అమెరికా వడ్డీ పెంపు భయాలు, డీలాపడ్డ పారిశ్రామికోత్పత్తి వంటి అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లను పడగొట్టాయి. దీంతో సెన్సెక్స్ గత ఐదు వారాల్లోలేని విధంగా 244 పాయింట్లు పతనమైంది. వెరసి రెండు వారాల కనిష్టమైన 26,816 వద్ద ముగిసింది. ఆగస్ట్ నెలకు చైనా తయారీ గణాంకాలు మందగించడం కూడా సెంటిమెంట్‌ను దెబ్బకొట్టింది.
మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి 61.14 స్థాయికి బలహీనపడటం దీనికి జత కలిసింది. ఫలితంగా నిఫ్టీ సైతం 63 పాయింట్లు క్షీణించి 8,042 వద్ద నిలిచింది. గడిచిన శుక్రవారం మార్కెట్లు ముగిశాక వెలువడ్డ దేశీ గణాంకాలు ఇన్వెస్టర్లను నిరుత్సాహపరచాయని విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్ష మంగళవారం మొదలుకానున్న నేపథ్యంలో మార్కెట్లో ఆందోళనలు పెరిగాయని తెలిపారు.
మెటల్ షేర్ల దిగాలు
చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన సంకేతాలతో మెటల్ షేర్లు నీరసించాయి. ప్రధానంగా భూషణ్ స్టీల్, జిందాల్ స్టీల్, హిందాల్కో, టాటా స్టీల్ 5-2% మధ్య పతనమయ్యాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ, టీసీఎస్, కోల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎంఅండ్‌ఎం 1.5% స్థాయిలో నష్టపోయాయి. అయితే మరోపక్క సిప్లా 3% జంప్‌చేయగా, హీరో మోటో 1.5% లాభపడింది.
చిన్న షేర్లకు డిమాండ్
ప్రధాన సూచీలకు విరుద్ధమైన రీతిలో చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగింది. ట్రేడైన షేర్లలో 1,757 లాభపడగా, 1,301 నష్టపోయాయి. బీమా ఉత్పత్తులు, సర్వీసుల బిజినెస్‌ను మజెస్కో పేరుతో ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు డెరైక్టర్ల బోర్డ్ నిర్ణయించడంతో మాస్టెక్ షేరు 16% ఎగసింది. బీఎస్‌ఈలో రూ. 272 వద్ద ముగిసింది. దీనిలో భాగంగా వాటాదారులకు ప్రతీ ఒక మాస్టెక్ వాటాకుగాను ఒక మాజెస్కో షేరు లభించనుంది. ఇక బీఎస్‌ఈ-500లో భాగమైన జీఎస్‌ఎఫ్‌సీ, జెన్‌సార్, ఫైజర్, పీసీ జువెలర్స్, సీఈఎస్‌సీ, జీఈ షిప్పింగ్, రుచీ సోయా, ఫ్యూచర్ రిటైల్, ఫోర్టిస్, ట్రెంట్, జైడస్ వెల్ నెస్, షసున్ ఫార్మా 13-6% మధ్య పురోగమించాయి.
5 వారాల్లో గరిష్ట నష్టం
Published Tue, Sep 16 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM
Advertisement