పె(టె)న్షన్
అనంతపురం టౌన్ : ఉద్యోగుల మాదిరిగా ఒకటో తేదీనే ఠంఛన్‌గా పింఛన్ అందుకునే రోజులు పోయాయి. సగం నెల దాటినా పింఛన్ ఎప్పుడు పంపిణీ చేస్తారో చెప్పేవారు కూడా కరువయ్యారు. లబ్ధిదారులు ఏ రోజుకారోజు ఆశతో పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చి నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో సామాజిక భద్రత పింఛన్ పంపిణీ అస్తవ్యస్తంగా తయారైంది. జిల్లాలో ప్రతి నెలా 4,12,111 మంది లబ్ధిదారులు పింఛన్ పొందుతున్నారు. ఇందులో వృద్ధులు 2,24,124 మంది, వికలాంగులు 54,061 మంది, వితంతువులు 1,65,166 మంది, అభయహస్తం లబ్ధిదారులు 17,284 మంది, కల్లుగీత కార్మికులు 130 మంది, చేనేత కార్మికులు 11,658 మంది ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పింఛన్‌దారులకు ఒకటో తేదీనే బట్వాడాలు చేసేవారు. 28వ తేదీ నుంచే ఎంపీడీఓల ఖాతాల్లో నిధులు జమ చేసేవారు. ఆయన పాలనలో ఒకటి, రెండు దఫాల్లో తప్ప ఏనాడూ 5వ తేదీ తర్వాత పింఛన్ పంపిణీ చేసిన దాఖ లాలు లేవని అధికారులే అంగీకరిస్తున్నారు. అయితే వైఎస్ మరణాంతరం పింఛన్ పంపిణీ తేదీలు పొడిగిస్తూ పోతున్నారు. మొన్నటి వరకూ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో 10వ తేదీన పంపిణీ చేయడం మొదలు పెట్టారు. గత రెండు నెలల నుంచి 15 నుంచి 25వ తేదీ మధ్య పంపిణీ చేశారు. దీనికి తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని పింఛన్‌దారులు, అధికారవర్గాలు విమర్శిస్తున్నాయి.
ముఖ్యంగా స్మార్ట్‌కార్డు విధానం ముందు నుంచి అమలు చేయాలని పరిగణనలో ఉన్నా అన్ని అర్హతలూ ఉన్న వారికి స్మార్ట్‌కార్డు ద్వారా, లేని వారికి మ్యానువల్ పద్ధతిలో మంజూరు చేస్తూ ఎక్కడా ఇబ్బందులు రాకుండా పంపిణీ చేశారు. కానీ రెండు నెలలు నుంచి ఖచ్చితంగా స్మార్ట్‌కార్డు ద్వారానే పంపిణీ చేయాలనే నిబంధన విధించడంతో నెలనెలా వేల సంఖ్యలో లబ్ధిదారుల పింఛన్లను నిలుపుదల చేస్తున్నారు. దీనికి తోడు పింఛన్ నిధులు మంజూరు చేయడంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్నికల ముందు నుంచి 15వ తేదీ తర్వాతనే ప్రభుత్వం మంజూరు చేస్తుండడం ద్వారా కలెక్టర్ అనుమతి పొందేసరికి 20వ తేదీ వస్తోంది. దీని వలన లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పింఛన్ల పెంపు ఎప్పటి నుంచో..
తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తానే పింఛన్ మొత్తాన్ని పెంచుతామని ప్రజలకు హామీ ఇచ్చింది. ప్రస్తుతం వితంతువులు, వృద్ధులు, కల్లుగీత కార్మికులు, చేనేతలకు అందుతున్న రూ. 200 పింఛన్‌ను రూ. 1000కు, 80 శాతం వైకల్యం ఉన్న వికలాంగులకు రూ.500 నుంచి రూ.1500కు పెంచుతామని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండు నెలలవుతున్నా ఇంతవరకూ పెంచిన పింఛన్లు ఎప్పటి నుంచి అమలు చేస్తామనేది ప్రకటించలేదు.
ఇదిలా ఉంటే అభయహస్తం పింఛన్‌దారులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలు నెలనెలా ప్రీమియం చెల్లిస్తే 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెలా రూ. 500 పింఛన్ అందజే శారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవతో ఈ పథకం అమలైంది. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పథకానికి నిబంధనల సంకెళ్లు వేసి కొత్తగా ప్రీమియం కట్టేందుకు వెసులుబాటు లేకుండా చేసింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అభయహస్తం పింఛన్ పథకాన్ని కొనసాగిస్తుందా? ఇది వరకే రూ. 500 పింఛన్ తీసుకుంటున్న వారికి ఎంతకు పెంచుతారు ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రొసీడింగ్స్ వచ్చాయి
పింఛన్ లబ్ధిదారులకు బట్వాడాలు చెల్లించేందుకు ఆదివారం ప్రొసీడింగ్స్ వచ్చాయి. సోమ, మంగళవారాల్లో కలెక్టర్ అనుమతి తీసుకుంటాం. అనంతరం ఎప్పుడు పింఛన్ పంపిణీ చేస్తామో పత్రికా ముఖంగా లబ్ధిదారులకు తెలియపరుస్తాం. బహుశా బుధ, గురువారాల నుంచి పింఛన్ పంపిణీ చేసే అవకాశం ఉంది.
- నీలకంఠారెడ్డి, పీడీ, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ