Sensex today
-
5 వారాల్లో గరిష్ట నష్టం
అమెరికా వడ్డీ పెంపు భయాలు, డీలాపడ్డ పారిశ్రామికోత్పత్తి వంటి అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. దీంతో సెన్సెక్స్ గత ఐదు వారాల్లోలేని విధంగా 244 పాయింట్లు పతనమైంది. వెరసి రెండు వారాల కనిష్టమైన 26,816 వద్ద ముగిసింది. ఆగస్ట్ నెలకు చైనా తయారీ గణాంకాలు మందగించడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బకొట్టింది. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి 61.14 స్థాయికి బలహీనపడటం దీనికి జత కలిసింది. ఫలితంగా నిఫ్టీ సైతం 63 పాయింట్లు క్షీణించి 8,042 వద్ద నిలిచింది. గడిచిన శుక్రవారం మార్కెట్లు ముగిశాక వెలువడ్డ దేశీ గణాంకాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహపరచాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్ష మంగళవారం మొదలుకానున్న నేపథ్యంలో మార్కెట్లో ఆందోళనలు పెరిగాయని తెలిపారు. మెటల్ షేర్ల దిగాలు చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన సంకేతాలతో మెటల్ షేర్లు నీరసించాయి. ప్రధానంగా భూషణ్ స్టీల్, జిందాల్ స్టీల్, హిందాల్కో, టాటా స్టీల్ 5-2% మధ్య పతనమయ్యాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో ఓఎన్జీసీ, టీసీఎస్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఎంఅండ్ఎం 1.5% స్థాయిలో నష్టపోయాయి. అయితే మరోపక్క సిప్లా 3% జంప్‌చేయగా, హీరో మోటో 1.5% లాభపడింది. చిన్న షేర్లకు డిమాండ్ ప్రధాన సూచీలకు విరుద్ధమైన రీతిలో చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగింది. ట్రేడైన షేర్లలో 1,757 లాభపడగా, 1,301 నష్టపోయాయి. బీమా ఉత్పత్తులు, సర్వీసుల బిజినెస్‌ను మజెస్కో పేరుతో ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు డెరైక్టర్ల బోర్డ్ నిర్ణయించడంతో మాస్టెక్ షేరు 16% ఎగసింది. బీఎస్ఈలో రూ. 272 వద్ద ముగిసింది. దీనిలో భాగంగా వాటాదారులకు ప్రతీ ఒక మాస్టెక్ వాటాకుగాను ఒక మాజెస్కో షేరు లభించనుంది. ఇక బీఎస్ఈ-500లో భాగమైన జీఎస్ఎఫ్సీ, జెన్సార్, ఫైజర్, పీసీ జువెలర్స్, సీఈఎస్సీ, జీఈ షిప్పింగ్, రుచీ సోయా, ఫ్యూచర్ రిటైల్, ఫోర్టిస్, ట్రెంట్, జైడస్ వెల్ నెస్, షసున్ ఫార్మా 13-6% మధ్య పురోగమించాయి. -
రోజంతా అమ్మకాలే
ప్రపంచ మార్కెట్ల నష్టాలు దేశీయ స్టాక్స్‌పైనా ప్రభావం చూపాయి. మరోవైపు మార్చి నెలకు వాణిజ్య లోటు 10.5 బిలియన్ డాలర్లకు చేరడంతో సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో ఇటీవల భారీగా లాభపడుతూ వ చ్చిన మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలకు దిగారు. వెరసి సెన్సెక్స్ రోజంతా నష్టాలలోనే కదిలింది. ఒక దశలో 190 పాయింట్ల వరకూ క్షీణించి 22,526 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివర్లో షార్ట్ కవరింగ్ కారణంగా కొంత కోలుకుని 86 పాయింట్ల నష్టంతో 22,629 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ కూడా 20 పాయింట్లు తగ్గి 6,776 వద్ద నిలిచింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 372 పాయింట్లు ఎగసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆయిల్, బ్యాంకింగ్, ఆటో రంగాలు 1% స్థాయిలో నీరసించగా, ఐటీ ఇండెక్స్ 1.5%, హెల్త్‌కేర్ 1% చొప్పున పుంజుకున్నాయి. వెలుగులో సాఫ్ట్వేర్ షేర్లు వచ్చే వారం మొదట్లో ఫలితాలు ప్రకటించనున్న సాఫ్ట్వేర్ దిగ్గజాల షేర్లు వెలుగులో నిలిచాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ 2-1% మధ్య పుంజుకోగా, హెల్త్‌కేర్ దిగ్గజాలు సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ సైతం అదే స్థాయిలో లాభపడ్డాయి. కాగా, మరోవైపు ఆటో దిగ్గజాలు ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, హీరోమోటో, మారుతీ సహా ఆర్ఐఎల్, ఎస్బీఐ, హిందాల్కో, హెచ్‌యూఎల్, ఎల్అండ్టీ 1.5% స్థాయిలో క్షీణించాయి. ఎఫ్ఐఐల అమ్మకాలు శుక్రవారం కూడా చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగింది. దీంతో ట్రేడైన షేర్లలో 1,539 పురోగమిస్తే, 1,267 నష్టపోయాయి. ఇటీవల నికర పెట్టుబడులకే కట్టుబడుతున్న ఎఫ్ఐఐలు తొలిసారి 362 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీ ఫండ్స్ రూటగు మార్చి రూ. 365 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. -
లాభాల్లో సెన్సెక్స్, నష్టాల్లో నిఫ్టీ
550 పాయింట్ల భారీ హెచ్చుతగ్గులు లాభాల్లో సెన్సెక్స్, నష్టాల్లో నిఫ్టీ కొత్త గరిష్టాలను తాకిన ఐటీ షేర్లు కొనసాగిన బ్యాంకింగ్ షేర్ల పతనం మరోసారి మార్కెట్లను రూపాయి పడగొట్టింది. డాలరుతో మారకంలో భారీగా బలహీపడి 68ను దాటడం ద్వారా బుధవారం ఇన్వెస్టర్లను బెంబేలెత్తించింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇండెక్స్‌లు నష్టపోయాయి. 110 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఒక దశలో 520 పాయింట్లు పడిపోయి కనిష్టంగా 17,448ను తాకింది. సిరియాపై అమెరికా దాడిచేయవచ్చునన్న భయాలు కూడా ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు పరుగుతీయించాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే మిడ్ సెషన్ తరువాత రూపాయి కొంతమేర కోలుకోవడానికితోడు, కనిష్ట స్థాయిలవద్ద కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్ చివర్లో వేగంగా పుంజుకుంది. బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ భారీ కొనుగోళ్లను చేపట్టినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా నష్టాలు భ ర్తీకావడమే కాకుండా ట్రేడింగ్ ముగిసేసరికిసెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతో 17,996 వద్ద నిలిచింది. ఈ బాటలో 18,101 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని సైతం చేరింది. ఇదే బాటలో సాగిన నిఫ్టీ కూడా 5,118-5,318 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరికి 2 పాయింట్ల స్వల్ప నష్టంతో 5,285 వద్ద స్థిరపడింది. ఐటీ దిగ్గజాల దూకుడు రూపాయితో మారకంలో డాలరు బలపడుతుండటంతో దేశీయ ఐటీ కంపెనీల షేర్లు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. అమెరికా తదితర దేశాలకు సాఫ్ట్వేర్ సేవలను ఎగుమతి చేయడం ద్వారా అత్యధిక శాతం ఆదాయాన్ని డాలర్లలో ఆర్జిస్తుండటమే దీనికి కారణం. వెరసి 3.5% స్థాయిలో ఎగసిన ఐటీ దిగ్గజాలు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొత్త గరిష్టాలను తాకగా, 2% పుంజుకున్న ఇన్ఫోసిస్ ఏడాది గరిష్టానికి చేరింది. ఈ బాటలో విప్రో, ఎంఫసిస్, మైండ్‌ట్రీ సైతం 3.6-2.8% మధ్య పురోగమించాయి. దీంతో బీఎస్ఈలో ఐటీ ఇండె క్స్ అత్యధికంగా 2.7% లాభపడింది. కాగా, సెన్సెక్స్‌లో జిందాల్ స్టీల్, టాటా పవర్, హిందాల్కో, టాటా మోటార్స్, టాటా స్టీల్, భెల్ 3.7-2% మధ్య బలపడ్డాయి. అయితే మరోవైపు రూపాయి పతనం కారణంగా ఆయిల్ షేర్లు భారీగా నష్టపోయాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, గెయిల్ 8-3.5% మధ్య దిగజారాయి. ఫైనాన్షియల్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ 5% పతనంకాగా, బ్యాంకింగ్ షేర్లు యూబీఐ, పీఎన్బీ, బీవోఐ, యాక్సిస్, యస్ బ్యాంక్, ఫెడరల్, కెనరా బ్యాంక్, బీవోబీ, ఎస్బీఐ 6-1.5% మధ్య క్షీణించాయి. ఇక సెంటిమెంట్‌కు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు సైతం 1% చొప్పున డీలాపడ్డాయి. ఎఫ్ఐఐల అమ్మకాల జోరు గత రెండు రోజుల్లో రూ. 2,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్ఐఐలు బుధవారం మరో రూ. 1,120 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మరోపక్క దేశీయ ఫండ్స్ రూ. 507 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. -
రూపాయి135 పైసలు అప్ - 63.20 వద్ద ముగింపు
ముంబై: ఆరు రోజుల వరుస పతనానికి బ్రేక్ వేస్తూ.. రూపాయి శుక్రవారం అనూహ్యంగా కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే ఏకంగా 135 పైసలు పెరిగి 63.20 వద్ద క్లోజయ్యింది. ఇంత స్థాయిలో పెరగడం ఈ ద శాబ్దంలో ఇది రెండోసారి. ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్ గురువారం చేసిన వ్యాఖ్యలు రూపాయి బలపడటానికి దోహదపడ్డాయి. దేశీ కరెన్సీ గురువారం ఇంట్రాడేలో ఆల్‌టైం కనిష్టం 65.56కి పడిపోయిన నేపథ్యంలో నిరాశావాదానికి లోనుకానక్కర్లేదంటూ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉన్నాయంటూ ఆర్బీఐ ప్రకటించడం మార్కెట్ వర్గాలకు కాస్త భరోసా కల్పించాయి. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 64.55తో పోలిస్తే పటిష్టంగా 64.30 వ ద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే, ఆ తర్వాత కనిష్ట స్థాయి 64.75కి కూడా తగ్గింది. కానీ చివర్లో 2.09 శాతం ఎగిసి 63.20 వద్ద ముగిసింది. 2009 మే 18 తర్వాత ఒక్క రోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అప్పట్లో దేశీ కరెన్సీ 152 పైసలు (3.08 శాతం) ఎగిసింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో ప్రభుత్వరంగ బ్యాంకులు డాలర్లను విక్రయించి ఉంటాయని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఫిక్స్డ్ ఇన్కమ్ ట్రేడింగ్ విభాగం హెడ్ ఆగమ్ గుప్తా తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో హెచ్చుతగ్గులను నియంత్రించడంపై ప్రభుత్వం, ఆర్బీఐ పట్టుదలగా ఉన్నాయనే భరోసాతో కార్పొరేట్లు కూడా డాలర్లను విక్రయించారని ఆయన పేర్కొన్నారు. స్పాట్ ట్రేడింగ్‌లో దేశీ కరెన్సీ 63.40-64.60 శ్రేణిలో తిరుగాడవచ్చని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. 60-61కి పెరగొచ్చు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత కరెంటు ఖాతా లోటు (క్యాడ్) 80 బిలియన్ డాలర్ల నుంచి 68 బిలియన్ డాలర్లకు తగ్గగలదని బ్రిటన్‌కి చెందిన బార్క్లేస్ బ్యాంక్ అంచనా వేసింది. భారత్ క్యాడ్‌ని పూర్తిగా భర్తీ చేసుకోగలదని పేర్కొంది. దీంతో వచ్చే 12 నెలల్లో రూపాయి విలువ 61 స్థాయికి కోలుకోగలదని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి దేశీ కరెన్సీ 60 స్థాయికి పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. బంగారం సహా చమురుయేతర దిగుమతులు ద్వితీయార్థంలో దిగిరావడం ద్వారా క్యాడ్ గణనీయంగా తగ్గగలదని పేర్కొంది.