సాక్షి, చెన్నై: సహకార మంత్రి సెల్లూరు కే రాజు వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో ఆదివారం రచ్చకెక్కాయి. చిన్నమ్మ శశికళ జపం అందుకుంటూ, ఆమె దయే ఈ ప్రభుత్వం, ఈ పదవీ అని వ్యాఖ్యానించి సీఎం పళని స్వామికి షాక్ ఇచ్చారు. దీంతో స్లీపర్ సెల్స్ తమ పని మొదలెట్టారంటూ దినకరన్ శిబిరం దూకుడు పెంచే పనిలో పడడం గమనార్హం. సీఎం పళని స్వామికి వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగుర వేసిన దినకరన్ మద్దతు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడ్డ విషయం తెలిసిందే. 18 మందిపై వేటు వేసినా, ప్రభుత్వంలో ఉన్న స్లీపర్ సెల్ మంత్రులు, ఎమ్మెల్యే మరికొందరు తమ పని ఏదో ఒకరోజు మొదలెట్టడం ఖాయం అని దినకరన్ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అందరూ తమ వాళ్లేనని, అయితే, వారిని భయ పెట్టి, బెదిరించి దారిలోకి తెచ్చుకుని ఉన్నట్టు ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సహకార మంత్రి సెల్లూరు రాజు తన మదిలో మాటను బయట పెట్టడం సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలకు షాక్ తగిలేలా చేసింది. చిన్నమ్మ జపం అందుకోవడంతో పాటు అన్నీ ఆమె దయే అని సెల్లూరు రాజు వ్యాఖ్యల్ని అందుకోవడం చర్చకు దారితీశాయి.
అన్నీ చిన్నమ్మే
సహకార మంత్రి సెల్లూరు రాజు మీడియాతో మాట్లాడుతూ, చిన్నమ్మ శశికళ ప్రస్తావనను తీసుకొచ్చారు. అన్నాడీఎంకే ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం వెనుక చిన్నమ్మ కృషి ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. అలాగే, ప్రస్తుతం ఈ ప్రభుత్వం మనుగడలో ఉందంటే, అందుకు కారణం కూడా ఆమే అని స్పందించారు. చిన్నమ్మ లేకుండా ఉండి ఉంటే, ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉండేది కాదేమోననంటూ, సీఎం పళని స్వామి గానీయండి, తాను గానీయండి ఈ పదవిలో ఉన్నామంటే అందుకు చిన్నమ్మ కారణం అని, ఇందులో ఎలాంటి మార్పు అన్నది లేదని సెల్లూరు రాజు స్పందించడం సీఎం పళని, డిప్యూటీ పన్నీరు శిబిరానికి షాక్ తగిలేలా చేసింది. ఈ వ్యవహారం కాస్త చర్చకు దారితీసినా, మంత్రి మాత్రం వెనక్కు తగ్గకపోవడం గమనార్హం. అదే సమయంలో మరో మంత్రి వెల్లమండి నటరాజన్ మీడియాతో మాట్లాడుతూ, అమ్మ జయలలితకు అందిన చికిత్స, నటరాజన్‌కు అందుతున్న చికిత్స గురించి ప్రస్తావిస్తూ, అది వేరు, ఇది వేరు అని, చిన్నమ్మ శశికళను ఎవరూ కలవబోరని వ్యాఖ్యానించారు. కాగా, చిన్నమ్మ రాకతో మంత్రులు ఆమె పేరును ఏదో ఒక సందర్భంగా స్మరించే రీతిలో వ్యాఖ్యల్ని అందుకోవడం గమనార్హం.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో దినకరన్ శిబిరం వర్గాలు మాత్రం దూకుడుగా స్పందించే పనిలో పడ్డారు. స్లీపర్ సెల్స్ ఒకొక్కకరుగా బయటకు వస్తున్నారని, అన్నీ చిన్నమ్మకు అనుకూలంగానే పరిణామాలు ఉంటాయని, పళని, పన్నీరులకు మున్ముందుకు షాక్‌ల మీద షాక్‌లు ఎదురు కాబోతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంగా దినకరన్ శిబిరానికి చెందిన మహిళా నేత సీఆర్ సరస్వతి మీడియాతో మాట్లాడుతూ, స్లీపర్ సెల్స్ ఆట ఆరంభం అని వ్యాఖ్యానించడం గమనించాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment