selvarajan nagalakshmi
-
ఏమ్మా.. నాకూ కాస్త అన్నం పెట్టండి : కలెక్టర్ నాగలక్ష్మి
అనంతపురం (రాయదుర్గం/టౌన్) : ‘ఏమ్మా.. అంతా బాగున్నారా? ఉదయమే వచ్చేశాను. మీరు తెచ్చుకున్న క్యారీ ఉందా? ఉంటే నాకూ కాస్త అన్నం పెట్టండి’ అంటూ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ కూలీలతో ఆప్యాయంగా మాట్లాడారు. బుధవారం ఆమె రాయదుర్గం, గుమ్మఘట్ట మండలాల్లో పర్యటించారు. రాయదుర్గం మండలంలోని వేపరాళ్ల, నాగిరెడ్డిపల్లి వద్ద ఉపాధి పనులను పరిశీలించారు. కూలీలతో మమేకమై..వారి సమస్యలను తెలుసుకున్నారు. వేపరాళ్ల గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. రాయదుర్గంలోని బీటీపీ, ముత్తరాసి లేఅవుట్లలో ఇంటి నిర్మాణాలను పరిశీలించి..పురోగతిపై ఆరా తీశారు. తర్వాత గుమ్మఘట్ట మండలంలోని 75 వీరాపురం, అడిగుప్ప గ్రామాల పరిధిలో ఉపాధి పనులను పరిశీలించారు. శిరిగెదొడ్డి గ్రామ సచివాలయాన్ని, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో కూలీలతో మాట్లాడుతూ రూ.250 దినసరి కూలి అందేలా పనులు చేసుకోవాలని సూచించారు. ప్రతి పనీ నాణ్యతగా ఉండాలన్నారు. వేపరాళ్లలో రెండు వారాల వేతనం అందలేదని కూలీలు తెలపగా.. సత్వరమే సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోజూ రెండు లక్షల మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మే 14 వరకు ఉన్న వేతనాలన్నీ జమ చేశామని, ఒకట్రెండు రోజుల్లో మిగిలినవీ చెల్లిస్తామని చెప్పారు. అనంతరం కూలీలకు లేబర్ కార్డులు పంపిణీ చేశారు. సచివాలయాల్లో పౌర సేవలు మరింత మెరుగ్గా అందివ్వాలని సిబ్బందిని ఆదేశించారు. వి«ధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయ, ఆర్బీకే భవన నిర్మాణాలను పరిశీలించి.. పురోగతిపై డీఈ రామమోహన్‌రెడ్డితో ఆరా తీశారు. నెలాఖరులోపు గ్రౌండింగ్ చేయాలి.. జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను నెలాఖరులోపరు గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి లబ్ధిదారుడు నెలాఖరులోగా కచ్చితంగా నిర్మాణాన్ని ప్రారంభించేలా చూడాల్సిన బాధ్యత హౌసింగ్, మున్సిపల్, సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు. లేఅవుట్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, కళ్యాణదుర్గం ఆర్డీఓ నిషాంత్‌రెడ్డి, ఏపీడీ శంకర్, తహసీల్దార్ మారుతి, ఎంపీడీఓ కొండన్న తదితరులు పాల్గొన్నారు. -
జీఎంసీ కమిషనర్‌కు నెలరోజుల జైలు శిక్ష
హైదరాబాద్: అక్రమ నిర్మాణదారుతో కుమ్మక్కై, కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం..కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడంపై గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ (జీఎంసీ) కమిషనర్ సెల్వరాజన్ నాగలక్ష్మీపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే నాగలక్ష్మీ కోర్టు ఆదేశాలు అమలు చేయలేదని, ఇది కోర్టు ధిక్కారమే అవుతుందని హైకోర్టు తేల్చింది. ఇందుకు గాను ఆమెకు నెల రోజుల సాధారణ జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. అక్రమ నిర్మాణాన్ని ఆపాలన్న తమ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాణాలను కొనసాగించిన డాక్టర్ వరప్రసాద్ సైతం కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు గాను ఆయనకు కూడా రెండు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెలరోజుల పాటు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని వారికి తేల్చి చెప్పింది. డాక్టర్ వరప్రసాద్‌కు అదనపు అంతస్తుల నిర్మాణం నిమిత్తం జీఎంసీ ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది. అంతేకాక ఆ భవన నిర్మాణాలను క్రమబద్దీకరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కూడా రద్దు చేసింది. కొత్తపేటలో డాక్టర్ ప్రసాద్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను నాలుగు వారాల్లో కూల్చేయాలని మునిసిపల్ అధికారులను ఆదేశించింది. కూల్చివేత పూర్తయ్యేంత వరకు ఆ ఆస్తిని ఇతరులకు విక్రయించడం గానీ, బదలాయింపు చేయడం గానీ చేయరాదని వరప్రసాద్‌కు స్పష్టం చేసింది. కూల్చివేత సమయంలో అధికారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని స్థానిక పోలీసులను ఆదేశించింది. ఖర్చుల కింద పిటిషనర్‌కు చెరో రూ.20 వేలు చెల్లించాలని నాగలక్ష్మీ, వరప్రసాద్‌లను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. ఈ తీర్పుపై అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును నాలుగు వారాల పాటు నిలిపేస్తున్నట్లు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా, కొత్తపేట, శివాలయం ఎదురుగా డాక్టర్ కె.వరప్రసాద్ ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ డాక్టర్ ధూళిపాళ్ల మురళి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, అనుమతి తీసుకోకుండా వరప్రసాద్ నిర్మిస్తున్న మూడవ అంతస్తు పనులను వెంటనే నిలిపేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలకు విరుద్ధంగా వరప్రసాద్ ఏడు అంతస్తులు నిర్మిస్తున్నారని, కోర్టు ఆదేశాలను అటు వరప్రసాద్, ఇటు కార్పొరేషన్ అధికారులు ఉల్లంఘించారంటూ డాక్టర్ మురళీ తరఫు న్యాయవాది వి.సూర్యకిరణ్ వారిపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి పూర్తిస్థాయిలో విచారణ జరిపారు. హైకోర్టు ఆదేశాలకు జిల్లా జడ్జి నుంచి సైతం నివేదిక ఇచ్చారు. అన్నింటినీ పరిశీలించిన న్యాయమూర్తి ఇటీవల తుది తీర్పు వెలువరించారు.