అదనపు బలగాలు ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ఎలాంటి కీలక బందోబస్తు నిర్వహించాలన్నా అదనపు బలగాల మోహరింపు తప్పనిసరి. జంట కమిషనరేట్లలో నెలకొన్న సిబ్బంది కొరతతోపాటు లా అండ్ ఆర్డర్ కోసం ప్రత్యేక బెటాలియన్లు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు రాష్ట్ర విభజన తరవాత ఈ కోణంలోనూ రెండు కమిషనరేట్లు ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి. దీనికి పరిష్కారం ఎలా? అనే అంశంపై ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన అపాయింటెడ్ డే అయిన జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడతాయి. గరిష్టంగా పదేళ్లపాటు హైదరాబాద్ నగరం రెండింటికీ ఉమ్మడి రాజధానిగా కొనసాగనుంది. ఈ బందోబస్తు, భద్రతలే తమకు భారంగా మారతాయని అధికారులు భావిస్తున్నారు. మరోపక్క గణేష్ ఉత్సవాలతో పాటు కీలకమైన శాంతిభద్రతల సమస్యలు, ఎన్నికలు వంటివి జరిగే సందర్భాల్లో రెండు కమిషనరేట్లకు భారీగా అదనపు బలగాలు అవసరమవుతాయి.
అవి పొరుగు రాష్ట్రంలోకి వెళ్తే...
ఈ బందోబస్తుల కోసం హైదరాబాద్‌కు చుట్టుపక్కల ఉన్న జిల్లాల ఆర్మ్డ్రిజర్వ్ విభాగాలతో పాటు సమీప సీమాంధ్ర జిల్లాలైన కర్నూలు, గుంటూరు, కృష్ణాల నుంచి ఏఆర్, ఇతర సిబ్బందిని ఇక్కడకు పిలిపిస్తున్నారు. ఇప్పటివరకు ఇవన్నీ ఒకే రాష్ట్రం కావడంతో నగర/ సైబరాబాద్ పోలీసు కమిషనర్ అభ్యర్థన మేరకు డీజీపీ తక్షణం ఆదేశాలు జారీ చేస్తూ సమీప సీమాంధ్ర జిల్లాల నుంచి గంటల్లో బలగాలను పంపిస్తున్నాయి. అయితే అపాయింటెడ్ డే తరవాత ఇవి వేర్వేరు రాష్ట్రాలుగా మారుతుండటంతో సీమాంధ్ర జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిపోతాయి. దీంతో బలగాల మోహరింపు ప్రక్రియలో అనేక చిక్కుముడులు వస్తాయి.
అప్పుడు అదనపు బలగాల మోహరింపు, కేటాయింపు అభ్యర్థనలన్నీ నగర కమిషనర్ నుంచి డీజీపీకి, ఆయన నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి చేరాలి. ఇక్కడి సీఎస్ పొరుగు రాష్ట్రానికి (ఆంధ్రప్రదేశ్) చెందిన సీఎస్ ద్వారా అక్కడి డీజీపీకి పంపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రుల జోక్యమూ ఉంటుంది. ఇది జాప్యానికి ఆస్కారమిస్తుంది. ప్రతి ఏడాదీ జరిగే బందోబస్తుల విషయంలో కాస్త ముందుగా అప్రమత్తమై ఈ ఫార్మాలిటీస్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
అయితే హఠాత్తుగా తలెత్తే ఉద్రిక్తతలు, శాంతిభద్రతల సమస్యల విషయంలో ఏమాత్రం జాప్యం జరిగినా పరిస్థితులు చేయిదాటి పోతాయి. ఈ అంశంపైనే జంట కమిషనరేట్ల ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సిటీపై పట్టున్న రాష్ట్ర క్యాడర్‌కు చెందిన అధికారులు విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ఎలాట్ అయితే... వారి విషయంలోనూ ఫార్మాలిటీస్ తప్పనిసరి.
కేంద్ర బలగాలపైనే ఆశలు
అపాయింటెడ్ డే నుంచి ఐదు నెలల్లోనే రెండు కీలక ఘట్టాల్ని జంట కమిషనరేట్లు చవిచూడాల్సి వస్తుంది. ఆగస్టులో గణేష్ ఉత్సవాలు, అక్టోబర్/నవంబర్‌ల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎదురు కానున్నాయి. ఏటా అట్టహాసంగా జరిగే గణేష్ ఉత్సవాలకు దాదాపు 20 వేల మంది అదనపు బలగాలు అవసరం. అలాగే 2009లో నిర్వహించిన జీహెచ్ఎంసీ ఎన్నికలకు 23 వేల మంది అదనపు బలగాలు అవసరమయ్యాయి.
వీరిలో సీమాంధ్ర జిల్లాల నుంచి వచ్చేవారూ అత్యధిక సంఖ్యలోనే ఉండేవారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి జంట కమిషనరేట్ల అధికారులు కేంద్ర బలగాల పైనే ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి రాజధానిగా ఉన్నన్ని రోజులూ ఒకే గవర్నర్ ఉండటం, జీహెచ్ఎంసీ పరిధిలో శాంతిభద్రతల అంశం ఆయన చేతిలోనే ఉండనుండటంతో కొంత ఊరట చెందుతున్నారు. ఆయన జోక్యంతో కేంద్ర బలగాలతో పాటు పొరుగు రాష్ట్రం నుంచీ సిబ్బందిని జాప్యం లేకుండా మోహరించేలా చేయవచ్చని భావిస్తున్నారు. త్వరలో జరుగనున్న ఉన్నతస్థాయి సమీక్షలో ఈ అంశాన్నీ ప్రస్తావించాలని నిర్ణయించారు.