లాభాల్లో సెన్సెక్స్, నష్టాల్లో నిఫ్టీ
550 పాయింట్ల భారీ హెచ్చుతగ్గులు
లాభాల్లో సెన్సెక్స్, నష్టాల్లో నిఫ్టీ
కొత్త గరిష్టాలను తాకిన ఐటీ షేర్లు
కొనసాగిన బ్యాంకింగ్ షేర్ల పతనం
మరోసారి మార్కెట్లను రూపాయి పడగొట్టింది. డాలరుతో మారకంలో భారీగా బలహీపడి 68ను దాటడం ద్వారా బుధవారం ఇన్వెస్టర్లను బెంబేలెత్తించింది. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇండెక్స్‌లు నష్టపోయాయి. 110 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఒక దశలో 520 పాయింట్లు పడిపోయి కనిష్టంగా 17,448ను తాకింది. సిరియాపై అమెరికా దాడిచేయవచ్చునన్న భయాలు కూడా ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు పరుగుతీయించాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే మిడ్ సెషన్ తరువాత రూపాయి కొంతమేర కోలుకోవడానికితోడు, కనిష్ట స్థాయిలవద్ద కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్ చివర్లో వేగంగా పుంజుకుంది. బీమా రంగ దిగ్గజం ఎల్‌ఐసీ భారీ కొనుగోళ్లను చేపట్టినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా నష్టాలు భ ర్తీకావడమే కాకుండా ట్రేడింగ్ ముగిసేసరికిసెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతో 17,996 వద్ద నిలిచింది. ఈ బాటలో 18,101 పాయింట్ల వద్ద గరిష్ట స్థాయిని సైతం చేరింది. ఇదే బాటలో సాగిన నిఫ్టీ కూడా 5,118-5,318 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చివరికి 2 పాయింట్ల స్వల్ప నష్టంతో 5,285 వద్ద స్థిరపడింది.
ఐటీ దిగ్గజాల దూకుడు
రూపాయితో మారకంలో డాలరు బలపడుతుండటంతో దేశీయ ఐటీ కంపెనీల షేర్లు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. అమెరికా తదితర దేశాలకు సాఫ్ట్‌వేర్ సేవలను ఎగుమతి చేయడం ద్వారా అత్యధిక శాతం ఆదాయాన్ని డాలర్లలో ఆర్జిస్తుండటమే దీనికి కారణం. వెరసి 3.5% స్థాయిలో ఎగసిన ఐటీ దిగ్గజాలు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొత్త గరిష్టాలను తాకగా, 2% పుంజుకున్న ఇన్ఫోసిస్ ఏడాది గరిష్టానికి చేరింది. ఈ బాటలో విప్రో, ఎంఫసిస్, మైండ్‌ట్రీ సైతం 3.6-2.8% మధ్య పురోగమించాయి. దీంతో బీఎస్‌ఈలో ఐటీ ఇండె క్స్ అత్యధికంగా 2.7% లాభపడింది. కాగా, సెన్సెక్స్‌లో జిందాల్ స్టీల్, టాటా పవర్, హిందాల్కో, టాటా మోటార్స్, టాటా స్టీల్, భెల్ 3.7-2% మధ్య బలపడ్డాయి.
అయితే మరోవైపు రూపాయి పతనం కారణంగా ఆయిల్ షేర్లు భారీగా నష్టపోయాయి. హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా, గెయిల్ 8-3.5% మధ్య దిగజారాయి. ఫైనాన్షియల్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ 5% పతనంకాగా, బ్యాంకింగ్ షేర్లు యూబీఐ, పీఎన్‌బీ, బీవోఐ, యాక్సిస్, యస్ బ్యాంక్, ఫెడరల్, కెనరా బ్యాంక్, బీవోబీ, ఎస్‌బీఐ 6-1.5% మధ్య క్షీణించాయి. ఇక సెంటిమెంట్‌కు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు సైతం 1% చొప్పున డీలాపడ్డాయి.
ఎఫ్‌ఐఐల అమ్మకాల జోరు
గత రెండు రోజుల్లో రూ. 2,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌ఐఐలు బుధవారం మరో రూ. 1,120 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. మరోపక్క దేశీయ ఫండ్స్ రూ. 507 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.