఓఎస్ మణియన్ ఇటీవల పేర్కొన్నారు. -
మంత్రి కార్యాలయంపై పెట్రో బాంబుతో దాడి
చెన్నై: తమిళనాడులోని మదురై నగర వాసులను పెట్రో బాంబులు వణికిస్తున్నాయి. గుర్తుతెలియని దుండగులు పలు ప్రాంతాల్లో ప్రముఖుల ఇళ్లపై పెట్రో బాంబులతో దాడులు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు మంత్రి సెల్లూరు కే రాజు కార్యాలయంపై పెట్రో బాంబులు విసిరారు. ఈ దాడిలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. ఇటీవలి కాలంలో పెట్రో బాంబులతో దాడి చేయడమిది ఆరోసారి. వరుసగా దాడులు జరుగుతుండటం పోలీసులకు సవాల్‌గా మారగా, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మదురైలోని ప్రఖ్యాత మీనాక్షి దేవాలయం సమీపంలో పెట్రోలు బాంబులు వేయడం కలకలం సృష్టించింది. అగంతకులు రెండు గంటల వ్యవధిలో మూడు పెట్రోల్ బాంబులు విసిరారు. పేలుడు శబ్దం వినపడడంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు.