వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి రేటు 6.4 శాతం
డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ అంచనా
ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.4% వృద్ధిని సాధించగలదని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ తాజాగా అంచనా వేసింది. పెట్టుబడుల వాతావరణం పుంజుకోవడం ఇందుకు సహకరించగలదని ఒక నివేదికలో పేర్కొంది. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకావడం, కీలక సంస్కరణలు తీసుకురావడం వంటి అంశాలు సైతం జీడీపీకి జోష్‌నిస్తాయని కంపెనీ సీనియర్ ఆర్థికవేత్త అరుణ్ సింగ్ చెప్పారు. ఇక ఈ ఏడాదికి(2014-15) జీడీపీ వృద్ధి 5.3%గా నమోదు కాగలదని అంచనా వేశారు.
సమీప భవిష్యత్‌లో ద్రవ్యోల్బణం తీరు, పారిశ్రామిక పురోగతి, క్షీణిస్తున్న చమురు ధరలు వంటివి వృద్ధికి కీలకంగా నిలవనున్నట్లు నివేదిక పేర్కొంది. ఇంధన సబ్సిడీలను తొలగించడం, సామాజిక మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచడం వంటి వివిధ ప్రభుత్వ విధానాలకుతోడు, ఆర్బీఐ చేపట్టనున్న ఆర్థిక రంగ సంస్కరణలు వృద్ధికి దోహదం చేస్తాయని వివరించింది.